నేత్రశోభితంగా శివపార్వతుల కల్యాణం

కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం శ్రీపార్వతీ సమేత మల్లికార్జునస్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను ముగ్ధమనోహరంగా ముస్తాబు చేశారు

Published : 17 Jan 2022 03:30 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం శ్రీపార్వతీ సమేత మల్లికార్జునస్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను ముగ్ధమనోహరంగా ముస్తాబు చేశారు. స్వామివార్లను నంది వాహనంపై అధిష్ఠింపజేసి అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణ మండపంలో శ్రీపార్వతీ సమేత మల్లికార్జునస్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నేత్రశోభితంగా సాగింది. ఈవో ఎస్‌.లవన్న, ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో స్థానిక చెంచులు ఈతాకు ఆభరణాలను స్వామివార్లకు అలంకరించారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లకు కైలాస వాహన సేవ నిర్వహించారు.

శ్రీశైల మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం నిలిపివేత
శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం, అన్న ప్రసాద వితరణ, శఠారి, తీర్థం, వేదాశీర్వచనం, పాతాళ గంగలో పుణ్యస్నానాలను తాత్కాలికంగా నిలిపామని దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న ఆదివారం తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని వచ్చే భక్తులనూ గంటకు 1,000 మందినే దర్శనానికి అనుమతిస్తామన్నారు. సామూహిక అభిషేకాలు రోజుకు 4 విడతల్లో అమలు చేయనున్నట్లు వివరించారు. వృద్ధులు, గర్భిణులు, చంటి పిల్లల తల్లులు, 10 ఏళ్లలోపు పిల్లలు ఆలయానికి రావడం వాయిదా వేసుకోవాలని సూచించారు.  ఈనెల 18 నుంచి తదుపరి నిర్ణయం వచ్చే వరకు ఆర్జిత సేవల టిక్కెట్లను ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలన్నారు. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకునే అవకాశం ఉందన్నారు. భక్తులకు కొవిడ్‌ వాక్సినేషన్‌ ధ్రువీకరణ తప్పనిసరి అన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో గర్భాలయ టికెట్లు పొందిన వారికి, గర్భాలయ అభిషేకాలు పునఃప్రారంభమైన తర్వాత కోరుకున్న రోజు అభిషేకాలు జరిపించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని