10లక్షల మందికి..అన్నదాత

రోజుకి కోట్ల రూపాయలు కూడబెట్టే కుబేరులున్న దేశం మనది... అంతేకాదు.. పట్టెడన్నం దొరక్క కాటికి వెళ్లే అభాగ్యులున్న నిలయమూ మనదే! ఈ చేదునిజమే నిలయ్‌ అగర్వాల్‌ని కదిలించింది.

Published : 04 Mar 2023 00:25 IST

రోజుకి కోట్ల రూపాయలు కూడబెట్టే కుబేరులున్న దేశం మనది... అంతేకాదు.. పట్టెడన్నం దొరక్క కాటికి వెళ్లే అభాగ్యులున్న నిలయమూ మనదే! ఈ చేదునిజమే నిలయ్‌ అగర్వాల్‌ని కదిలించింది. అన్నార్తుల కడుపులు నింపాలనే సదాశయానికి ప్రేరణగా నిలిచింది. నాలుగేళ్ల కిందట తను మొదలుపెట్టిన సేవా క్రతువు లక్షల మందిని చేరింది. ‘విశాలాక్షి ఫౌండేషన్‌’ పేరుతో సలక్షణమైన కార్యక్రమాలు చేపట్టేలా చేసింది. సరదాలే జీవితం అనుకునే వయసులో.. పరోపకారమే జీవితానికి సార్థకత అంటున్న ఆ ముప్పై ఏళ్ల స్ఫూర్తిప్రదాత ప్రస్థానం ఇది.

దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అన్నాడు గురజాడ. కానీ తిండి దొరక్క ఆ మనుషులు మట్టిలో కలిసిపోవడం కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఆ గడ్డుస్థితిని కొంతైనా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు నిలయ్‌. తనది ముందు నుంచీ సాయం చేసే గుణమే. కొలువులో స్థిరపడ్డాక దీన్ని విస్తరించడానికి ఒక స్వచ్ఛందసంస్థ ప్రారంభించాలి అనుకునేవాడు. ఉద్యోగరీత్యా అది ఎప్పటికప్పుడు వాయిదా పడేది. కానీ ఒక దురదృష్టకర సంఘటన తను కార్యక్షేత్రంలో వెంటనే దూకడానికి దోహదపడింది. 2018 అక్టోబరులో జరిగిన ఒక రోడ్డుప్రమాదంలో నిలయ్‌ సన్నిహిత మిత్రురాలిని కోల్పోయాడు. ఆ సంఘటన అతడిని బాగా బాధించింది. ఎవరి ప్రాణం ఎప్పుడెలా పోతుందో తెలియదు. ఉన్నంతకాలం సమాజానికి కొంచెమైనా సాయం చేయాలనుకున్నాడు. 2019 ప్రారంభంలో స్నేహితురాలి పేరు మీదే ‘విశాలాక్షి ఫౌండేషన్‌’ ప్రారంభించాడు.

హేళనలు భరించి..

సంస్థ ప్రారంభించడానికి ముందే.. తను ఏం చేయాలనే దానిపై కొంత పరిశోధన చేశాడు. ఆ సమయంలో కొన్ని కఠోర వాస్తవాలు అతడ్ని నివ్వెరపోయేలా చేశాయి. మనదేశం ప్రపంచస్థాయి కుబేరుల్ని తయారు చేస్తున్నా.. ఇప్పటికీ రోజుకి 7వేల మంది ఆకలితో చనిపోతున్నారు. అందులో 3 వేల మంది చిన్నారులే. అర్ధాకలితో రోజు వెళ్లదీసేవాళ్ల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఈ దయనీయ పరిస్థితే నిలయ్‌ని కదిలించింది. తను ప్రారంభించే సంస్థ ఆకలికి అలమటించే వారిని ఆదుకునేలా ఉండాలనుకున్నాడు. ఇందులోనే పూర్తిస్థాయిలో పని చేయాలనుకొని.. లక్షల జీతమొచ్చే సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ ఉద్యోగాన్నీ వదిలేశాడు. అతడి నిర్ణయాన్ని దగ్గరివాళ్లే వ్యతిరేకించారు. ఆకలితో ఉన్నవాళ్లకి సాయం చేస్తా అన్నప్పుడు.. కొందరు నవ్వారు. ‘నీ దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవు. సాయం చేయడం.. చేయాలని కోరుకున్నంత తేలిక కాదు. నీకు తోడుగా ఎవరూ రారు’ అని హేళన చేశారు. నిలయ్‌ వెనక్కి తగ్గలేదు. ఎలా ముందుకెళ్లాలో తన మనసులో అప్పటికే ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. ముందు లఖ్‌నవూలోని ఒక ప్రాంతాన్ని ఎంచుకొని, అక్కడ ఒక వందమంది కడుపు నింపడానికి ‘మీ సాయం కావాల’ంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. ఆశ్చర్యంగా వెయ్యిమందికి సరిపడా విరాళాలు వచ్చాయి. కొందరు ‘నీతో కలిసి నడుస్తాం’ అని ముందుకొచ్చారు. రెండేళ్లలోనే ఆ కొందరు వెయ్యిమందిగా మారారు. ఒక్క పట్టణంలో మొదలైన సేవా సంకల్పం పదకొండు నగరాలకు విస్తరించింది.

ఆకలి బాధ అనుభవిస్తూ..

నిలయ్‌ది కలిగిన కుటుంబమే. ఆర్థికంగా ఇబ్బందులేం లేవు. అయినా ఆకలి బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకున్నాడు. సంస్థ ప్రారంభించిన తర్వాత తన మొదటి పుట్టినరోజున ఖాళీ కడుపుతో.. దిల్లీ వీధుల్లో 30 కిలోమీటర్లు నడుస్తూ అన్నార్తులకు ఆహారం పంచాడు. ఆ రోజుని గ్లోబల్‌ రోటీ డే గా ప్రకటించి.. రాంచీ, లఖ్‌నవూ, వారణాసి, పుల్వామాలాంటి పట్టణాల్లోని 1,500 మంది యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశాడు. ఆ ఒక్కరోజే 10వేల మందికి ఈ యువసైన్యం అన్నదానం చేసింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ నిలయ్‌ నాయకత్వంలోని యువత ఘనమైన సేవలు అందించింది. 45వేల పేద కుటుంబాలకు అవసరమైన రేషన్‌ సరుకులు పంచారు. కరోనా రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. ఆసుపత్రుల్లో పడకల ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్‌ సిలిండర్లు అమర్చారు. మొత్తమ్మీద సంస్థ తరపున ఇప్పటికి 10లక్షల మందికి ఉచితంగా ఆహారం అందించాడు. దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ, రాంచీ, నోయిడా.. సహా పదకొండు నగరాల్లో అప్రతిహతంగా సేవలు అందిస్తూనే ఉన్నాడు. అతికొద్దిమందితో మొదలైన నిలయ్‌ వెంట ఇప్పుడు దాదాపు వెయ్యిమందితో కూడిన సేవా సైన్యం ఉంది. ఇందులో విద్యార్థులు, చిరుద్యోగులు.. సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ ఉద్యోగులున్నారు. మంచి మనసున్న వారు ఎప్పటికప్పుడు నగదు సాయం చేస్తున్నారు. క్రౌడ్‌ఫండ్‌ వెబ్‌సైట్లు మిలాప్‌, డొనేట్‌కార్ట్‌ ద్వారా సైతం విరాళాలు సేకరిస్తున్నాడు నిలయ్‌. ఈ సంస్థ సేవా నిరతికి దక్కిన ప్రశంసలు, మెచ్చుకోళ్లు, అవార్డులు చాలానే.

పక్కా ప్రణాళికతో..

ఆకలితో ఉన్నవారికి తిండి పెట్టడమే కాదు.. దీర్ఘకాలంలో మెరుగైన సమాజం ఏర్పడాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టాడు నిలయ్‌.

ఆదర్శనీయ మురికివాడ: మురికివాడలంటేనే సమస్యల నిలయాలు. కనీస సదుపాయాలు ఉండవు. ఈ అర్థం మార్చేలా దిల్లీలోని ఒక మురికివాడను ఎంపిక చేసుకొని అక్కడ ‘ది డ్రీమ్‌ స్లమ్‌’ ప్రారంభించాడు. అంటే ఇది ఆదర్శమైన మురికివాడ. ఆ వాడలోని నిరుపేదలకు మూడుపూటలా భోజనం అందేలా సమయానికి రేషన్‌ అందిస్తున్నారు. అక్కడివాళ్లే పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేలా శిక్షణనిప్పించాడు. మురికివాడల గోడలకు రంగులేసి సందర్శనీయ ప్రాంతాలుగా మార్చుతున్నారు. సరుకులు అమ్మే చిరువ్యాపారులూ అక్కడి వాస్తవ్యులే. అక్కడి విద్యావంతులే ఉపాధ్యాయులుగా మారి పార్ట్‌టైంలో పాఠాలు బోధిస్తుంటారు. ఇలా ఇంకో రెండు మురికివాడలను డ్రీమ్‌ స్లమ్‌లుగా మార్చే పనిలో ఉంది విశాలాక్షి ఫౌండేషన్‌.

నాణ్యమైన విద్య: ఒక కుటుంబం పేదరికం పాలవడానికి ప్రధాన కారణం సరైన విద్య లేకపోవడం.. నాణ్యమైన విద్యతోనే మెరుగైన ఉపాధి లభిస్తుందని నమ్ముతాడు నిలయ్‌. అదికాకుండా మురికివాడల్లో ఆహార పొట్లాలు పంచుతున్నప్పుడు అక్కడి పిల్లలు బడికి వెళ్లకపోవడం గమనించాడు. అందుకే.. ‘ప్రాజెక్ట్‌ డ్రీమ్‌ స్కూల్‌’ పేరుతో గుర్‌గ్రామ్‌, లఖ్‌నవూలలో అన్ని వసతులతో నాలుగు స్కూళ్లు నడుపుతున్నాడు. ఇందులో అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి సైతం ఉచితంగా ఇస్తారు. ఈ పాఠశాలల్లో 300 మందికి పైగా భావి భారత పౌరులు తయారవుతున్నారు.

పరిశుభ్రమైన పరిసరాలు: పరిసరాల పరిశుభ్రత, కాలుష్యం తగ్గినప్పుడే పర్యావరణం సమతులంగా ఉంటుంది. మానవాళికి మేలు జరుగుతుంది. అదే ఆశయంతో దిల్లీ, రాంచీ, జైపుర్‌ నగరాల్లో ‘ప్రాజెక్ట్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌’ కార్యక్రమం చేపట్టాడు. ఈ నగరాల్లో సంస్థ తరపున 500మంది కార్యకర్తలు పని చేస్తున్నారు. వీధులు, విద్యాసంస్థల్లో చెత్త, వ్యర్థాలను సేకరిస్తూ పరిసరాలను శుభ్రం చేస్తుంటారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నారు.

‘మా నుంచి సాయం పొందుతున్న వాళ్లు బంగళాలు, కార్లు, నగలు అడగడం లేదు. మాకు, మా పిల్లలకు పట్టెడన్నం పెడితే చాలంటున్నారు. తిండి లేనివారికి అన్నం పెట్టడం ఈ సమాజం బాధ్యత. ఈ క్రమంలో మేం చేస్తున్న సాయం సముద్రంలో నీటి బొట్టంత. దీన్ని ఇంకా విస్తరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ దేశంలో ఆకలి కారణంగా ఏ ఒక్కరూ చనిపోకూడదు అన్నదే నా కోరిక’.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు