మట్టి మలిచిన మాణిక్యాలు..

డాక్టర్‌ కొడుకు డాక్టర్‌ అవుతాడు.. యాక్టర్‌ తన కొడుకు పెద్ద యాక్టర్‌ కావాలనుకుంటాడు. ఒక రైతు మాత్రం తన కొడుకు రైతు కావాలనుకోడు. వాళ్ల వారసులూ రైతు కావాలని కోరుకోని దుస్థితి.

Published : 11 Mar 2023 00:24 IST

డాక్టర్‌ కొడుకు డాక్టర్‌ అవుతాడు.. యాక్టర్‌ తన కొడుకు పెద్ద యాక్టర్‌ కావాలనుకుంటాడు. ఒక రైతు మాత్రం తన కొడుకు రైతు కావాలనుకోడు. వాళ్ల వారసులూ రైతు కావాలని కోరుకోని దుస్థితి. దీన్ని తిరగరాసి వ్యవసాయంతో సిరులు కురిపిస్తున్నారు ఇద్దరు యువ తరంగాలు... వారి సృజనాత్మక సేద్యానికి  ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌ అందించే ఉత్తమ రైతు పురస్కారం దక్కింది.


పూలతో లాభాల సాగు

చిన్ననాటి నుంచి సేద్యమంటే తనకి మమకారం. భర్తతో కలిసి వ్యాపారం మొదలు పెట్టినా.. కరోనా పరిస్థితులు సాగుబాటకు బాటలు పరిచాయి.  ఈ పరిస్థితుల్లో పూల తోటలతో లాభాల సాగు చేస్తోంది కర్ర అనూష.

అనూషది కరీంనగర్‌ జిల్లా జంగపల్లి. రైతు కుటుంబం. చదువు పూర్తయ్యేదాకా అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్తుండేది. పెళ్లయ్యాక భర్తతో కలిసి హైదరాబాద్‌ వచ్చేసింది. ఇద్దరూ ప్రభుత్వ ప్రాజెక్టుల గుత్తేదార్లుగా పనులు చేసేవారు. కొన్నాళ్లు బాగానే సాగినా కరోనా వ్యాపారాన్ని దెబ్బ తీసింది. దీంతో 2021లో సొంతూరుకు వెళ్లిపోయారు. అత్తింటికి వ్యవసాయమే ఆధారం. వరితో ప్రతిసారీ నష్టాలే వస్తున్నాయని వాపోయేవారు. దీంతో బాగా ఆలోచించి, కొంత సమాచారం సేకరించి పూల తోటలు సాగు చేద్దామని చెప్పింది అనూష. ఇంట్లోవాళ్లు అతి కష్టమ్మీద ఒప్పుకున్నారు. చేతిలో ఉద్యోగం, వ్యాపారం లేకపోవడంతో.. పూర్తిస్థాయిలో సాగుకే అంకితమైందామె. ఐదెకరాల్లో మల్లెపూలు, లిల్లీ, చామంతి, గులాబీ, బంతి తోటలు వేసింది. అనుభవజ్ఞులు, నిపుణులతో చర్చిస్తూ.. అంతర్జాలం ద్వారా సమాచారం సేకరిస్తూ.. ఆధునిక సాగు పద్ధతులు పాటించేది. తర్వాత కుసుమ పంట వేశారు. తక్కువ కాలంలోనే.. గణనీయమైన ఫలితాలు సాధించడంతో ఈ అవార్డుకు ఎంపికైంది.


కలిసొచ్చిన అవకాశం

వ్యవసాయమంటే కష్టాల సాగేనన్నది  ఆ తండ్రి మాట. కొడుకుకేమో మట్టిపైనే మమకారం. కన్నవాళ్ల కోరికతో ఉన్నత చదువులు పూర్తి చేసినా.. అదను చూసి సేద్యంలోకి దిగిపోయాడు. లాభాల పంట పండిస్తూ అవార్డు సొంతం చేసుకున్నాడు తిమ్మనొల్ల రఘునాథ్‌రెడ్డి.

రఘుది రంగారెడ్డి జిల్లా తిరుమలాపూర్‌. వ్యవసాయంపై ఇష్టంతో అగ్రికల్చరల్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. వీలు చిక్కినప్పుడల్లా పొలం పనుల్లో తండ్రికి చేదోడుగా ఉండేవాడు. చదువు పూర్తవగానే ఓ రెండేళ్లు పొలాన్ని తనకివ్వమనీ, అన్నిరకాల పంటలు పండించి చూపిస్తానని నాన్నను కోరాడు. ‘వ్యవసాయంతో నేనే అష్టకష్టాలు పడుతున్నా. నువ్వూ ఈ మట్టి పనిలోకి దిగొద్దు. మంచి ఉద్యోగంలో స్థిరపడాలి’ అని కోరాడు రఘు నాన్న. అయితే కరోనా లాక్‌డౌన్‌ తనకి అనుకోని వరంలా మారింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉండటంతో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిపోయాడు. తండ్రిని ఒప్పించి క్యారెట్‌ వేశాడు. ఆధునిక పద్ధతులు పాటించాడు. ఆ పంటలో లక్షల రూపాయల లాభం కళ్లజూశాడు. తర్వాత ప్రయోగాత్మకంగా కుసుమ పంట వేశారు. ఈ కుసుమ పూలపై తేనెటీగలు ఎక్కువగా వచ్చి వాలుతుంటాయి. దీంతో హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వెళ్లి  తేనెటీగల పెంపకంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నాడు. లాభసాటి సేద్యం, కొత్త విధానాల్లో సాగుతో అవార్డుకు ఎంపికయ్యాడు.   

భూపతి సత్యనారాయణ, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని