రూ.12,000 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్ల టర్నోవర్‌ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌ వెల్లడించారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

Updated : 01 Oct 2022 07:17 IST

60 లక్షల మంది చందాదార్లకు సేవలు

విశ్వసనీయతే విజయ రహస్యం

ఎండీ శైలజా కిరణ్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్ల టర్నోవర్‌ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌ వెల్లడించారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.9,712 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశామని, ఈసారి అధిక     లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో     ఇప్పటి వరకు 60 లక్షల మందికి పైగా చందాదార్లకు సేవలు అందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 108 శాఖల ద్వారా 6,200 చిట్‌ గ్రూపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంకితభావంతో పనిచేసే 4,300 మంది సిబ్బంది తమకు ఉన్నారని, తద్వారా ప్రజలకు      మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. తమ కార్యకలాపాలను బహుముఖంగా విస్తరించి, ప్రజలకు ఇంకా దగ్గర కావాలని అనుకుంటున్నట్లు వివరించారు. చందాదార్ల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆరు దశాబ్దాల కాలంలో పలు రకాల ప్రత్యేకతలను సొంతం చేసుకున్నామని, ఎన్నో కుటుంబాల ఆర్థిక విజయాల్లో భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ప్రజల ఆర్థిక అవసరాల్లో అండగా..
నమ్మకం, విశ్వసనీయతే పునాదిగా మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రస్థానం కొనసాగుతోందని శైలజా కిరణ్‌ అన్నారు. ‘రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్‌ను ప్రారంభించారు. అప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉన్న చిట్‌ఫండ్‌ సంస్కృతిని తెలుగు ప్రజలకు దగ్గర చేశారు. క్రమశిక్షణ, బాధ్యత, అంకితభావంతో మార్గదర్శి చిట్‌ఫండ్‌ను  నిర్మించారు. తద్వారా ఎంతోమంది ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కల్పించారు’ అని ఆమె తెలిపారు. ‘ప్రజల సొమ్ముకు మనం ట్రస్టీలం మాత్రమే, ఆ విషయాన్ని విస్మరించకూడదు’.. అని ఆయన ఎప్పుడూ చెబుతారని, ఆ నిబద్ధత వల్లే మార్గదర్శి చిట్‌ఫండ్‌  ఉన్నతస్థానంలో నిలిచిందని వివరించారు. దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఎంతోమంది చందాదార్లకు తాము సేవలు అందిస్తున్నామని, ఇందులో వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, వైద్యులు, సొంత వ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారని అన్నారు. వివిధ రంగాల ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చడంలో తమ సంస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.

99 శాతం రికవరీ
‘డాక్యుమెంటేషన్‌’ విషయంలో కఠినంగా ఉంటామని, స్పష్టమైన నియమ నిబంధనలు అనుసరిస్తామని ఆమె చెప్పారు. దీనివల్ల 99 శాతం రికవరీ సాధించగలుగుతున్నామని అన్నారు. చిట్‌ఫండ్‌ పరిశ్రమలో అధిక రికవరీ సాధిస్తున్న ఘనత తమదేనని వెల్లడించారు. చిట్‌ పాడుకున్న చందాదార్లకు ఎంతో తక్కువ సమయంలో డబ్బు చెల్లిస్తున్నట్లు, వైద్య అవసరాలు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో మూడు, నాలుగు రోజుల్లోనే చిట్‌ మొత్తం చెల్లించే సందర్భాలు ఉంటాయని అన్నారు. ప్రతినెలా దాదాపు రూ.650 కోట్ల మేరకు చెల్లింపులు చేస్తుంటామని అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు
మార్గదర్శి చిట్‌ఫండ్‌ శాఖలు ప్రారంభించాల్సిందిగా ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది తమను కోరుతున్నారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మార్గదర్శి చిట్‌ఫండ్‌ శాఖలున్నాయి. కేరళకు సేవలు విస్తరించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు బదులిస్తూ, ఆ విషయం తమ పరిశీలనలో ఉందని తెలిపారు. కొత్త శాఖలు ప్రారంభించాలని, తద్వారా తమకు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మహారాష్ట్ర, దిల్లీ తదితర రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నట్లు అమె వెల్లడించారు. ప్రస్తుతం తాము కార్యకలాపాలు సాగిస్తున్న రాష్ట్రాల్లో ఇంకా విస్తరించాల్సి ఉందని, ఆ తరువాత ఇతర రాష్ట్రాలకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

జీఎస్‌టీ భారాన్ని తగ్గించాలని కోరుతున్నాం
చిట్‌ఫండ్‌ సేవలపై జీఎస్‌టీ పెంచడం వల్ల చందాదార్లపై అధికభారం పడుతోందని శైలజా కిరణ్‌ వివరించారు. గతంలో చిట్‌ఫండ్‌ సేవలపై పన్ను భారం 12 శాతమే. కొంతకాలం క్రితం దీన్ని 18 శాతానికి పెంచారు. పన్ను భారం తగ్గించాలని కోరుతూ, చిట్‌ఫండ్‌ పరిశ్రమ తరఫున పలు సందర్భాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని