పంజాబ్‌లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరు?

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అధికారికంగా ప్రకటించే విషయమై కాంగ్రెస్‌ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుత సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీయే.....

Updated : 23 Jan 2022 05:36 IST

చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని అధిష్ఠానం అధికారికంగా ప్రకటించగలదా!

పీసీసీ అధ్యక్షుడు సిద్దూ వైఖరిపై అనుమానంతో వెనకడుగు

ఈనాడు, దిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అధికారికంగా ప్రకటించే విషయమై కాంగ్రెస్‌ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుత సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కోరుకుంటున్నారు. ఆయనను సమర్థించే వారి సంఖ్యా పెరుగుతోంది. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సిద్దూ కంటే పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రి చన్నీకే మద్దతిస్తున్నారు. తనను కాకుండా మరెవరినైనా అధికారికంగా ప్రకటిస్తే ఎన్నికల ముంగిట్లో సిద్దూ ఎలా ప్రవర్తిస్తారోననే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న చరణ్‌జీత్‌ను కాదని మరో అభ్యర్థిని ప్రకటించే సాహసం చేయలేకపోతోంది. ఈ రెండింటి మధ్య కాంగ్రెస్‌ నాయకత్వం సతమతమౌతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను సంయుక్త నాయకత్వం ఆధ్వర్యంలోనే ఎదుర్కొంటామని ప్రకటించింది. 

ఆప్‌ విసిరిన సవాల్‌

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన పోటీ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్యే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన ప్రత్యర్థి అయిన ఆప్‌...లోక్‌సభ సభ్యుడైన భగవంత్‌మాన్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి స్పష్టత ఇచ్చినందున కాంగ్రెస్‌ కూడా చన్నీ పేరును ప్రకటించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. 

సర్వే ఏమి చెప్పిందంటే?

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఎవరుండాలి? అంటూ రాహుల్‌ సన్నిహితుడు నిఖిల్‌ ఆళ్వా ట్విటర్‌లో నిర్వహించిన సర్వే పోల్‌లో 1,283 మంది పాల్గొన్నారు. వీరిలో 68.7% మంది చన్నీకే మద్దతుగా నిలిచారు. ఇది పార్టీ నిర్వహించిన సర్వే కాకున్నప్పటికీ అందులో సిద్దూకు 11.5%, సునీల్‌జాఖడ్‌కు 9.3% ఓట్లు వచ్చాయి. 10.4% మంది ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 17న విడుదల చేసిన లఘు చిత్రంలో ముఖ్యమంత్రి పదవికి తగిన వ్యక్తే ఆ సీట్లో ఉంటారు తప్పితే తనకు తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్న వాళ్లు కాదని పేర్కొంది. 36 సెకెండ్ల ఆ వీడియో చివరగా వివిధ కార్యక్రమాల్లో తలమునకలైన చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీతో ముగుస్తుంది. దాంతో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని పరోక్షంగా చెప్పినట్లయిందని పంజాబ్‌ కాంగ్రెస్‌లో ప్రచారం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని