ఏపీలో విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు రూ.2,618 కోట్ల రుణాలు
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ విదేశీ ఆర్థిక సంస్థలతో చేపట్టే ప్రాజెక్టులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,618 కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ విదేశీ ఆర్థిక సంస్థలతో చేపట్టే ప్రాజెక్టులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,618 కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. మొత్తం 8 ప్రాజెక్టులకు 2022-23 బడ్జెట్‌లో సవరించిన అంచనాల ప్రకారం రూ.2,950.49 కోట్లు కేటాయించగా 2023-24 బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని రూ.2618.25 కోట్లకు తగ్గించింది.
ఆక్వాపై మరింత చొరవ చూపాల్సి ఉంది
మోపిదేవి వెంకటరమణారావు, రాజ్యసభ సభ్యుడు, వైకాపా
కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌లో ఏ రంగానికి ఎంత సమకూరుస్తుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రత్యేకహోదా సాధన మా ప్రధాన ఎజెండా. దానిపై శక్తివంచన లేకుండా చివరి వరకు పోరాడతాం. బడ్జెట్‌లో ఆక్వాకు సంబంధించి కొన్ని రాయితీలు కల్పించడం ఊరట కలిగిస్తున్నా ధరల స్థిరీకరణ, విదేశాలకు ఎగుమతికి ఫ్రీ ట్రేడింగ్ విషయంలో కేంద్రం ఇంకా చొరవ చూపాల్సి ఉంది.
విశాఖపట్నం-విజయవాడ మూడో లైన్ ఇవ్వాలి
మార్గాని భరత్, రాజమహేంద్రవరం ఎంపీ
రైల్వేపరంగా విశాఖపట్నం-విజయవాడ మధ్య మూడో లైను ఇవ్వాల్సి ఉంది. కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైను ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్‌కు 70 కి.మీ. దూరం తగ్గుతుంది. రామాయపట్నం పోర్టుకు నిధులు కేటాయించాలి. రాష్ట్రంలో కొత్తగా 18 వైద్య కళాశాలలు నిర్మిస్తుంటే మూడు కళాశాలలకు మాత్రమే నిధులిస్తామన్నారు.
రాష్ట్రానికి నిరాశ
రామ్మోహన్ నాయుడు, తెదేపా లోక్‌సభా పక్ష నేత
కేంద్ర బడ్జెట్.. మధ్యతరగతి, సామాన్యులకు ప్రయోజనం కలిగించేలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే మాత్రం నిరాశాజనకంగా ఉంది. రాష్ట్ర విభజన హామీలను పదేళ్లలో పూర్తి చేయాలి. బడ్జెట్‌లో మాత్రం వాటి ప్రస్తావనే రాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి ప్రయోజనాలూ లేకపోవడానికి వైకాపా బాధ్యత వహించాలి. మేం అధికారంలో ఉన్న తొలి అయిదేళ్లలో పోలవరం 70 శాతం పూర్తి చేశాం. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి రైల్వే జోన్ ప్రకటించేలా చేశాం. వెనుకబడిన జిల్లాలకు నిధులు సాధించాం. ఈ విషయంలో వైకాపా ఎంపీలు విఫలమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ సీబీఐ, ఈడీ ఇతర కేసుల మాఫీకి దిల్లీ పర్యటనలు చేస్తున్నారు.
నిధులు రాబట్టడంలో విఫలం
కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెదేపా జాతీయ అధికార ప్రతినిధి
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జాతీయ స్థాయిలో బడ్జెట్ ప్రతిపాదనలు ఆశాజనకంగా ఉన్నా...జగన్‌రెడ్డి వైఫల్యం కారణంగా రాష్ట్రానికి నిరాశే మిగిలింది. పక్క రాష్ట్రమైన కర్ణాటక వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.5,300 కోట్లు సాధించుకుంది. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్నా రూపాయి కేటాయింపు జరగలేదు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మౌలిక రంగాల ప్రాజెక్టులకూ మొండి చేయే చూపారు.
ఏపీకి మళ్లీ మొండిచేయి
కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్రానికి మరో మారు మొండిచేయి చూపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం, విభజన చట్ట హామీల అమలుకు చర్యలు లేకపోవడం విచారకరం. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి, పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాలకు నిధుల ఊసేలేదు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కర్ణాటకకు కేటాయింపులు
శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటి గురించి కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించలేదు. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు 2022-23 బడ్జెట్లో కంటే ఈ సారి 15% కోత వేయడం అమానుషం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కర్ణాటకకు కేంద్రం కేటాయింపులు పెంచింది.
ఏపీపై కేంద్రానికి చిన్నచూపు
భీశెట్టి బాబ్జీ, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు
కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లోనూ ఏపీని పట్టించుకోలేదు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల ప్రస్తావన లేదు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోన్, విశాఖ మెట్రోరైలు, కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్యకళాశాలలకు నిధులపై మాట్లాడలేదు.
రాజధాని నిర్మాణానికి నిధుల ప్రస్తావన లేదు
బాలకోటయ్య, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు
ఈ బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపింది. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ప్రస్తావన బడ్జెట్‌లో లేదు. రాజధాని నిర్మాణానికి నిధుల గురించి బడ్జెట్లో లేకపోవడం బాధాకరం. ఏపీకి ఏమి ఇచ్చిందో కేంద్రాన్ని సీఎం జగన్ అడగాలి.
ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేటు సంస్థలకు లబ్ధి
వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు కొనసాగింపుగానే ఈ బడ్జెట్ కూడా ఉంది. రైల్వేస్టేషన్లు, రైలు మార్గాలను ప్రైవేటీకరిస్తూ వాటిపైన రూ.2.4 లక్షల కోట్లు వ్యయం చేయటం ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేటు సంస్థలకు లబ్ధిచేకూర్చడమే అవుతుంది.
రైతు వ్యతిరేక బడ్జెట్
రాధాకృష్ణ, హరిబాబు, కౌలు రైతుల సంఘం నేతలు
కేంద్ర బడ్జెట్లో కౌలు రైతుల సంక్షేమం గురించి లేకపోవడం అన్యాయం. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పే కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధిని పెంచేలా ప్రకటన చేయకపోవడం దారుణం. కనీస కూలిని పెంచి గ్రామీణ పేదలకు పనులు కల్పించాలి.
విద్యా రంగానికి ఊతమివ్వదు
యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ
ఈ బడ్జెట్ విద్యారంగానికి ఊతమివ్వదు. కేంద్రం విద్యా రంగ బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. శాస్త్ర, సాంకేతిక రంగాలకు రెండు శాతం నిధులు కేటాయించాలి. కానీ..0.7% మాత్రమే కేటాయించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: సత్తెనపల్లి టికెట్ కోసం యుద్ధానికైనా సిద్ధం: వైకాపా నేత చిట్టా
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Movies News
Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు
-
India News
Uttarakhand: లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, 20మందికి గాయాలు..!
-
India News
Anurag Thakur: ‘రాహుల్ గాంధీ పది జన్మలెత్తినా.. సావర్కర్ కాలేరు’
-
Movies News
Rana: రానా.. చిన్నప్పటి ఇంటిని చూశారా..!