‘అదానీ జెట్టీ’ స్వాధీనానికి రంగం సిద్ధం

విశాఖ నౌకాశ్రయంలోని అదానీ జెట్టీని స్వాధీనం చేసుకోవడానికి నౌకాశ్రయ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ఇ.క్యు.-1 జెట్టీని అదానీ సంస్థ సుమారు రూ.370 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసినా ఆశించిన స్థాయిలో వ్యాపార

Published : 15 Jan 2022 02:44 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నౌకాశ్రయంలోని అదానీ జెట్టీని స్వాధీనం చేసుకోవడానికి నౌకాశ్రయ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ఇ.క్యు.-1 జెట్టీని అదానీ సంస్థ సుమారు రూ.370 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసినా ఆశించిన స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించలేకపోయింది. దాని నిర్వహణ లాభదాయకం కాదని నిర్ణయానికి వచ్చి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. జెట్టీ నుంచి పోర్టుకు ఆదాయం రాకపోవడంతో నౌకాశ్రయ ఉన్నతాధికారులు ఆ సంస్థకు నోటీసులు జారీ చేశారు. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకపోతే నిబంధనల ప్రకారం రూ.165 కోట్లు చెల్లించి జెట్టీని స్వాధీనం చేసుకునే హక్కు నౌకాశ్రయానికి ఉంది. ఆ మొత్తం చాలా తక్కువని అదానీ సంస్థ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై తుదితీర్పునకు మరికొంత సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో రూ.వంద కోట్లు చెల్లించి ముందుగా స్వాధీనం చేసుకోవాలని ఇటీవల న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆదేశాలివ్వాలని నౌకాశ్రయ అధికారులు కేంద్ర నౌకాయాన శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. వివాదానికి సంబంధించిన వివరాలను పంపాలని అక్కడి నుంచి సమాచారం వచ్చింది.


ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నిర్ణయం
- కె.రామమోహనరావు, ఛైర్మన్‌, విశాఖ నౌకాశ్రయం

దానీకి కేటాయించిన జెట్టీలో కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో అందులోని యంత్రాలన్నీ చాలాకాలంగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇప్పుడు అవి ఏ స్థితిలో ఉన్నాయి.. నౌకాశ్రయానికి అవి ఉపయోగమా? కాదా తేల్చడానికి ‘కండిషన్‌ సర్వే’ నిర్వహించాలి. అంతా బాగుంటే నిర్ణీత మొత్తం చెల్లించి జెట్టీని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని