భూముల అమ్మకానికి అంగీకరించం

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుండా భూముల్ని అమ్ముకుంటామంటే అంగీకరించేది

Published : 27 Jun 2022 02:52 IST

న్యాయస్థానాల ద్వారా పోరాడతాం

అమరావతి రైతుల స్పష్టీకరణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి, తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుండా భూముల్ని అమ్ముకుంటామంటే అంగీకరించేది లేదని ఆ ప్రాంత రైతులు స్పష్టం చేశారు. చీకటి జీవోలను, ఒప్పందాలను న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. ‘రాజధాని నిర్మాణానికి భూములిచ్చింది.. ప్రభుత్వం, నాయకులు వారి ఇష్టానుసారం అమ్మకానికి పెట్టడానికి కాదు. గతంలో కూడా ప్రభుత్వం ఇదే తీరుగా వ్యవహరిస్తే కోర్టు ద్వారా అడ్డుకున్నాం. మళ్లీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని 6 నెలల్లో అభివృద్ధి చేయాలని కోర్టు తీర్పు ఇచ్చినా ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదు. పైగా రాజధానిని అభివృద్ధి చేయాలంటే 5 ఏళ్లు సమయం పడుతుందని అఫిడవిట్‌ వేశారు. అంత సమయం పట్టేటప్పుడు ఇప్పుడు అమ్మకానికి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సొంత ప్రయోజనాల కోసం భూముల్ని అమ్మకానికి, తాకట్టు పెట్టడానికి అంగీకరించే ప్రసక్తే లేదు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే పెట్టుబడులు వచ్చి ఆదాయం పెరుగుతుంది. బ్యాంకులు రుణాలిస్తాయి. ఆ మొత్తంతో నిర్మాణం చేపట్టాలి. అప్పటికీ నిధులు సరిపోని పక్షంలో రాజధానిలోని మిగులు భూముల్ని అమ్మకానికి పెట్టాలి’ అని సూచించారు. ప్రభుత్వం భూములు అమ్మకానికి పెట్టిన దొండపాడు, అనంతవరం గ్రామాల పరిధిలో ఆదివారం నిరసనకు దిగారు.

మట్టి తరలింపుపై నిలదీత..
అదే ప్రాంతంలో రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో నిల్వ ఉంచిన మట్టిని జేసీబీలతో తరలించటంపై డ్రైవర్‌ను రైతులు ప్రశ్నించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని నిలదీశారు. కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు మట్టిని తరలిస్తున్నామని అతడు సమాధానమిచ్చారు. తమ కంపెనీ ప్రతినిధులకు ఫోన్‌ చేసి రైతులతో మాట్లాడించాడు. నవయుగ సంస్థ తరఫున మాట్లాడుతున్నట్లు తెలిపిన అవతలి వ్యక్తి కరకట్ట రహదారి విస్తరణ పనుల కోసం సీఆర్డీఏ అనుమతిలో మట్టిని తరలిస్తున్నామని చెప్పారు.

* అమరావతి రైతులు చేస్తున్న నిరసనలు 922వ రోజు ఆదివారం కొనసాగాయి. తుళ్లూరు, వెంకటపాలెం, మందడం తదితర గ్రామాల్లో నిరసనలు జరిగాయి. 

* రాజధాని భూముల్ని అమ్మకానికి పెట్టే నైతిక అర్హత ప్రభుత్వానికి ఎక్కడుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని