Ukraine Crisis: నియంతలకు దండన తప్పదు

ప్రపంచ దేశాల శాంతి, సుస్థిరతలకు రష్యా నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై నిష్కారణంగా, పక్కా ప్రణాళికతో దాడికి దిగడం ద్వారా

Updated : 03 Mar 2022 06:14 IST

పుతిన్‌ది నిష్కారణ యుద్ధం
రష్యా విమానాలపై నిషేధాస్త్రం
ఆర్థికం సహా అన్ని విధాలుగా ఆ దేశం మెడలు వంచుతాం
ఉక్రెయిన్‌ ప్రజలకు అండగా నిలుస్తున్నాం
అక్కడికి సైన్యాన్ని పంపించబోం
నాటో దేశాల భద్రతకు విస్పష్ట హామీ
అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రసంగం

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాల శాంతి, సుస్థిరతలకు రష్యా నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై నిష్కారణంగా, పక్కా ప్రణాళికతో దాడికి దిగడం ద్వారా పుతిన్‌ ఘోర తప్పిదానికి పాల్పడ్డారని అన్నారు. విదేశాలపై దురాక్రమణకు దిగిన నియంతలకు తగిన శాస్తి తప్పదని, చరిత్ర నేర్పుతున్న గుణపాఠం ఇదేనని హెచ్చరించారు. అమెరికా కాంగ్రెస్‌ వార్షిక సంయుక్త సమావేశంలో మంగళవారం రాత్రి ప్రసంగించిన బైడెన్‌ అంతర్జాతీయ పరిణామాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయా అంశాలపై తమ ప్రభుత్వ వైఖరిని విస్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ ప్రజలకు అన్ని విధాలుగా సహాయమందిస్తామని చెబుతూనే అక్కడికి తమ సైన్యాన్ని తరలించబోమన్న గత వైఖరినే పునరుద్ఘాటించారు. నాటో దేశాల భద్రతకు హామీ ఇచ్చారు. వాటి వైపు కన్నెత్తి చూస్తే రష్యా అంతు చూస్తామని హెచ్చరించారు. అదే సమయంలో అమెరికా ప్రజలకు భరోసానిచ్చారు.

దౌత్యాన్ని వీడి.. దౌర్జన్యానికి దిగిన పుతిన్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై బైడెన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉక్రెయిన్‌పై అకారణంగా, దురాలోచనతో దాడికి దిగి తప్పిదానికి పాల్పడ్డారని విమర్శించారు. ‘దౌత్య మార్గాలను పుతిన్‌ తిరస్కరించారు. ఉక్రెయిన్‌పై దండెత్తితే పశ్చిమ దేశాలు, నాటో కూటమి స్పందించవని భావించారు. నాటో కూటమిని సులభంగా చీల్చవచ్చని అంచనా వేసి తప్పటడుగు వేశారు. సమష్టిగా ఎదుర్కోవడానికి మేం సిద్ధం’ అని బైడెస్‌ స్పష్టం చేశారు. పుతిన్‌  ఉక్రెయిన్‌ను చేజిక్కించుకొని ప్రపంచ దేశాలను శాసించాలని భావించారు. అయితే, అతని అంచనాలు ఘోరంగా తప్పాయి. ప్రజల నుంచి రష్యా సైనికులకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందని బైడెన్‌ తెలిపారు. యుద్ధ రంగంలో పుతిన్‌ లాభపడొచ్చు కానీ.. దీర్ఘ కాలంలో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

మరికొన్నేళ్లు రష్యా కోలుకోలేదు..
నాటో కూటమితో కలిసి రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించిన విషయాన్ని బైడెన్‌ గుర్తు చేశారు. ‘రష్యాకు చెందిన అతి పెద్ద బ్యాంకులను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల నుంచి బహిష్కరించాం. రష్యా తన సెంట్రల్‌ బ్యాంకులో కూడబెట్టుకున్న 63000 కోట్ల డాలర్లను స్తంభింపజేసి యుద్ధ నిధులను నిరుపయోగం చేశాం. ఆధునిక సాంకేతికతలకు దూరం చేయడం ద్వారా ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా రష్యా సైన్యం మరికొన్నేళ్ల పాటు కోలుకోలేని విధంగా బలహీనపరుస్తున్నాం. యుద్ధం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రష్యా సంపన్నులు, అవినీతిపరులైన ఆ దేశ నేతల ఆటలు సాగనివ్వం. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా బలహీనపడిపోవడం తథ్యం’ అని బైడెన్‌ స్పష్టం చేశారు. రష్యన్‌ రూబుల్‌ విలువ 30శాతం, ఆ దేశ షేర్‌మార్కెట్లు 40శాతం మేర

పతనమైన విషయాన్ని గుర్తు చేశారు. రష్యా పతనానికి ఆ దేశ అధ్యక్షుడే కారణమన్నారు. నియంతృత్వం, ప్రజాస్వామ్యం మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజాస్వామ్యానిదే విజయమని తెలిపారు.

విమానాలపై నిషేధం

ప్రపంచంలో రష్యాను ఏకాకిగా చేసే చర్యల్లో భాగంగా ఆ దేశ విమానాలపై అమెరికా కూడా నిషేధం విధిస్తుందని జో బైడెన్‌ ప్రకటించారు. ఈ అంశంలో ఈయూ దేశాల నిర్ణయంతో జత కలుస్తున్నట్లు తెలిపారు. ‘ఉక్రెయిన్‌లో రష్యా సేనలతో తలపడేందుకు అమెరికా తన సైన్యాన్ని అక్కడకు పంపించదు. అయితే, ఆయుధ, ఆర్థిక, మానవీయ సాయాన్ని కొనసాగిస్తుంది. పశ్చిమ దిశగా పుతిన్‌ తన సేనలను నడిపితే నాటో కూటమిని రక్షించుకునేందుకు మేం సిద్ధం. రక్షణాత్మక చర్యల్లో భాగంగానే పోలండ్‌, రొమేనియా, లాత్వియా, లిథువేనియా, ఎస్తోనియాలకు అమెరికా సైన్యం, యుద్ధ విమానాలు, నౌకలను పంపించాం’ అని వివరించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో అమెరికా వ్యాపారవేత్తలు, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశీయంగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను బైడెన్‌ ఏకరవు పెట్టారు.

చరిత్ర చెప్పిన పాఠం ఇదే..

ఇతర దేశాలపై దురాక్రమణకు దిగిన నియంతలకు తగిన శిక్ష పడకపోతే తీవ్ర అరాచకం సృష్టిస్తారు. అటువంటి వారిని వదిలేస్తే అమెరికాతో పాటు యావత్తు ప్రపంచం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. భయాందోళనలకు గురికావల్సి వస్తుంది. ఇది చరిత్ర మనకు నేర్పిన పాఠం. అందువల్లే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో శాంతి, సుస్థిరతల స్థాపన కోసం నాటో కూటమిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది

- బైడెన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని