వైకాపా కార్యాలయానికి రెండెకరాలు?

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు పట్టణ శివారు చింతలవీధి ప్రాంతంలో సర్వే నంబరు 151లో సుమారు వంద ఎకరాలకు పైగా కొండ బంజరు భూములున్నాయి. వీటిలో కొంతమేర స్థానిక గిరిజనుల ఆక్రమణలో ఉండేవి.

Updated : 06 Oct 2022 08:08 IST

భూమి ఇచ్చేందుకు అధికారుల ప్రతిపాదన

ఈనాడు డిజిటల్‌-పాడేరు, న్యూస్‌టుడే-పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు పట్టణ శివారు చింతలవీధి ప్రాంతంలో సర్వే నంబరు 151లో సుమారు వంద ఎకరాలకు పైగా కొండ బంజరు భూములున్నాయి. వీటిలో కొంతమేర స్థానిక గిరిజనుల ఆక్రమణలో ఉండేవి. వాటిపై సాగు హక్కులు కల్పించాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు వీటిలో 30 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించాలని చూస్తున్నారు. అదే సమయంలో తమ పార్టీ కార్యాలయానికి రెండు ఎకరాలు కావాలని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కోరగా, అధికారులు గ్రామసభల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ప్రతిపాదించారు. ఈ కార్యాలయానికి రెండునెలల క్రితం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అయితే, ఏళ్లుగా ఈ భూములపైనే ఆధారపడిన తమను కాదని ఇలా ఎలా చేస్తారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో భూ కేటాయింపును వ్యతిరేకిస్తూ తాజాగా తీర్మానం చేశారు. దీనిపై తహసీల్దారు త్రినాథనాయుడిని అడగ్గా, ఈ భూములపై ఎవరికీ పట్టాలు ఇవ్వలేదన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు, గతంలో భూమికోసం దరఖాస్తు చేసిన సంస్థలకు ప్రతిపాదించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని