కస్తూర్బాలలో అసౌకర్యాల రాజ్యం

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. అరకొర సదుపాయాలతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 30 Jan 2023 04:52 IST

ఏడాదిగా మంజూరవని కాస్మెటిక్‌ ఛార్జీలు
ఒకే భవనంలో 280 మందికి బోధన, వసతి
ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు లేకుండానే తరగతులు

ఈనాడు, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. అరకొర సదుపాయాలతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన కస్తూర్బాలు  సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. నిధుల కొరత పేరుతో వీటిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఉన్నవారు, మధ్యలో బడిమానేసిన అమ్మాయిలు ఎక్కువ మంది చదివే వీటికి నిధులు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఇంతవరకు కాస్మెటిక్‌ ఛార్జీలను ఇవ్వలేదు. ట్రంకు పెట్టెలు, దుప్పట్లు పంపిణీ చేయలేదు. విద్యార్థినులు తీవ్ర చలితో వణుకుతున్నా దయచూపడం లేదు. కొన్నిచోట్ల ఇంటర్‌కు అదనపు గదులు లేకపోవడంతో తరగతి గదుల్లోనే రాత్రిపూట నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 352 విద్యాలయాలు ఉండగా వీటిల్లో ఒక్కో దాంట్లో 6-10 తరగతులకు 200 మంది చొప్పున చదువుతున్నారు. గతంలో 221 వాటిల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశపెట్టగా.. ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన 131 చోట్ల ప్రారంభించారు. రెండేళ్లకు కలిపి ఒక్కో దాంట్లో 80 సీట్లు ఉన్నాయి.

ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే...

విద్యార్థినులకు కాస్మెటిక్‌ ఛార్జీల కింద ఒక్కొక్కరికీ నెలకు రూ.100 ఇవ్వాల్సి ఉండగా... ఏడాదిగా విడుదల చేయడం లేదు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. డిసెంబరులో ఖాతాల వివరాలను సేకరించడం మొదలు పెడితే వారికి డబ్బులు వేసేది ఎప్పుడో తెలియడంలేదు. గతంలో డబ్బులకు బదులు సబ్బులు, బ్రష్‌, ఇతర వస్తువులతో కూడిన కిట్లను ఇచ్చేవారు. ఈ విద్యా సంవత్సరంలో కిట్లను ఇవ్వలేదు... డబ్బులూ అందించడం లేదు. దీంతో పిల్లలు సబ్బులు, నూనెలు, ఇతర వస్తువులను ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. అనాథలు, పేద పిల్లలకు ఈ వ్యయం భారంగా మారుతోంది. దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు. మిక్సీలు, ఇతరత్రా సామగ్రి మరమ్మతులు, కిటికీలకు జాలీల ఏర్పాటులాంటి వాటి కోసం చాలాచోట్ల ప్రిన్సిపాళ్లు సొంతంగా డబ్బులను ఖర్చు చేశారు. గతేడాది దాదాపు ఒక్కో ప్రిన్సిపల్‌ రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వ్యయం చేయగా.. ఇంతవరకు వాటి బిల్లులను చెల్లించలేదు. ఈ ఏడాది బిల్లులను ఇస్తున్న అధికారులు పాత బకాయిలపై మౌనం వహిస్తున్నారు.

ఇంటర్మీడియట్‌కు పుస్తకాలే లేవు

మండలానికో మహిళా జూనియర్‌ కళాశాల ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ విద్యా సంవత్సరంలో 131 కస్తూర్బాలలో ఇంటర్మీడియట్‌ను ప్రవేశ పెట్టారు. అయితే... విద్యార్థినులకు ఇంతవరకు పాఠ్యపుస్తకాలను అందించలేదు. గతేడాది విద్యార్థుల నుంచి పుస్తకాలు తీసుకొని కొత్తవారికి ఇవ్వగా... కొత్తగా ప్రారంభించిన చోట విద్యార్థులే కొనుక్కోవాల్సి వచ్చింది.

గదులకు తీవ్ర కొరత: రాష్ట్రవ్యాప్తంగా 352 కస్తూర్బాలలో ఇంటర్‌ ఉన్నా 35 చోట్ల మాత్రమే రేకుల షెడ్లు నిర్మించారు. మిగతాచోట్ల అదనపు గదుల నిర్మాణంలో జాప్యం చేస్తున్నారు. 6-10 తరగతుల్లో 200 మంది అమ్మాయిలు ఉండేలా నిర్మించిన భవనాల్లో అదనంగా 80 మంది ఇంటర్‌ చదివేవారికి వసతి కల్పించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి కేజీబీవీలో సరిపడా గదులు లేకపోవడంతో డార్మిటరీల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పగలంతా చదువుకున్న తర్వాత విద్యార్థినులు రాత్రిపూట బెంచీలను పక్కకు జరిపి నిద్రపోతున్నారు. తరగతి గదుల నిర్మాణం చేపట్టినా ఇంకా పూర్తి కాలేదు. కర్నూలు జిల్లా ఆదోనిలోని కేజీబీవీలోనూ తరగతి గదులు సరిపడా లేకపోవడంలో సైన్సు, కంప్యూటర్‌ సైన్సు ల్యాబ్‌ల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. చాలావాటిల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని