మరపురాని మధుర గాయకుడు

ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం వంటి అసాధారణ ప్రజ్ఞావంతుడు, విభిన్న శాఖల్లో సుదీర్ఘకాలం రాణించిన కళాకారుడు ఇంకొకరిని ఇంతవరకూ మనం చూసి ఉండలేదు. నేపథ్య

Updated : 25 Sep 2022 07:19 IST

నేడు బాలసుబ్రహ్మణ్యం ద్వితీయ వర్ధంతి

ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం వంటి అసాధారణ ప్రజ్ఞావంతుడు, విభిన్న శాఖల్లో సుదీర్ఘకాలం రాణించిన కళాకారుడు ఇంకొకరిని ఇంతవరకూ మనం చూసి ఉండలేదు. నేపథ్య గాయకుడిగా, డబ్బింగ్‌ కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యాతగా బహుముఖ ప్రస్థానంతో ప్రజల హృదయాల్లో చెదరని స్థానం సంపాదించుకున్న ‘గంధర్వ గాయకుడు’, ‘బాలు’ అని ప్రేమగా పిలుచుకునే బాలసుబ్రహ్మణ్యం. ఘంటసాల మరణించడానికి (1974) ఆరేళ్ల ముందే బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడిగా చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. ఆ స్వరంలో పరిణతి 1980వ సంవత్సరం ప్రాంతం నుంచే ప్రస్ఫుటంగా కనిపించసాగింది. ‘శంకరాభరణం’ చిత్రంలో శాస్త్రీయ సంగీతాధారమైన పాటలు పాడటంతో ఆ స్వరం గాంభీర్యాన్ని అందుకుంది. శ్రుతిలయాన్వితంగా ఉన్నత స్థితికి చేరుకుని విశేష ప్రజాదరణ పొందటానికి కారణమైంది.

బాలసుబ్రహ్మణ్యానికి స్వరం దేవుడిచ్చిన వరం అని చెప్పక తప్పదు. ప్రధానంగా చెప్పుకోవలసింది ఆ స్వరంలోని వైవిధ్యం. అందుకే ఏ నటుడికి పాడినా, అది కథానాయకుడు కావచ్చు, హాస్యనటుడు కావచ్చు, అల్లరి పాటలు కావచ్చు, ఆధ్యాత్మిక కీర్తనలు కావచ్చు పాత్రోచితంగా, భావస్ఫోరకంగా పాడగలగటం. ఇంకొక్క విశిష్టత, స్పష్టమైన ఉచ్చారణ, భాష మీద పట్టు. అందువల్లనే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళమే కాదు హిందీ, ఇతర భాషల్లో కలిపి మొత్తం 16 భారతీయ భాషల్లో 40 వేల పాటలు పాడగలగటం అనితరసాధ్యం. ఏ భాషలో పాడినా ఆ భాషకు గల సహజత్వాన్ని, పలుకుబడులను పట్టుకోగలిగేవారు. వివిధ భాషల్లో స్పష్టతతో, భావానికి తగిన అభివ్యక్తీకరణతో బాలు సంగీత ప్రస్థానం అయిదు దశాబ్దాలకు పైగా నిరవధికంగా సాగింది. అందుకే ఏ చిత్రరంగంలోనూ ఏ ఇతర నేపథ్య గాయకుడూ సాధించని రికార్డులు, విజయాలు బాలు సొంతం చేసుకోగలిగారు. ఒకే రోజున కన్నడ సినిమాలకు 21 పాటలు, తమిళంలో ఒకే రోజున 19 పాటలు, హిందీలో ఒకేరోజు 16 పాటలు పాడిన ఘనత ఆయనది.

నేపథ్యగానమే ప్రధాన వృత్తిగా కొనసాగినా బాలు చిత్రరంగంలో ఇతర శాఖల్లోనూ ప్రతిభాపాటవాలతో తనలోని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. తెలుగు (31), తమిళం (5), కన్నడ (8), హిందీ (1) భాషల్లో మొత్తం 45 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించటం ఒక అసాధారణ విషయం. వీటితోపాటు డబ్బింగ్‌ కళాకారుడిగా ఎందరో దక్షిణ/ ఉత్తర భారతదేశ కథానాయకులకు ఎన్నో సినిమాల్లో ఆయా భాషల్లో గాత్రదానం చేయడం కూడా ఒక కళా నైపుణ్యమే. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘శుభ సంకల్పం’ చిత్రాన్ని నిర్మించి ఆ శాఖలో కూడా విజయం సాధించారు. వీటితోపాటు టీవీ వ్యాఖ్యాతగా 20 సంవత్సరాలకు పైగా ‘ఈటీవీ’లో ‘పాడుతా తీయగా’ కార్యక్రమాన్ని నిర్వహించి ఎందరో వర్ధమాన గాయకులకు దాన్ని ఓ అద్భుతమైన పరిచయ వేదికగా మార్చారు. ఆ కార్యక్రమం లలిత, సినీ సంగీతాభిమానుల్ని అశేషంగా ప్రభావితం చేసి అత్యంత ప్రజాదరణ పొందింది. ఆ కార్యక్రమం ద్వారా తెలుగు భాష ప్రాధాన్యం, తెలుగు పద్యం గొప్పదనం, తెలుగు తీయదనాన్ని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూ పోటీలో పాల్గొన్న వారికే కాక ప్రేక్షకులకూ భాషపై తనకున్న అవ్యాజమైన ప్రేమను చాటిచెప్పేవారు. పిల్లలకు మహా ప్రాణాలు, ద్విత్వాక్షరాలు మొదలైనవి సరిగా ఉచ్చరించవలసిందిగా ఎన్నో సలహాలు ఇచ్చేవారు. ఈటీవీలో ‘పాడుతా తీయగా’తో పాటు ‘స్వరాభిషేకం’, ‘ఎందరో మహానుభావులు’, మా టీవీలో ‘పాడాలని ఉంది’ ‘సునాదవినోదిని’(తితిదే) కన్నడ, తమిళ టీవీ ఛానళ్లలోనూ సంగీత పోటీలు నిర్వహించి అశేష ప్రేక్షకులను అలరించడమే కాకుండా, ఎంతోమంది గాయకులుగా తయారుకావడానికి దోహదపడ్డారు.
భారత చలనచిత్రసీమలో అర్ధ శతాబ్దం పైగా బహుముఖ ప్రతిభ కనపరచడంతో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలెన్నో బాలును వరించాయి. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌, 2021లో (మరణానంతరం) పద్మవిభూషణ్‌ పురస్కారాలిచ్చి గౌరవించింది. 47వ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం (2016)లో జాతీయ స్థాయి చలనచిత్ర విశిష్ట వ్యక్తిగా శతాబ్ది పురస్కారాన్ని అందుకున్నారు. ఆరుసార్లు ఫిలింఫేర్‌ అవార్డు, 25 సార్లు నంది అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి 1981లో ‘కలైమామణి’ అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ‘కళాప్రపూర్ణ’, మూడు విశ్వ విద్యాలయాల గౌరవ డాక్టరేట్‌లతో పాటు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు, కళా సాంస్కృతిక సంస్థల నుంచి వేనవేలుగా బాలు అందుకున్నారు. అంతటి ప్రజ్ఞాశాలి బాలసుబ్రహ్మణ్యం మన మధ్య భౌతికంగా లేకున్నా అందరి హృదయాల్లో ‘బాలు’ జ్ఞాపకాలు పదిలంగానే ఉంటాయి.

-ఎం.వి.శాస్త్రి, గుంటూరు

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని