ఎమ్మెల్సీగా షేక్‌ సాబ్జీ ఎన్నిక

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల నుంచి తొలి ప్రాధాన్య ఓట్లతోనే యూటీఎఫ్‌ రాష్ట్రాధ్యక్షుడు షేక్‌ సాబ్జీ విజేతగా నిలిచారు. మరో పక్క గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కల్పలత ఆధిక్యంలో ఉన్నారు.

Updated : 18 Mar 2021 13:23 IST

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ స్థానంలో విజయం
గుంటూరు-కృష్ణా జిల్లాల్లో ఆధిక్యంలో కల్పలత

ఈనాడు- కాకినాడ, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల నుంచి తొలి ప్రాధాన్య ఓట్లతోనే యూటీఎఫ్‌ రాష్ట్రాధ్యక్షుడు షేక్‌ సాబ్జీ విజేతగా నిలిచారు. మరో పక్క గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కల్పలత ఆధిక్యంలో ఉన్నారు.

1,534 ఓట్ల మెజారిటీతో సాబ్జీ గెలుపు
ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌-1938, పీడీఎఫ్‌లతో పాటు 25 ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థి షేక్‌ సాబ్జీ విజేతగా నిలిచారు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే ఆయన విజయం సాధించారని బుధవారం ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 17,467 మంది ఓటర్లు ఉండగా... 16,054 ఓట్లు పోలయ్యాయి. అందులో షేక్‌ సాబ్జీకి 7,987 ఓట్లు రాగా... వైకాపాతో పాటు పీఆర్‌టీయూ  ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో బరిలోకి దిగిన సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుకు 6,453 ఓట్లు దక్కాయి. షేక్‌ సాబ్జీ 1,534 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 11 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీపడ్డారు. వీరిలో తెదేపా మద్దతు తెలిపిన చెరుకూరి సుభాష్‌ చంద్రబోస్‌కు  706 ఓట్లు, భాజపా మద్దతుతో పోటీ చేసిన ఇళ్ల  సత్యనారాయణకు 300 ఓట్లు పడ్డాయి. చెల్లని ఓట్లు 363 నమోదయ్యాయి.
ఇదీ ప్రస్థానం..: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన షేక్‌ సాబ్జీ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఏలూరు మండలం మాదేపల్లి ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంటుగా పని చేస్తూ.. ఇంకా ఐదేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే రాజీనామా చేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. 2019 ఫిబ్రవరిలో సీపీఎస్‌ రద్దు కోరుతూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఏలూరు నుంచి విజయవాడ వరకు నిర్వహించిన పాదయాత్రకు నాయకత్వం వహించారు. ఆయన తండ్రి, తాత, ముత్తాతా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు.

విద్యారంగం ప్రక్షాళనపై సీఎం దృష్టి సారించాలి: షేక్‌ సాబ్జీ
‘ఇద్దరు అధికారులు విద్యాశాఖను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వారిని నియంత్రించాలి. ఉపాధ్యాయులతో, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాలి. ఖాళీగా ఉన్న 25వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి’ అని ఎమ్మెల్సీగా ఎన్నికైన షేక్‌ సాబ్జీ కోరారు.  సీపీఎస్‌ రద్దు కోసం పోరాడతానని, మంచి పీఆర్సీ ఫిట్‌మెంట్‌ కోసం, పోగొట్టుకున్న డీఏలు రాబట్టుకోవడానికి కృషి చేస్తానని చెప్పారు.

గుంటూరు-కృష్ణాలో కొనసాగుతున్న లెక్కింపు
గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత ఆధిక్యంలో ఉన్నారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో బుధవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి దాటినా కొనసాగుతూనే ఉంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 12,554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెల్లని ఓట్లు పోగా అభ్యర్థి విజయానికి 6153 ఓట్లు అవసరమని అధికారులు నిర్ణయించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి 6153 ఓట్లు రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో స్వతంత్ర అభ్యర్థి తమనం కల్పలతకు 3,870 ఓట్లు, పీడీఎఫ్‌ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుకు 2,831 ఓట్లు, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఎ.ఎస్‌.రామకృష్ణకు 1,958 ఓట్లు, ఏపీటీఎఫ్‌ అభ్యర్థి పి.పాండురంగ వరప్రసాదరావుకు 1,490, స్వతంత్ర అభ్యర్థి చందు రామారావుకు 1,063, ఎస్టీయూ అభ్యర్థి పి.వి.మల్లిఖార్జునరావుకు 459, జనసేన మద్దతుతో పోటీ చేసిన గాదె వెంకటేశ్వరరావుకు 231 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో ప్రథమ ప్రాధాన్యత ఓట్లు తక్కువగా వచ్చిన తొమ్మిది మంది అభ్యర్థులను తప్పించారు. అనంతరం ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ఇలా లెక్కించుకుంటూ 16 మంది అభ్యర్థులను తప్పించారు. చివరకు మిగిలిన ముగ్గురి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.  అందుబాటులో ఉన్న సమాచారం మేరకు   కల్పలతకు 5094, బొడ్డు నాగేశ్వరరావుకు 3835, రామకృష్ణకు 2581 ఓట్లు వచ్చాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని