ఫలించిన రమణమ్మ పోరాటం

భూమిపై హక్కు కోసం 18 ఏళ్లుగా ఓ వృద్ధురాలు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు శివారు రావిపాలెంలో సర్వే నంబర్‌

Published : 27 Jun 2022 04:29 IST

69 సెంట్ల భూమికి సాగుదారుగా నమోదు

‘ఈనాడు’ కథనానికి స్పందన

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: భూమిపై హక్కు కోసం 18 ఏళ్లుగా ఓ వృద్ధురాలు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు శివారు రావిపాలెంలో సర్వే నంబర్‌ 87లో 69 సెంట్ల భూమికి ఆమెను సాగుదారుగా నమోదు చేస్తూ రెవెన్యూ అధికారులు పత్రాలు అందించారు. రావి రమణమ్మ(61) అత్తామామలకు 9.48 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొంత భాగాన్ని ప్రభుత్వం 2004లో సెజ్‌ కోసం సేకరించి పరిహారం ఇచ్చింది. భూమిలో రమణమ్మ భర్తకు వాటా దక్కకపోవడంతో పరిహారం రాలేదు. బంధువుల ఆక్రమణలో ఉన్న తన భర్త వాటా భూమిని విడిపించి తనకు పరిహారం ఇప్పించాలని సుదీర్ఘకాలంగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ రమణమ్మ కాళ్లరిగేలా తిరిగింది. ఒంటరి పోరాటం చేస్తున్న ఆమె పరిస్థితిపై ‘రమణమ్మ వేదనకు రాయైనా కరగాల్సిందే!’ అనే శీర్షికతో ఈ ఏడాది ఫిబ్రవరి 10న ‘ఈనాడు’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి సీఎం జగన్‌తో పాటు ఎలమంచిలి సీనియర్‌ సివిల్‌ జడ్జి శాయికుమారి స్పందించారు. సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. పలువురు అధికారులను జడ్జి విచారించారు. ఆదివారం ఎలమంచిలి కోర్టులో జరిగిన జాతీయ లోక్‌ ఆదాలత్‌లో తహసీల్దార్‌ రాంబాయి, ఉప తహసీల్దార్‌ లక్ష్మయ్య చేతులమీదుగా భూమి అనుభవ పత్రాలను రమణమ్మకు ఇప్పించారు. లోక్‌అదాలత్‌లో ఏజీపీ డి.వెంకటరావు, ప్యానల్‌ న్యాయవాది ఎల్‌.వి.రామకృష్ణారావు, బి.హరిశంకరరావు, కె.ఎన్‌.దుర్గాప్రసాద్‌, పి.వి.రమణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని