కష్టాల వర్ణాల్లో..మెరిసిన చిత్తరువులు

పనులు చేస్తూనే ఫైనార్ట్స్‌ కోర్సులో చేరాడు. కలలకు రంగులద్ది కళాకారుడిగా ఎదిగాడు. ఆశయాలనే కాన్వాసులుగా మలిచి అవార్డులూ గెలిచాడు.

Updated : 13 Apr 2024 02:24 IST

 పనులు చేస్తూనే ఫైనార్ట్స్‌ కోర్సులో చేరాడు. కలలకు రంగులద్ది కళాకారుడిగా ఎదిగాడు. ఆశయాలనే కాన్వాసులుగా మలిచి అవార్డులూ గెలిచాడు.చిట్టి చేతులతో మేటి చిత్తరువులు గీయిస్తూ.. తన కుంచెకో సార్థకత తెచ్చాడు. తనే విక్రమ్‌రాజ్‌ సావటి.

ఇటీవలే హైదరాబాద్‌ లో ‘ఐకోనోఫ్రేమ్‌ 2024’ పేరిట కళాకృతులు ప్రదర్శించి ఆకట్టుకున్నాడు విక్రమ్‌. ‘ప్రపంచం నలుమూలల నుంచి సమాచారం సేకరించి.. సమాజానికి అందించి.. మానవాళిని మేల్కొలిపే మాధ్యమం మీడియా. వాటిని వెనక ఉండి ముందుకు నడిపించే మీడియా దిగ్గజాల గొప్పతనాన్ని నా చిత్రాల్లో చూపించా’ అంటూ ఈ కార్యక్రమం వెనకాల ఉన్న కారణాన్ని వివరించాడు. ప్రస్తుతం ఆయన డ్రాయింగ్‌ మాస్టారుగా చేస్తున్నాడు. అంతకు ముందు కొన్నాళ్లు సినిమా, మీడియా రంగాల్లో ప్రకటనలు, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ విభాగంలో పని చేశాడు. చిత్రకారుడుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులూ సొంతం చేసుకున్నాడు. అందమైన చేతిరాత (కాలిగ్రఫీ) లోనూ పురస్కారాలు దక్కించు కున్నాడు. జీవకళ ఉట్టిపడేలా చిత్రాలను సృష్టించే విక్రమ్‌రాజ్‌ది వరంగల్‌ జిల్లాలో జాకారం. వేణుమాధవ రావు అనే ఆర్ట్‌ టీచర్‌ స్ఫూర్తితో బొమ్మలపై మమకారం మొదలైంది. కానీ తనదేమో పెన్సిళ్లు కూడా కొనుక్కోలేనంత పేదరికం. అందుకే పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడు కూలి పనులకెళ్లేవాడు. వచ్చిన డబ్బులతో నోటుపుస్తకాలు, డ్రాయింగ్‌ షీట్లు, పెన్సిళ్లు, రంగులు కొనుక్కొని బొమ్మలేసి సర్‌కి చూపించేవాడు. వయసు పెరిగినకొద్దీ చెక్లోజ్‌, రాజా రవివర్మ, ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ లాంటి ప్రఖ్యాత చిత్రకారుల పెయింటింగ్స్‌ని అనుకరించేవాడు. తర్వాత అనుభవం కోసం స్థానిక కమర్షియల్‌ ఆర్టిస్టుల దగ్గర పని చేయడం ప్రారంభించాడు. అక్కడ సైన్‌బోర్డులు, గోడలపై చిత్రాలు వేయడం.. గుళ్లలో బొమ్మలేయడం చేసేవాడు.

విక్రమ్‌ లక్ష్యం బొమ్మలేయడం.. బొమ్మలేయడం నేర్పించడం. ఇంటర్‌ కాగానే బీఎఫ్‌ఏ చేయాలనుకున్నాడు. అందుకు పెద్దమొత్తంలో ఫీజు కట్టి కోర్సులో చేరాలి. దానికోసం భవన నిర్మాణ కూలీగా మారాడు. తాపీ మేస్త్రీ పనులు చేశాడు. పెయింటింగ్స్‌పై పట్టు సాధించాక ఓ యాడ్‌ ఏజెన్సీలో పార్ట్‌టైం ఉద్యోగంలో చేరాడు. సాయంత్రం దాకా క్లాసులు, రాత్రి వరకు పని చేస్తూనే.. మెరిట్‌ స్టూడెంట్‌ అవార్డుతో బీఎఫ్‌ఏ పూర్తి చేశాడు. విక్రమ్‌రాజ్‌ మొదట్లో గురుకుల విద్యాలయంలో చదివాడు. ఆ కృతజ్ఞతాభావంతో గురుకుల విద్యాలయాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇంకో ఇద్దరితో కలిసి నాలుగేళ్లు ఫైనార్ట్స్‌ క్లాసులు బోధించాడు. వాళ్లతో కలిసి ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. తర్వాత సెకండరీ స్కూల్‌ విద్యార్థులకు రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఉండాలని ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ చొరవతోనే తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ప్రభుత్వ ఫైనార్ట్స్‌ స్కూల్‌ మొదలైంది. అందులోనే ప్రస్తుతం డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌ లెక్చరర్‌గా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాడు. ఇవన్నీ చేస్తూనే తను వేసిన చిత్రాలతో పదులకొద్దీ ప్రదర్శనలు ఏర్పాటు ఇచ్చాడు. వాతావరణ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో విక్రమ్‌ వేసిన చిత్రాలకు ప్రత్యేక పురస్కారమూ దక్కింది.
ఎంచెర్ల ధనలక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని