వారికేదీ అభయ హస్తం?

డ్వాక్రా మహిళలకు సంబంధించిన రూ.2వేల కోట్ల అభయ హస్తం నిధులను 11 నెలల క్రితం ఎల్‌ఐసీ నుంచి వెనక్కు తీసుకున్న ప్రభుత్వం.. ఆ పథకం నుంచి వైదొలిగిన వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది.

Published : 30 Nov 2022 05:38 IST

ఎల్‌ఐసీ నుంచి రూ.2వేల కోట్లు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
పథకం నుంచి వైదొలిగిన 10 లక్షల మందికి రూ.500 కోట్ల  చెల్లింపుల్లో తీవ్ర జాప్యం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డ్వాక్రా మహిళలకు సంబంధించిన రూ.2వేల కోట్ల అభయ హస్తం నిధులను 11 నెలల క్రితం ఎల్‌ఐసీ నుంచి వెనక్కు తీసుకున్న ప్రభుత్వం.. ఆ పథకం నుంచి వైదొలిగిన వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. లబ్ధిదారులకు చెల్లించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) ప్రభుత్వానికి నివేదించినా తాత్సారం చేస్తోంది. దాదాపుగా 10 లక్షల మందికి రూ.500 కోట్ల మేర ఇవ్వాల్సి ఉంది. తాము జమ చేసిన నిధుల్ని తిరిగి ఇవ్వాలని క్షేత్ర స్థాయిలో పలువురు లబ్దిదారులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. స్పందనలోనూ ఫిర్యాదు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికే విడతల వారీగా సెర్ప్‌ అధికారులు నిధులను జమ చేస్తున్నారు. ఇది రూ.100 కోట్ల వరకు ఉంటుంది. ఆ మొత్తాన్నీ సెర్ప్‌ వద్ద ఉన్న ప్రత్యేక నిధి నుంచి చెల్లిస్తున్నారే తప్ప ప్రభుత్వం ఇవ్వడం లేదని సమాచారం.

వెనక్కి తీసుకున్న నిధులు ఏమైనట్లు?

18- 59 ఏళ్ల వయసున్న డ్వాక్రా మహిళలు అభయహస్తం పథకం కింద రిజిస్టరై ఏడాదికి ఒక్కొక్కరు రూ.365లు చెల్లిస్తే.. ప్రభుత్వం వారి తరఫున మరో రూ.365 జమ చేస్తుంది. వీరికి 60 ఏళ్ల వయసు నుంచి రూ.500 నుంచి రూ.2200 వరకు పింఛను ఇస్తారు. 2009లో ఈ పథకాన్ని ప్రారంభించగా 2014 వరకు నమోదు కొనసాగింది. లబ్ధిదారులు వరుసగా మూడేళ్లు తమ వాటాను చెల్లించకపోతే వైదొలిగినట్లే. ఇలా వైదొలిగిన వారికి.. అప్పటి వరకు వారు జమ చేసిన మొత్తంతోపాటు వడ్డీ ఇస్తారు. లబ్ధిదారులు ఎవరైనా చనిపోయి ఉంటే వారు జమ చేసిన మొత్తం, వడ్డీతోపాటు ప్రభుత్వ వాటాను కలిపి ఇవ్వాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధిదారులు 34 లక్షల వరకు ఉండగా ప్రస్తుతం 5.52 లక్షల మందే ఉన్నారు. 1.56 లక్షల మంది పింఛను పొందుతున్నారు. విభజనకు ముందు, గత ప్రభుత్వ హయాంలోనూ వైదొలిగిన వారికి ఎప్పటికప్పుడు ఎల్‌ఐసీ సంస్థ వారు జమ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేది. ప్రభుత్వం నిధులు మళ్లించుకున్న తర్వాత.... అభయ హస్తం పథకంతో తమకు ఎలాంటి సంబంధం లేదని గతేడాది నవంబరులోనే ఎల్‌ఐసీ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో వైదొలిగిన లబ్దిదారులకు వారు చెల్లించిన మొత్తాన్ని ఇచ్చేస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటికే రూ.300 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఆ తర్వాత మరో 3 లక్షల మంది వైదొలిగినట్లు సమాచారం. మొత్తం వైదొలిగిన వారి సంఖ్య 10 లక్షలకుపైగానే ఉంది. వీరందరికీ కలిపి రూ.500 కోట్ల వరకు ఇవ్వాలి. ఇప్పటికీ వారికి చెల్లించకపోవడంతో ఆ నిధులు ఎటుపోయాయనే ప్రశ్న తలెత్తుతోంది. అభయహస్తం పేరుతో ప్రభుత్వం ప్రత్యేక ఖాతాను తెరిచి అందులో ఉంచిందని అధికారులు చెబుతున్నారు.

వడ్డీ నష్టమే...

ఎల్‌ఐసీ వద్ద నిధులు ఉండగా ఆ మొత్తానికి వడ్డీ చెల్లించేది. ప్రతి ఏటా అభయ హస్తం నిధికి ఆ మొత్తం అదనంగా జమయ్యేది. ప్రభుత్వం ఎల్‌ఐసీని పథకం నుంచి తప్పించిన సమయంలో ఓ జాతీయ బ్యాంకు.... ఆ సంస్థ కంటే ఎక్కువ వడ్డీ చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. కానీ ప్రభుత్వం రూ.2వేల కోట్లను బ్యాంకుల్లో ఉంచలేదు. తన వద్దే పెట్టుకుంది. ఆ మేరకు వడ్డీ నష్టపోవాల్సి వస్తోంది.

రెండు విడతల్లో రూ.28 కోట్లు ఇచ్చాం

‘అభయ హస్తం పెండింగ్‌ నిధులపై ప్రభుత్వానికి నివేదించాం. ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.28 కోట్లు చెల్లించాం. దరఖాస్తు చేసుకున్న వారి క్లైయిమ్‌లను పరిష్కరిస్తున్నాం. నెలవారీ చెల్లింపులు చేస్తున్నాం. ఎవరెవరికీ తిరిగి ఇవ్వాలనే దాని విషయంలో నిబంధనలను అనుసరిస్తున్నాం’ అని సెర్ప్‌ అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని