Aryan Khan: ఆర్యన్‌ అపహరణకు యత్నం

ప్రముఖ సినీ హీరో షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు సంబంధం ఉన్న మాదక ద్రవ్యాల కేసు ఆదివారం మరో మలుపు తిరిగింది. నౌకలో ఏర్పాటుచేసిన పార్టీ పేరుతో ఆర్యన్‌ ఖాన్‌ను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నం

Updated : 08 Nov 2021 04:57 IST

అది డ్రగ్స్‌ కేసు కానేకాదు

సూత్రధారి సమీర్‌ వాంఖడే

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలు

ముంబయి: ప్రముఖ సినీ హీరో షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు సంబంధం ఉన్న మాదక ద్రవ్యాల కేసు ఆదివారం మరో మలుపు తిరిగింది. నౌకలో ఏర్పాటుచేసిన పార్టీ పేరుతో ఆర్యన్‌ ఖాన్‌ను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నం జరిగిందని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆరోపించడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు ఆరోపణలు చేసిన ఆయన తాజాగా ఈ వివరాలు వెల్లడించడం సంచలనం కలిగించింది. ఈ మొత్తం తతంగానికి ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే దర్శకత్వం వహించారని ఆదివారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాలిక్‌ ఆరోపించారు. ఆయన మాటల్లోనే.. ‘‘ఇందులో సమీర్‌ వాంఖడేకు పాత్ర ఉంది. ముంబయి భాజపా యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మోహిత్‌ భారతీయ ‘మాస్టర్‌ మైండ్‌’గా వ్యవహరించారు. అసలు మత్తు పదార్థాలు దొరకడం అంతా బూటకం. ఇది వాంఖడే, భారతీయ ఆడిన నాటకం. కిడ్నాప్‌పై తొలుత వారిద్దరు ముంబయి శివారులోని ఓషివారా శ్మశానంలో భేటీ అయ్యారు. అయితే వాంఖడే చేసుకున్న అదృష్టమో ఏమిటో.. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఇది రికార్డు కాలేదు. ఇది బయటకు పొక్కడంతో తనపై కుట్ర జరుగుతోందంటూ వాంఖడే పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. వాంఖడేకు ‘ప్రైవేటు సైన్యం’ ఉంది. ఇందులో మోహిత్‌ భారతీయ ఒక సభ్యుడు. పాత్రికేయుడు ఆర్‌.కె.బజాజ్‌, న్యాయవాది ప్రదీప్‌ నంబియార్‌లు కూడా సభ్యులే.

రూ.25 కోట్లు డిమాండ్‌

మోహిత్‌ భారతీయ బావమరిది రిషబ్‌ సచ్‌దేవ ద్వారా కిడ్నాప్‌ ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు. ఆర్యన్‌ ఖాన్‌ తండ్రి షారుక్‌ ఖాన్‌ను రూ.25 కోట్లు డిమాండు చేశారు. రూ.18 కోట్లకు ఒప్పందం కుదిరింది. రూ.50 లక్షలు తీసుకున్నారు. చిన్న పొరపాటు కారణంగా ఈ కిడ్నాప్‌ విఫలమయింది. డ్రగ్స్‌ పట్టుకున్న సమయంలో ఎన్‌సీబీ తరఫున సాక్షిగా ఉన్న కె.పి.గోసాయి.. ఆర్యన్‌ఖాన్‌తో తీసుకున్న సెల్ఫీ వైరల్‌గా మారడంతో చివరికి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రూ.50 లక్షలు ఇచ్చినందుకు షారుక్‌ కూడా నిందితుడేనంటూ వారు ఆయనను కూడా బెదిరించడం ప్రారంభించారు. బయట ఏమీ మాట్లాడకూదని హెచ్చరిస్తున్నారు. భయపడకూదని ఆయనను కోరుతున్నా. కుమారుడు కిడ్నాప్‌నకు గురయితే సొమ్ము చెల్లించిన తండ్రి బాధితుడవుతాడుగానీ నిందితుడు కాడు.

ఆ ముగ్గుర్ని ఎందుకు వదిలేశారో?

ఆర్యన్‌ ఖాన్‌ను క్రూయజ్‌ పార్టీకి ఆహ్వానించింది ప్రతీక్‌ గబ్బా, ఆమిర్‌ ఫర్నిచర్‌వాలా. వారితో పాటు కిడ్నాప్‌కు రూపకల్పన చేసిన రిషబ్‌ సచ్‌దేవను కూడా ఎన్‌సీబీ అధికారులు ఎందుకు విడిచిపెట్టారో తెలియదు. క్రూయజ్‌ పార్టీ నిర్వాహకుడు కషీఫ్‌ ఖాన్‌.. రాష్ట్ర మంత్రి అస్లాం షేక్‌, కొంతమంది మంత్రుల పిల్లలను కూడా పార్టీకి తీసుకెళ్లేలా గట్టిగా ప్రయత్నించాడు. అయితే అవి ఫలించలేదు.

అల్లుడిపై కేసు ఉందని భయపడను

ఆర్యన్‌ఖాన్‌తో పాటు, నా అల్లుడు సమీర్‌ ఖాన్‌ సహా ఎన్‌సీబీ విచారణను ఎరుర్కొంటున్న మొత్తం 26 మందిపై దర్యాప్తునకు ప్రత్యేకంగా సిట్‌ ఏర్పాటు చేయాలి. నా అల్లుడు సమీర్‌ ఖాన్‌పై ఉన్న కేసు పునర్విచారణ చేపడుతామని బెదిరిస్తే భయపడను. (డ్రగ్స్‌ వ్యవహారంలో సమీర్‌ ఖాన్‌ను ఎన్‌సీబీ జనవరిలో అరెస్టు చేసింది. సెప్టెంబరులో ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు.) గుజరాత్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నా అల్లునికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తామని ఎన్‌సీబీ అంటోంది. వీటికి భయపడను.

అతణ్ని ఎందుకు అరెస్టు చేయలేదు?

ఈ కేసులోని సొమ్ము వ్యవహారంలో శాన్‌విల్లే స్టాన్లీ డిసౌజాకు సంబంధం ఉంది. అతడి అసలు పేరు శ్యాండిసౌజా. ఆయనకు ఎన్‌సీబీ అధికారి వి.వి.సింగ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంతవరకు డిసౌజాను ఎందుకు అరెస్టు చేయలేదు? ఓ కేసులో విచారణకు హాజరు కావాలని ఆయనకు ఎస్‌సీబీ నోటీసు ఇచ్చింది కూడా. ఎన్‌సీబీ జోనల్‌ కార్యాలయంలో జరిగే అక్రమాలకు వాంఖడే, వి.వి.సింగ్‌, ఆశీష్‌ రంజన్‌, వాంఖడే డ్రైవర్‌ మానే...ఈ  నలుగురే కారణం. ఈ చతుష్టయంపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠాలకు రక్షణ కల్పిస్తూ వాటిని సేవిస్తున్న వారిని వేధిస్తున్నారు.

షారుక్‌ మద్దతివ్వాలి

నా పోరాటం ఎన్‌సీబీకి, భాజపాకు వ్యతిరేకం కాదు. అక్రమాలనే వ్యతిరేకిస్తున్నా. డ్రగ్స్‌ బెడద నివారణకు సహకరిస్తున్నా. నాకు మద్దతు ఇవ్వాలి. న్యాయం కోసం పోరాడుతున్న నాకు షారుక్‌ ఖాన్‌ కూడా మద్దతు ప్రకటించాలి’’ అని నవాబ్‌ మాలిక్‌ కోరారు.

విచారణకు హాజరుకాని ఆర్యన్‌

జ్వరం కారణంగా ఆర్యన్‌ఖాన్‌ విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు రాలేదని సిట్‌ అధికారులు తెలిపారు.


ఆధారాలేవీ?: ఎన్‌సీబీ

నవాబ్‌ మాలిక్‌ చేసిన ఆరోపణలపై ఎన్‌సీబీ అధికారులు స్పందించారు. ఇందుకు ఆధారాలు ఏవని ప్రశ్నించారు. రుజువులు ఉంటే కోర్టుకు వెళ్లకుండా మీడియాతో ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు. కాగా వరుస ఆరోపణలు చేస్తున్న నవాబ్‌ మాలిక్‌పై సమీర్‌ వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్‌ వాంఖడే బొంబాయి హైకోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు.

* మంత్రి మాలిక్‌ చేసిన ఆరోపణలను మోహిత్‌ భారతీయ ఖండించారు. భాజపా నాయకుడినని తానెప్పుడూ చెప్పుకోలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని