పాత కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు

తెదేపా నాయకుడు ఉమా యాదవ్‌ హత్య కేసులో నిందితులతో రాజీ పడాలని లేదంటే పాతకేసులు తిరగదోడి ఇరికిస్తామని మంగళగిరి పోలీసులు బెదిరిస్తున్నారంటూ మృతుడి కుటుంబీకులు ఆరోపించారు.

Published : 25 Nov 2022 04:50 IST

మంగళగిరి పోలీసులపై ఆరోపణలు  
ఆందోళనకు దిగిన బాధిత కుటుంబీకులు

ఈనాడు, అమరావతి- న్యూస్‌టుడే, తాడేపల్లి: తెదేపా నాయకుడు ఉమా యాదవ్‌ హత్య కేసులో నిందితులతో రాజీ పడాలని లేదంటే పాతకేసులు తిరగదోడి ఇరికిస్తామని మంగళగిరి పోలీసులు బెదిరిస్తున్నారంటూ మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. మూడేళ్ల కిందట ఉమాయాదవ్‌ మంగళగిరిలో హత్యకు గురయ్యారు. ఆ కేసులో ట్రయల్స్‌ తుదిదశకు చేరుకున్నాయి. నిందితులైన వైకాపా వారిని బయటపడేసేందుకు పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు... పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని, అందులో భాగంగానే ఉమాయాదవ్‌ సోదరుడైన మహేష్‌యాదవ్‌ను ఓ పాత కేసులో గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారని కుటుంబీకులు ఆరోపించారు. వారు స్టేషన్‌ దగ్గర ఆందోళనకు దిగారు. ‘నిందితులతో రాజీపడాలని కొంతకాలంగా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా ఇళ్లపై రాళ్లేస్తున్నారు. డీఎస్పీని కలిస్తే... స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అంటూ తిప్పి పంపారు’ అని బాధితులు వాపోయారు. ఇక్కడి స్టేషన్‌ సిబ్బంది నిందితులకు వత్తాసు పలుకుతున్నారంటూ ఉమాయాదవ్‌ సోదరి ధనలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఉమాయాదవ్‌ హత్యకు గురైన నాటి నుంచి తమను లక్ష్యంగా చేసుకుని నిందితులు దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారని, ఈ విషయమై ఎప్పటికప్పుడు పోలీసులకు చెప్పినా చర్యలు తీసుకోకపోగా రాజీపడాలని సలహా ఇస్తున్నారని ధనలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు.  ఏమాత్రం సంబంధంలేని కేసులో తన సోదరుడు మహేష్‌యాదవ్‌ను అరెస్టు చేయటం రాజకీయ ఒత్తిళ్లల్లో భాగమేనని వాపోయారు. పట్టణ సీఐ అంకమ్మరావు వారిని స్టేషన్‌ లోపలికి తీసుకెళ్లి మాట్లాడారు. అనంతరం వారు ఆందోళనను విరమించారు. ధనలక్ష్మి ఆరోపణలను సీఐ ఖండించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని