జనసేన ఆవిర్భావ సభకు పాలకుల అడ్డంకులు: నాదెండ్ల మనోహర్‌

‘జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పాలకులు అడుగడుగునా అడ్డు పడుతున్నారు. సభాస్థలి నిర్ణయం కాకుండా రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారు. సభ నిర్వహణకు స్థలాలు ఇచ్చిన రైతులు సాయంత్రానికి రాజకీయ ఒత్తిళ్లతో క్షమించాలని కోరి వెనక్కి వెళ్లిపోయారు.

Published : 06 Mar 2022 05:09 IST

ఈనాడు, అమరావతి: ‘జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పాలకులు అడుగడుగునా అడ్డు పడుతున్నారు. సభాస్థలి నిర్ణయం కాకుండా రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారు. సభ నిర్వహణకు స్థలాలు ఇచ్చిన రైతులు సాయంత్రానికి రాజకీయ ఒత్తిళ్లతో క్షమించాలని కోరి వెనక్కి వెళ్లిపోయారు. మూడు వారాల కిందటే సభ నిర్వహించాలని పవన్‌కల్యాణ్‌ నిర్ణయించినా స్థలం ఇవ్వడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న ఇలాంటి పరిస్థితులపై ప్రతి ప్రజాస్వామ్యవాదీ ఆలోచించాలి’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ‘చివరికి కొందరి సాయంతో మంగళగిరి సమీపంలోని ఇప్పటం వద్ద పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించాం. కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని గత రెండేళ్లుగా చిన్న స్థాయిలోనే ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాం. ఈ ఏడాది మార్చి 14న పెద్ద బహిరంగ సభ 7 ఎకరాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నాం’ అని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే పరిపాలన గాలికి వదిలేసి పాలనాదక్షత లేని వ్యక్తిగా సీఎం జగన్‌ మిగిలిపోయారు. ఉభయగోదావరి జిల్లాల్లో అనేక మత్స్యకార సమస్యలు మా దృష్టికి వచ్చాయి. అర్హులకు పింఛన్లు అందట్లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు 30- 40% మందికే అందుతున్నాయి. తాగడానికి మంచినీరు లేని తీరప్రాంత గ్రామాలు ఉన్నాయి. రాజధానిపై హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వ తీరు వల్ల రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. రాజధాని కోసం రైతులు భూములిస్తే వారిని ఈ ప్రభుత్వం రోడ్డుకీడ్చింది. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. పక్క రాష్ట్రాల వారు మనల్ని చూసి అవహేళన చేసే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం మీద నమ్మకం లేక అప్పు కూడా పుట్టట్లేదు. కొత్త డీజీపీకి ఈ సభ వివరాలు తెలియజేయాలని మా నాయకులు ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మార్పు కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సహకరించాలని విన్నవిస్తున్నాం. జనసేన ఆవిర్భావ సభ తర్వాత పార్టీ విస్తృతంగా జనంలోకి వెళ్లేలా కార్యక్రమాలు ఉంటాయి. పవన్‌కల్యాణ్‌ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు. పార్టీ, కార్యక్రమాలు ప్రజలకు ఎలా ఉపయోగపడాలి అనే అంశంపై ఆయన దిశానిర్దేశం చేస్తారు’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని