మహిళలు ఎవరికీ తక్కువ కాదు

‘మహిళలు ఎవరికీ తక్కువ కాదు. మాలోనూ దమ్ముంది. ఇక్కడ పలువురితో మాట్లాడా. స్వయం సహాయక సంఘాల మహిళల విజయ గాథలో రాధ గురించి తెలుసుకున్నా.

Published : 06 Dec 2022 05:36 IST

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టీకరణ

ఈనాడు, తిరుపతి: ‘మహిళలు ఎవరికీ తక్కువ కాదు. మాలోనూ దమ్ముంది. ఇక్కడ పలువురితో మాట్లాడా. స్వయం సహాయక సంఘాల మహిళల విజయ గాథలో రాధ గురించి తెలుసుకున్నా. ఆమె పోరాటం చాలా గొప్పది. పనిలో చిన్నాపెద్దా తేడా ఏదీ ఉండదు. పేరులోనే తేడా ఉంటుంది’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. ఆమె సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో మాట్లాడారు. ‘భారత రాష్ట్రపతిగా నేను పర్యటించిన తొలి విశ్వవిద్యాలయం ఇదే’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయ సంఘాల సభ్యులు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలు, విద్యార్థినులు, ప్రొఫెసర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పద్మావతి వర్సిటీ వీసీ జమున, ఎస్వీయూ వీసీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆదివారం రాత్రి తన కుమార్తె ఇతిశ్రీ ముర్ముతో కలిసి తిరుమలకు వచ్చిన ఆమె శ్రీపద్మావతి అతిథి గృహంలో బస చేశారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు వాహన మండపం వద్దకు చేరుకున్నారు. మొదట పుష్కరిణి నీటితో ప్రోక్షణం చేసుకుని శ్రీభూవరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. మహద్వారం వద్ద రాష్ట్రపతికి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి అర్చక బృందం ఆమెకు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. పెద్దజీయంగారు, చిన్నజీయంగారు, శ్రీవారి ప్రధాన అర్చకులు వేణుగోపాల్‌ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యం, సన్నిధిలోని ఇతర ఆలయాల చరిత్రను రాష్ట్రపతికి వివరించారు. దర్శనానంతరం ఆమెకు స్వామి వారి శేషవస్త్రాన్ని అందజేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న సప్త గో ప్రదక్షిణ మందిరానికి రాష్ట్రపతి చేరుకున్నారు. అక్కడ శ్రీవేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. అనంతరం గో తులాభారంలో గోవు బరువుకు సమానమైన 435 కిలోల దాణాను విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించి రూ.6 వేలు అధికారులకు అందజేశారు.


శ్రీపద్మావతి అమ్మవారి దర్శనం

విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్రపతి... తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిశోర్‌ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని దిల్లీకి వెళ్లారు. దర్శనం బాగా జరిగిందని, తిరుమల, తిరుచానూరు ఆలయాల్లో ఏర్పాట్లు బాగున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతోషం వ్యక్తంచేశారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రి ఆర్‌.కె.రోజా, కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, సప్త గోప్రదక్షిణ మందిర దాత శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని