Updated : 03 Dec 2021 05:21 IST

CHANDRA BABU: కేంద్రం నిర్ణయం సీఎంకు చెంపపెట్టు

పంచాయతీల నిధులను లాక్కోవడం దుర్మార్గం
ప్రజలెవరూ ఓటీఎస్‌లో డబ్బులు కట్టొద్దు
పార్టీ అధికారంలోకి వచ్చాక ఉచితంగా పట్టాలిస్తాం
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

శావల్యాపురం, దాచేపల్లి, గురజాలకు చెందిన పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల హక్కులను కాలరాస్తూ... వాటికి ఆర్థిక సంఘాలు ఇచ్చిన నిధులను లాక్కోవడం దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును కేంద్రం తప్పుబట్టడం, పంచాయతీలు సొంతంగా ఖాతాలు తెరుచుకుంటేనే నిధులిస్తామని చెప్పడంతో ముఖ్యమంత్రి జగన్‌ను చెంపదెబ్బ కొట్టినట్లయిందన్నారు. తెదేపా హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులు, దోపిడీలు, నిత్యావసర ధరల పెరుగుదలలో నెం.1 స్థానంలో ఉందని చెప్పారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన దాచేపల్లి, గురజాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ఓటీఎస్‌ డబ్బులు ఎవరూ కట్టొద్దని, తెదేపా అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచితంగా పట్టాలిస్తామని చెప్పారు. ‘‘పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతుల్ని అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే ఒకరు... రైతులకు కనీసం వసతి కూడా లేకుండా చేశారు. వాళ్లు రోడ్లపై భోజనం చేయాల్సిన పరిస్థితి కల్పించారు. ఆడబిడ్డల్ని అవమానించినందుకు సిగ్గుగా లేదా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘2021 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి, మంత్రి ప్రగల్బాలు పలికారు. మరి పూర్తి చేశారా? పోలవరం ప్రారంభోత్సవానికి వెళదామా?’’ అని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా?

‘‘వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో గురజాల నియోజకవర్గంలో ఎనిమిది మంది తెదేపా కార్యకర్తల్ని హతమార్చారు. వైకాపా నేతలు అక్రమంగా తవ్వేసిన క్వారీల గుంతల్లో పడి ఏడుగురు చిన్నారులు చనిపోయారు. అధికారం ఉందని మనుషుల్ని చంపుతారా? ముఖ్యమంత్రి జగన్‌కు మానవత్వం ఉందా? ఆయన మనిషైతే హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తారా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘తురకపాలెంలో 75 ఏళ్ల షేక్‌మూల్‌సాబ్‌, 68 ఏళ్ల షేక్‌చాంద్‌బీ దంపతులపై హత్యాయత్నం కేసు పెట్టారంటేనే వైకాపా నాయకులు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగి ఉంటే గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీల్లో గెలిచేవాళ్లం. వైకాపా నాయకుల అరాచకాలకు ఎదురొడ్డి పోరాడి శావల్యాపురం జెడ్పీటీసీగా గెలిచిన హైమావతికి అభినందనలు...’’ అని ఆయన పేర్కొన్నారు. గురజాల నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థుల దాడుల్లో చనిపోయిన 8 మంది తెదేపా కార్యకర్తల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, వైకాపా నేతల దాడిలో గాయపడ్డ సైదాకు రూ.లక్ష, క్వారీ గుంతల్లో పని చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ.50 వేలు చొప్పున పార్టీ తరపున చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాల్ని వేదికపైకి రప్పించి, వారందరికీ ఆయన ధైర్యం చెప్పారు. వైకాపా నాయకులకూ శిశుపాలుడి గతే పడుతుందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు ఉండకూడదా? ఈ రాష్ట్రమేమైనా మీ జాగీరా?అని ఆయన ప్రశ్నించారు. దాచేపల్లికి చెందిన ఎస్సీ వర్గానికి చెందిన వైద్యురాలు వరలక్ష్మి తెదేపాలో చేరారు. గత ఎన్నికల్లో తాను దాచేపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో తెదేపా తరపున పోటీకి సిద్ధపడితే... వైకాపా నాయకులు తన ఆస్పత్రిపై దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని