మాతృత్వ మరణాల నియంత్రణలో మెరుగే

దేశంలో అతి తక్కువ మాతృత్వ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉంది. తొలి జాతీయ సగటు కంటే తక్కువ మరణాలతో కేరళ, మహారాష్ట్ర, తెలంగాణల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.

Published : 30 Nov 2022 05:38 IST

తక్కువ మరణాలతో తొలి మూడు స్థానాల్లో కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ
నాలుగో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌  అయినా జాతీయ సగటు కంటే నయం

ఈనాడు, దిల్లీ: దేశంలో అతి తక్కువ మాతృత్వ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉంది. తొలి జాతీయ సగటు కంటే తక్కువ మరణాలతో కేరళ, మహారాష్ట్ర, తెలంగాణల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష కాన్పులకు 2017-19లో 103గా ఉన్న మాతృత్వ మరణాల నిష్పత్తి.. 2018-20 నాటికి 97కి తగ్గింది. ఈ విషయాన్ని రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయం మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో దీన్ని 70 కంటే తక్కువకు తీసుకురావాలని పేర్కొన్నా.. దానికి జాతీయ సగటు చాలా దూరంగా ఉంది. కేరళ (19), మహారాష్ట్ర (33), తెలంగాణ (43), ఆంధ్రప్రదేశ్‌ (45), తమిళనాడు (54)లో మాత్రం అతితక్కువ మాతృత్వ మరణాల నిష్పత్తి నమోదైంది. కాన్పు సమయంలో గానీ, తర్వాత 42 రోజుల్లోపు గానీ మహిళలు మరణిస్తే వాటిని మాతృత్వ మరణాలుగా పరిగణిస్తారు. ప్రతి లక్ష కాన్పుల ప్రాతిపదికన వీటిని లెక్కిస్తారు. అతి ఎక్కువ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో అస్సాం (195), మధ్యప్రదేశ్‌ (173), ఉత్తర్‌ప్రదేశ్‌ (167), ఛత్తీస్‌గఢ్‌ (137), ఒడిశా (119) ఉన్నాయి. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఈ సంఖ్య 57గా ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యం (70)కంటే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని