రైతులపై వడ్డీ భారం తగ్గిస్తున్నాం

సన్న, చిన్నకారు రైతులతోపాటు వాస్తవ సాగుదారులందరికీ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా... పంట రుణాలపై వడ్డీ భారం తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు.

Published : 29 Nov 2022 03:17 IST

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి
8.22 లక్షల మందికి
రూ.160 కోట్ల వడ్డీ రాయితీ విడుదల

ఈనాడు, అమరావతి: సన్న, చిన్నకారు రైతులతోపాటు వాస్తవ సాగుదారులందరికీ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా... పంట రుణాలపై వడ్డీ భారం తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే పంట కాలంలో పెట్టుబడి రాయితీ జమ చేస్తున్నట్లు వివరించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 2020-21 రబీ, 2021 ఖరీఫ్‌ పంట కాలాలకు సంబంధించి అర్హులైన 8.22 లక్షల మంది రైతులకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీని సీఎం విడుదల చేశారు. 2022 జులై నుంచి అక్టోబరు మధ్య అధిక వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్న 45,998 మంది వ్యవసాయ, ఉద్యాన రైతులకు రూ.40 కోట్ల పెట్టుబడి రాయితీని వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘అర్హత ఉన్నా పొరపాటున జాబితాలో పేరు కనిపించకపోతే మళ్లీ ఫిర్యాదు చేయొచ్చు. వాటిని పరిశీలించి ఏటా జులై, డిసెంబరులో మేలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సున్నా వడ్డీ పథకం కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్లు, పెట్టుబడి రాయితీ ద్వారా 21.31 లక్షల మందికి రూ.1,834 కోట్ల సాయం అందించాం. రైతులు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నాం. మూడేళ్ల కాలంలో రూ.6,685 కోట్లను పరిహారంగా చెల్లించాం. రైతులు నష్టపోకుండా ఆర్బీకేల ద్వారా చర్యలు చేపట్టాం. మూడున్నరేళ్లలో ఒక్క కరవు మండలాన్ని కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా పోయింది’ అని వివరించారు.

ఏడాదికి 13 లక్షల టన్నుల దిగుబడి పెరుగుదల

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో... సగటున 167 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లభించిందని జగన్‌ వెల్లడించారు. ఏడాదికి సగటున 13 లక్షల టన్నుల పెరుగుదల కనిపిస్తోందన్నారు. ధాన్యం సేకరణకు ఏడాదికి రూ.13వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన అమూల్‌ సంస్థను తీసుకొచ్చి... రాష్ట్రంలో పాల వ్యాపారం ప్రారంభించడంతో రైతులకు పాల సేకరణ ధరలు పెరిగాయని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని