పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్‌ చైర్ల భారం!

పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది.

Published : 26 Apr 2024 03:52 IST

పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటుకు కొనుగోలు చేయాలని కలెక్టర్ల ఆదేశం
నిధుల్లేక ఈసురోమంటుంటే కొత్త బాధ్యతలపై సర్పంచుల్లో ఆందోళన

ఈనాడు-అమరావతి: పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్‌ చైర్లు కొనుగోలు చేయాలని పంచాయతీలను కలెక్టర్లు ఆదేశించడంతో సర్పంచుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలింగ్‌ కేంద్రానికో చైర్‌ ఏర్పాటు తప్పనిసరని పేర్కొన్నారు. ఒక్కో వీల్‌ చైర్‌ రూ.5 వేల ధర మించకుండా కొనుగోలు చేసి పోలింగ్‌ తేది నాటికి సిద్ధం చేయాలని కలెక్టర్లు ఆదేశించారు. రాష్ట్రంలో 46,165 పోలింగ్‌ కేంద్రాల్లో వీటి ఏర్పాటుకు పంచాయతీలు రూ.23.08 కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధుల కొరతతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పంచాయతీల పరిస్థితి కలెక్టర్ల తాజా ఆదేశాలతో గోరుచుట్టుపై రోకలి పోటులా తయారైంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 13న నిర్వహించే పోలింగ్‌కి ఏర్పాట్లు చేస్తున్న జిల్లా కలెక్టర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గ్రామ పంచాయతీలకు వీల్‌ చైర్లు సమకూర్చే బాధ్యత అప్పగించారు. ఒక్కో పంచాయతీ పరిధిలో కనిష్ఠంగా 3, గరిష్ఠంగా 5 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. రూ.15 వేలు నుంచి రూ. 25 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను జగన్‌ ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల బకాయిలకు ఏకపక్షంగా మళ్లించాక పంచాయతీల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. వీధులు శుభ్రం చేసే కార్మికులకూ చాలా పంచాయతీల్లో జీతాలు సకాలంలో ఇవ్వలేకపోతున్నాయి. వేసవిలో తాగునీటి మోటార్లు పాడైనా, పైపులు పగిలినా నిధుల్లేక వెంటనే పునరుద్ధరించలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీల్‌ చైర్ల కొనుగోలు చేసి పోలింగ్‌ కేంద్రాల్లో సిద్ధం చేసే బాధ్యత పంచాయతీలకు అప్పగించడంపై సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జీవోలిచ్చారు సరే ...ఆర్థిక సంఘం నిధులేవి?

కేంద్ర ప్రభుత్వం నెల రోజుల క్రితం రాష్ట్రానికి విడుదల చేసిన రూ.988 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికీ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. సర్పంచుల వినతులపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలతో ప్రభుత్వం హడావుడిగా కొద్ది రోజుల క్రితం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు పరిపాలన అనుమతులిస్తూ జీవోలిచ్చింది. దీనిపై పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తుల బ్యాంకు ఖాతాలకు పంచాయతీరాజ్‌శాఖ నిధులు జమ చేయాలి. జీవోలిచ్చి వారం రోజులైనా ఇప్పటికీ నిధులు పంచాయతీలకు జమ కాలేదు. ఈ పరిస్థితుల్లో పోలింగ్‌ కేంద్రాల్లో వీల్‌ చైర్ల కొనుగోలు ఎలా సాధ్యమని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని