PM Modi: ఆంధ్రుల సత్తా విశ్వవ్యాప్తం

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రపంచం నలుమూలలా వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకతను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.

Updated : 13 Nov 2022 06:51 IST

విశేష ప్రతిభ, నైపుణ్యాలతో అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు
భారత్‌ అభివృద్ధి ప్రయాణంలో ఏపీది కీలక భూమిక
కొనియాడిన ప్రధాని మోదీ
సమ్మిళిత అభివృద్ధే తమ విధానమని వెల్లడి
వెంకయ్య నాయుడు, హరిబాబులపై ప్రత్యేక ప్రశంసలు
రూ.10,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఈనాడు- విశాఖపట్నం, అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రపంచం నలుమూలలా వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకతను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. సమ్మిళిత అభివృద్ధి దిశగా భారత్‌ సాగిస్తున్న అద్భుత ప్రయాణంలో రాష్ట్రం కీలక భూమిక నిర్వహించనుందని చెప్పారు. శనివారం విశాఖలో రూ.10,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం భారీ సంఖ్యలో హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ నిత్యావసరాల కొరత, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే.. భారత్‌ అభివృద్ధి దిశగా వేగంగా ప్రయాణిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. బలహీనవర్గాల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ, సమ్మిళిత అభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం చేసిన కృషే దీనికి కారణమని చెప్పారు.

ఈ ప్రాజెక్టులతో రాష్ట్రం పురోభివృద్ధి

విశాఖలో నేడు జాతికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు రాష్ట్రాన్ని మరింత పురోగామి పథంలో నడిపిస్తాయని ప్రధాని చెప్పారు. ‘ఈ రోజు రూ.10,500 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన, చేపట్టిన ప్రాజెక్టుల్ని జాతికి అంకితమిచ్చాం. కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం.

ఇవన్నీ మౌలిక వసతులు, సులభతర జీవనం, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాల్ని చేరుకునే దిశగా కొత్త అవకాశాల్ని సృష్టిస్తాయి. అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరడానికి దోహదపడతాయి. ఆంధ్రప్రదేశ్‌, విశాఖ ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చడానికి సాధనంగా పని చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు’ అని పేర్కొన్నారు.


కలుపుగోలుతనంతో ఉన్నత శిఖరాలకు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఒక ప్రత్యేకత ఉంది. వారు ఎంతో స్నేహపూరితంగా ఉంటారు. ఔత్సాహికులు. ప్రపంచవ్యాప్తంగా ఏ మూలకు వెళ్లినా.. విద్య, వైద్యం, సాంకేతికత, వ్యాపారం.. ఇలా ఏ రంగంలోనైనా తమదైన ప్రత్యేకతను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకు మీ వృత్తిపరమైన నైపుణ్యం, అంకితభావంతోపాటు కలుపుగోలుతనమూ కారణమే. ఉల్లాసవంతమైన, ఉన్నత వ్యక్తిత్వంవల్లే మీకు అంత ఆదరణ లభిస్తోంది. తెలుగు ప్రజలు ఎప్పుడూ అందరి మేలు కోరుకుంటారు. అందరి బాగు కోసం కృషి చేస్తారు.

- ప్రధాని మోదీ


వేల ఏళ్ల కిందటే వాణిజ్య కేంద్రంగా విశాఖ

కొన్ని నెలల క్రితం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగిందని, ఇప్పుడు మరోసారి మీ ముందుకొచ్చే అవకాశం దక్కిందని మోదీ పేర్కొన్నారు. ‘భారత్‌లో విశాఖ విశిష్ట నగరం. విశాఖ కేంద్రంగా వాణిజ్య, వ్యాపారాలు విరాజిల్లాయి. ప్రాచీన భారతదేశంలోనూ ఇది ప్రముఖ రేవు ప్రాంతంగా ఉండేది. కొన్ని వేల ఏళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌లకు విశాఖ రేవు ద్వారా వాణిజ్యం జరిగేది. ఈ రోజుకీ భారతదేశ వాణిజ్యంలో విశాఖ పోర్టు కేంద్ర బిందువుగా ఉంది’ అని ప్రధాని కొనియాడారు.

సమ్మిళిత అభివృద్ధే మా లక్ష్యం

మనం దేశ స్వాతంత్య్ర అమృతోత్సవ కాలంలో ఉన్నామని, ‘అభివృద్ధి చెందిన భారత్‌’ అన్న లక్ష్యాన్ని సాధించే దిశగా వేగంగా ప్రయాణిస్తున్నామని మోదీ చెప్పారు. ‘ఈ అభివృద్ధి యాత్ర బహుముఖమైంది. సామాన్య ప్రజల అవసరాలు, ఆకాంక్షలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, అత్యాధునిక మౌలిక వసతుల కల్పనకు అవసరమైన రోడ్‌ మ్యాప్‌ను అందిస్తుంది. ప్రపంచంలోనే శ్రేష్ఠమైన, మౌలిక సదుపాయాల నిర్మాణానికి బాటలు వేస్తుంది. సమ్మిళిత అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం. మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వాల లోపభూయిష్టమైన ఆలోచనవల్ల దేశానికి చాలా నష్టం జరిగింది. వారికి ఈ విషయంలో సమ్మిళిత అభివృద్ధి వ్యూహం, శ్రద్ధ కొరవడటంతో రవాణా ఖర్చులు విపరీతంగా ఉండేవి. అది వస్తు సరఫరా గొలుసు (సప్లై చైన్‌)పై ప్రతికూల ప్రభావం చూపింది. మా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి మీమాంసకూ లోనవలేదు. రైల్వేలు, రోడ్లు, పోర్టులు, రహదారుల్లో వేటిని అభివృద్ధి చేయాలని సందేహపడలేదు. సరఫరా గొలుసు, రవాణా రంగం మల్టీ మోడల్‌ అనుసంధానతపై ఆధారపడి ఉంటాయి. అందుకే మేం మౌలిక వసతుల అభివృద్ధిపై సమీకృత దృక్పథంతో ముందుకెళుతున్నాం. దానికి ఈ రోజు జాతికి అంకితం చేసిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులే నిదర్శనం. ప్రతిపాదిత ఆర్థిక నడవా ప్రాజెక్టులో ఆరు వరుసల రహదారులున్నాయి. పోర్టు అనుసంధానతకు ప్రత్యేక రోడ్డు నిర్మిస్తున్నాం. విశాఖ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ, అత్యాధునిక వసతులతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం దీనిలో ఉన్నాయి’ అని వివరించారు. మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ఈ సమీకృత దృక్పథం.. పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ప్లాన్‌ వల్లే సాధ్యమైందన్నారు. ఈ బృహత్‌ ప్రణాళిక మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని పెంచడంతో పాటు, ఖర్చును గణనీయంగా తగ్గించిందని చెప్పారు. ప్రతి నగర భవిష్యత్తు మల్టీమోడల్‌ రవాణా వ్యవస్థపైనే ఆధారపడి ఉందని, ఆ దిశగా విశాఖపట్నం ఒక అడుగు ముందుకు వేసిందని మోదీ తెలిపారు. ఇకపై ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా ఉరకలు వేస్తుందని ప్రధాని ప్రకటించారు.

అభివృద్ధిలో కొత్త చరిత్ర

‘ప్రపంచం మొత్తం కష్టాల్లో ఉంది. కొన్ని దేశాలు సరఫరా గొలుసు దెబ్బతిని నిత్యావసర సరకుల కొరతతో, మరికొన్ని దేశాలు ఇంధన సంక్షోభంతో సతమతమవుతున్నాయి. ప్రతి దేశం క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థల గురించి ఆందోళన చెందుతున్నాయి. ఇలాంటి సంక్షుభిత సమయంలోనూ భారత్‌ అనేక రంగాల్లో పురోగమిస్తూ.. సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధిపరంగా కొత్త చరిత్రను లిఖిస్తోంది. దీన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది. నిపుణులు, మేధావులు ప్రశంసిస్తున్నారు. మొత్తం ప్రపంచం ఆశలకు ఇప్పుడు భారత్‌ కేంద్ర బిందువుగా మారింది. మన ప్రభుత్వం పౌరుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం వల్లే ఇది సాధ్యమైంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి విధానం సామాన్య ప్రజల జీవితాల్ని మెరుగుపరిచేందుకే’ అని ఆయన తెలిపారు.

మా ప్రభుత్వ విధానాలతో పెట్టుబడులు పెరిగాయి

‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్‌ఐ స్కీం, జీఎస్టీ, ఐబీసీ, నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ వంటి పథకాలు, విధానాల వల్ల దేశానికి పెట్టుబడులు పెరిగాయి. అదే సమయంలో పేదల సంక్షేమం, అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేశాం. గతంలో నిర్లక్ష్యానికి గురైన రంగాలకు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ప్రయాణంలో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చాం. ‘ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం’లో భాగంగా దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నాం. దేశంలోని పేదలకు రెండున్నరేళ్లుగా ఉచిత బియ్యం సరఫరా, మూడున్నర సంవత్సరాలుగా ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.6వేలు జమ చేయడం వంటివి దీనిలో భాగమే. సన్‌రైజ్‌ సెక్టార్ల ఆలోచన కారణంగా యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. డ్రోన్లు, గేమింగ్‌, స్టార్టప్‌ నిబంధనల్ని సరళీకరించడం వల్ల అంతరిక్షం నుంచి అంకురాల వరకు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లడానికి అవకాశం లభించింది’ అని మోదీ వివరించారు.


వారిద్దరికీ ధన్యవాదాలు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మిజోరం గవర్నర్‌ హరిబాబుల గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘వెంకయ్య, గవర్నర్‌లకు ధన్యవాదాలు చెబుతున్నా. వారిద్దరూ నన్ను ఎప్పుడు కలిసినా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి గురించే మాట్లాడేవారు. ఈ రాష్ట్రంపై వారి ప్రేమ, అభిమానం, తపన వెలకట్టలేనివి’ అని కొనియాడారు.


నీలి ఆర్థిక వ్యవస్థకు విశేష ప్రాధాన్యం

‘లక్ష్యం స్పష్టంగా ఉంటే ఆకాశం అంత ఎత్తుకైనా, సముద్రమంత లోతుకైనా వెళ్లి అవకాశాల్ని అందిపుచ్చుకుంటాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సముద్రపు లోతుల్లోని (డీప్‌ వాటర్‌) ఇంధనాన్ని వెలికితీయడం దీనికి గొప్ప ఉదాహరణ. నీలి ఆర్థిక వ్యవస్థ (బ్లూ ఎకానమీ)పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. నీలి ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యమివ్వడం ఇదే మొదటిసారి. మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌కార్డుల వంటి సదుపాయాలు కల్పించి, వారి జీవితాల్ని మరింత మెరుగుపరచడం, విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ వంటివి దానిలో భాగమే’ అని ప్రధాని తెలిపారు. పేదలు ఆర్థికంగా బలపడి, వారికి ఆధునిక సదుపాయాలు అందినప్పుడే ‘వికసిత భారత్‌’ కల సాకారమవుతుందన్నారు. ‘శతాబ్దాల నుంచి భారత సౌభాగ్యానికి సముద్రాలు ప్రధాన సాధనంగా ఉన్నాయి. తీరప్రాంతాలు భారత పురోభివృద్ధికి ముఖద్వారాలుగా నిలిచాయి. పోర్టు ఆధారిత అభివృద్ధి దిశగా రూ.వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు.. దేశ ఆర్థిక వ్యవస్థ పరిఢవిల్లడానికి దోహదం చేస్తాయి’ అని మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో సమ్మిళిత అభివృద్ధి అనే ఆలోచనను భారత్‌ క్షేత్రస్థాయికి తీసుకురాగలిగిందన్నారు. ఆ దిశగా భారత్‌ సాగిస్తున్న ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్‌ పెద్ద భూమిక నిర్వహించబోతోందని ప్రధాని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని