బీఈడీ అనుమతుల్లో దందా

రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. తనిఖీల పేరుతో కుంభకోణానికి తెరతీశారు.

Published : 29 Jan 2023 04:22 IST

తనిఖీలు, రెన్యూవల్‌ పేరిట  భారీగా వసూళ్లు
తెలంగాణ నుంచి సర్టిఫికెట్లు తెచ్చి, ఇక్కడ పని చేస్తున్నట్లు
నమోదు

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. తనిఖీల పేరుతో కుంభకోణానికి తెరతీశారు. విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యాశాఖ వరకూ మామూళ్లు ఇవ్వాలనే పేరుతో కళాశాలల నుంచి గుంటూరుకు చెందిన వైకాపా నాయకుడి బంధువు ఒకరు రూ.2కోట్ల వరకూ వసూలు చేసినట్లు తెలిసింది. నకిలీ అధ్యాపకులను చూపి.. ఆమోదం పొందేందుకు తనిఖీ బృందాలకు ఒక్కో కళాశాల రూ.50వేల నుంచి రూ.75వేల వరకూ చెల్లించినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఈ వ్యవహారం సాగింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 60కిపైగా కళాశాలలకు అనుమతులిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. విజయవాడకు సమీపంలోని ఓ కళాశాలలో ఫైన్‌ ఆర్ట్స్‌ అధ్యాపకుడి ఆధార్‌ నంబరు తప్పుగా నమోదు చేసినందుకు అనుమతులు నిలిపివేసిన నాగార్జున వర్సిటీ.. భవనాలు లేకపోయినా, కాగితాల్లో మాత్రమే ఉన్నవాటికి సైతం అనుమతులిచ్చేసింది.

బీఈడీ కళాశాలల తనిఖీలపై మొదటి నుంచీ ఆరోపణలొస్తూనే ఉన్నాయి. కౌన్సెలింగ్‌ను మధ్యలో నిలిపేసి తనిఖీలు చేయడం వెనుక పెద్ద తతంగమే ఉందని ప్రచారం సాగుతోంది. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో విశ్వవిద్యాలయాలు కమిటీలతో తనిఖీలు చేయించాయి. అక్టోబరులో కళాశాలల జాబితాను ఉన్నత విద్యామండలికి కమిటీలు అప్పగించాయి. వీటి ఆధారంగా అక్టోబరు 22 నుంచి కౌన్సెలింగ్‌ మొదలైంది. రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండగా.. కళాశాలలను మళ్లీ తనిఖీ చేయాలంటూ అదే నెల 31న ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది. దీంతో కౌన్సెలింగ్‌ను మధ్యలో ఆపేశారు. తిరిగి ఈనెల 25 నుంచి వెబ్‌ ఐచ్ఛికాలను ప్రారంభించారు. మొదటిసారి తనిఖీల సమయంలో ఒక్కో కళాశాల రూ.20వేల నుంచి రూ.25వేల వరకూ మామూళ్లు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. రెండోసారి విశ్వవిద్యాలయానికి సంబంధం లేని వారితో పరిశీలన చేయించాల్సి ఉండగా.. మళ్లీ అదే వర్సిటీలకు చెందిన వారిని పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా 411 బీఈడీ కళాశాలలుండగా.. తనిఖీల పేరుతో 120 కళాశాలలకు అనుమతులను నిలిపేశారు. ప్రకాశం జిల్లాలో ఓ నాయకుడికి 6 కళాశాలలున్నాయి. వీటిలో ఎక్కడా అధ్యాపకులు లేకున్నా అనుమతులిచ్చేశారు. గుంటూరుకు చెందిన వైకాపా నేత బంధువుకు 8 కళాశాలలున్నాయి. వీటిలో రెండు, మూడింటికి భవనాలూ లేవు. వీటికీ అనుమతులను పునరుద్ధరించేశారు.

డబ్బులిచ్చి.. ధ్రువపత్రాలు తెచ్చి...

కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులను గుర్తించేందుకు ఆధార్‌ కార్డులతో అనుసంధానించి ఉన్నత విద్యాశాఖ పరిశీలన చేయించింది. 1,200 మంది అధ్యాపకులు రెండు, మూడు కళాశాలల్లో పని చేస్తున్నట్లు తేలింది. దీనిపై కళాశాలలకు నోటీసులు ఇవ్వడంతో కొన్ని యాజమాన్యాలు నకిలీ ధ్రువపత్రాలకు తెరతీశాయి. తెలంగాణ అధ్యాపకులకు డబ్బులిచ్చి ధ్రువపత్రాలను తీసుకొచ్చి ఇక్కడ పని చేస్తున్నట్లు చూపాయి.  పోస్టుగ్రాడ్యుయేషన్‌తోపాటు ఎంఈడీ ఉన్న సర్టిఫికెట్‌కు రూ.15వేల నుంచి రూ.20వేలు, నెట్‌, స్లెట్‌ ఉన్న వారికి రూ.25వేల నుంచి రూ.30వేలు, పీహెచ్‌డీ ఉన్న ప్రిన్సిపాళ్లకు రూ.50-రూ.70వేలు, ఫైన్‌ఆర్ట్స్‌ అర్హతకు రూ.40వేల నుంచి రూ.50వేలు ఇచ్చి, సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. ఈ సర్టిఫికెట్లను రెండేసి, మూడేసి కళాశాలల్లో చూపారు. ఈ వ్యవహారంలో గుంటూరు అధ్యాపకుడు మధ్యవర్తిగా వ్యవహరించారు.

ఇప్పటికే నిండిన సీట్లు

బీఈడీ కళాశాలల్లో ఇప్పటికే సీట్లు నిండిపోయాయి. అనధికారికంగా ఒడిశా, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, అస్సాం విద్యార్థులతో కళాశాలలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈసారి ఒడిశా నుంచి సీట్లకు డిమాండు భారీగా పెరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు