భూ దందా అడ్డుకున్నందుకు బదిలీ?

దేవాదాయశాఖ కమిషనరేట్‌లో అధికారుల ధోరణి చిత్ర విచిత్రంగా ఉంటోంది.

Updated : 05 Dec 2022 05:41 IST

వెళ్లనని మొరపెట్టుకున్నా డిప్యుటేషన్‌
దేవాదాయశాఖ కమిషనరేట్‌లో వింత ధోరణి

ఈనాడు-అమరావతి: దేవాదాయశాఖ కమిషనరేట్‌లో అధికారుల ధోరణి చిత్ర విచిత్రంగా ఉంటోంది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అంగీకారం తెలిపితేనే ఇతర చోట్లకు బదిలీపైగానీ, డిప్యుటేషన్‌పైగానీ పంపాల్సి ఉండగా.. అవేమీ పట్టించుకోకుండా తమకు పంటికింద రాయిలా ఉండేవారిని పంపేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ను, దేవాదాయ ట్రైబ్యునల్‌కు డిప్యుటేషన్‌పై పంపుతూ ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి ఆయనను కొద్ది రోజుల కిందటే కమిషనరేట్‌లోని ఓ సెక్షన్‌ నుంచి భూముల విభాగానికి బదిలీ చేశారు. అదే సమయంలో కాకినాడలోని ఓ ఆలయానికి చెందిన రూ.కోట్ల విలువైన భూమికి 20 ఏళ్ల కిందట వేలం జరిగితే, ఇపుడు నిబంధనలకు విరుద్ధంగా ఓ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అధికారులు దస్త్రాన్ని సిద్ధంచేశారు. ఈ అంశం బయటకు రావడంతో ఆ భూమి రిజిస్ట్రేషన్‌ ఆగిపోయింది. ఇందుకు భూముల విభాగానికి బదిలీపై వచ్చిన సీనియర్‌ అసిస్టెంటే కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయనను కమిషనరేట్‌లోనే ఉంచకూడదనే ఉద్దేశంతో దేవాదాయ ట్రైబ్యునల్‌కు బలవంతంగా డిప్యుటేషన్‌పై పంపుతూ ఆదేశాలిచ్చారని ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాను ట్రైబ్యునల్‌కు వెళ్లనని, తన అభిప్రాయాన్ని తీసుకోలేదంటూ ఆ ఉద్యోగి ఉన్నతాధికారులకు అర్జీ పెట్టినాసరే పట్టించుకోవడంలేదని తెలిసింది. ఇదే కమిషనరేట్‌లోని వేరొక సీనియర్‌ అసిస్టెంట్‌.. తనను ట్రైబ్యునల్‌కు పంపాలని కోరినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే సూపరింటెండెంట్‌ సైతం తనను ట్రైబ్యునల్‌కు ఏవోగా పంపాలని కోరుతునే ఉన్నారు. ఇలా అభ్యర్థన పెట్టుకున్నవారికి కాకుండా, ఓ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకొని బదిలీ చేయడం, తర్వాత రిలీవింగ్‌ చేయకపోవడం, ఆయనకు జీతం కూడా రాకుండా ఆపేయడంపై కమిషనరేట్‌లో పెద్దచర్చే జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని