శేషాద్రికి తుది వీడ్కోలు

విశాఖలో సోమవారం హఠాన్మరణం చెందిన తితిదే ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి అంత్యక్రియలు తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఆయన సోదరుడు రామానుజం

Updated : 01 Dec 2021 05:00 IST

తిరుపతిలో అంత్యక్రియలు పూర్తి

హాజరైన సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

ఈనాడు-తిరుపతి, ఈనాడు డిజిటల్‌- తిరుపతి: విశాఖలో సోమవారం హఠాన్మరణం చెందిన తితిదే ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి అంత్యక్రియలు తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఆయన సోదరుడు రామానుజం తలకొరివి పెట్టారు. తిరుపతిలోని సిరిగిరి అపార్టుమెంట్‌కు ప్రముఖులు, తితిదే అర్చకులు, ఉద్యోగులు, స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శేషాద్రి మరణవార్త విన్న వెంటనే సంతాప సందేశాన్ని అందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ మంగళవారం తిరుపతి వచ్చి ఆయన పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. సుమారు 30 నిమిషాలు అక్కడే ఉండి శేషాద్రి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ... నేను, నా కుటుంబ సభ్యులు ఎప్పుడు తిరుమల వచ్చినా చిరునవ్వుతో పలకరించి, శ్రీవారి దర్శనం చేయించేవారని గుర్తుచేసుకున్నారు. ప్రాచీన సంప్రదాయాలకు సంబంధించి పలు పుస్తకాలను శేషాద్రి రచించారని, భావితరాలకు అందించేందుకు తితిదే వాటిని అచ్చువేయించాలని సూచించారు. చిత్తూరు జిల్లా జడ్జి పార్థసారథి, తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి వీర్రాజు, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజేయకల్లం, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, తితిదే పాలక మండలి సభ్యులు అశోక్‌కుమార్‌, కృష్ణమూర్తి, డీఐజీ కాంతిరాణ టాటా, తమిళనాడు తితిదే అనుబంధ ఆలయాల ఛైర్మన్‌ శేఖర్‌రెడ్డి, భాజపా నేత భానుప్రకాష్‌రెడ్డి, తితిదే మాజీ జేఈవోలు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసరాజు, తితిదే జేఈవో సదా భార్గవి, సీవీఎస్‌వో గోపీనాథ్‌జెట్టి, స్విమ్స్‌ డైరెక్టర్‌ భూమా వెంగమ్మ తదితరులు శేషాద్రికి నివాళులు అర్పించారు.

పాడె మోసిన ఎమ్మెల్యేలు, అదనపు ఈవో: శేషాద్రి ఇంటి నుంచి హరిశ్చంద్ర శ్మశాన వాటిక వరకు తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితోపాటు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి పాడె మోశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని