గుంటూరు జిన్నాటవర్‌ ముట్టడికి విఫలయత్నం

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర భాజపా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. బీజేవైఎం కార్యకర్తలు గుంటూరులోని

Published : 25 May 2022 05:42 IST

పోలీసులు, బీజేవైఎం కార్యకర్తల మధ్య తోపులాట

ఈనాడు, అమరావతి: ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర భాజపా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. బీజేవైఎం కార్యకర్తలు గుంటూరులోని మాజేటి రాం కల్యాణ మండపం నుంచి మార్కెట్‌ సెంటర్‌లోని హిందూ కళాశాల కూడలి వరకు ర్యాలీ నిర్వహిస్తుండగా శంకర్‌ విలాస్‌ కూడలివద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. నాయకులు, కార్యకర్తలు పోలీసు ఆంక్షలను దాటుకుని ముందుకు సాగారు. మరికొందరు పోలీసుల కళ్లు గప్పి వేరే మార్గాల్లో జిన్నాటవర్‌ వద్దకు చేరుకున్నారు. టవర్‌ చుట్టూ ఏర్పాటు చేసిన ఐరన్‌ మెష్‌లపైకి ఎక్కి లోపలికి ప్రవేశిస్తుండగా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ఓ కార్యకర్త చొక్కా, ప్యాంట్‌ను పట్టుకుని వెనక్కు లాగేశారు. యామినిశర్మ, శబరి తదితర మహిళా నాయకులు టవర్‌ ఎక్కే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు  నిలువరించారు. ర్యాలీలో పాల్గొన్న పార్టీ జాతీయ కార్యదర్శులు సత్యకుమార్‌, సునీల్‌ దేవధర్‌, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్‌ తదితరులను శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మాట్లాడుతూ.. ‘గుంటూరులో జిన్నాటవర్‌ను శాంతికట్టడంగా చెప్పటం దురదృష్టకరం. వెంటనే ఆ టవర్‌కు అబ్దుల్‌కలాం, గుర్రం జాషువా పేర్లలో ఏదో ఒకటి పెట్టాలి. లేకపోతే ఆగస్టు 16న ఆ టవర్‌ను తమ పార్టీ కార్యకర్తలు కూల్చివేసే అవకాశం లేకపోలేదు’ అని ఆయన హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని