మార్చి నుంచి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌

రాష్ట్రంలో గత అక్టోబరులో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ‘ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌’ను మార్చి ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు.

Published : 28 Jan 2023 03:16 IST

సీఎం జగన్‌ వెల్లడి
అదే రోజు నుంచి ప్రజాప్రతినిధుల ఆసుపత్రుల సందర్శన

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గత అక్టోబరులో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ‘ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌’ను మార్చి ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వాసుపత్రులను సందర్శిస్తారని తెలిపారు. అలాగే.. గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్‌ను మార్చి1 నుంచి పంపిణీ చేస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై శుక్రవారం సమీక్షించి ఆయన మాట్లాడారు. ‘పరిసరాల పరిశుభ్రత, సమతుల ఆహారం, వ్యాయామం, ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలి. పిల్లల్లో రక్తహీనత సమస్య తలెత్తకుండా వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ, శిశుసంక్షేమ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. రక్తహీనత నివారణ కోసం కిశోర బాలికలు, గర్భిణులకు బి-12 సబ్‌లింగ్యువల్‌ మాత్రలను అందించాలన్న వైద్యుల సూచనలను పాటించాలి. ప్రసవం అత్యంత కష్టమయ్యే అవకాశమున్న గర్భిణులను ముందే గుర్తించి ఆసుపత్రులకు తరలించాలి’ అని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్నీ వ్యాధుల నివారణకు రూ.700 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ‘అధికారులు చెప్పిన ప్రకారం ఉద్ధానంలో మార్చినాటికి తాగునీటి పథకం, పలాసలో కిడ్నీ రీసెర్చి సెంటర్లను నిర్మిస్తే కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అలాగే కొత్తగా రానున్న బోధనాసుపత్రులు సహా అన్నింట్లో క్యాన్సర్‌ నివారణ పరికరాలు, చికిత్సను అందుబాటులోకి తేవాలి. గుండెజబ్బులకు చికిత్స అందించేందుకు బోధనాసుపత్రుల్లో క్యాథ్‌ల్యాబ్స్‌ ఏర్పాటుచేయాలి. అనారోగ్య సమస్యలపై విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బందినుంచి వివరాలు అందగానే చర్యలు తీసుకోవాలి’ అని సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలపై రూపొందించిన యాప్‌ను పరిశీలించిన సీఎం పలు మార్పులను సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని