కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలి: సోమిరెడ్డి

రాష్ట్రంలో మద్యం తయారీ, అమ్మకాలు, పొరుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న హానికారక మద్యం వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిపించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు

Published : 02 Apr 2022 06:17 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో మద్యం తయారీ, అమ్మకాలు, పొరుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న హానికారక మద్యం వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిపించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండు చేశారు. గోవా నుంచి సముద్ర మార్గం, తారు ట్యాంకర్ల ద్వారా మద్యం అక్రమంగా నెల్లూరుకు వస్తోందని ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నెల్లూరు జిల్లాలో పట్టుబడిన గోవా మద్యాన్ని నేరుగా ప్రభుత్వ దుకాణాల్లోనే అమ్ముతున్నారు. వైకాపా నేతలే దగ్గరుండి ఈ మద్యాన్ని అమ్మిస్తున్నారు. గోవా నుంచి వచ్చిన మద్యం సీసాలను పట్టుకున్న 2 రోజులకే పుదుచ్చేరికి చెందిన మద్యం పట్టుబడింది. మైపాడు బీచ్‌ ద్వారా ఈ విషపూరితమైన మద్యం నెల్లూరు జిల్లాకు వస్తోంది. గోవాలో సీసాను రూ.20కి కొని, స్థానికంగా రూ.200కుపైగా ధరకు విక్రయిస్తున్నారు. దీని వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉంది. 2014లో రాష్ట్రంలో గోవా మద్యం పట్టుబడింది. ఇది తాగిన వారిలో 9 మంది చనిపోయారు. ఆనాడు నమోదు చేసిన కేసులో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. గతంలో నమోదైన 4 కేసులకు సంబంధించిన ఛార్జీషీట్లలోనూ గోవర్ధన్‌రెడ్డి పేరుంది. జగన్‌రెడ్డికి ఏ మాత్రం ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన ఉన్నా ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. అప్పుడే అధికార పార్టీ నేతలు, ఇతర పెద్ద తలకాయల పాత్ర బయటపడుతుంది’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని