AP Assembly: సభ జరుగుతుండగా జగన్‌ దిల్లీ ఎందుకు వెళ్లారు?

‘సభ జరుగుతున్న సమయంలో సీఎం దిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారు? రాష్ట్ర ప్రయోజనాల కోసమే పర్యటిస్తే వివరాలను సభ్యులకు తెలపాలి’ అని తెదేపా ఎమ్మెల్సీలు మండిపడ్డారు.

Updated : 19 Mar 2023 07:27 IST

మండలిలో  తెదేపా వాయిదా తీర్మానం
ఛైర్మన్‌ తిరస్కరించడంతో  సభ్యుల నిరసన.. వాకౌట్‌

ఈనాడు, అమరావతి: ‘సభ జరుగుతున్న సమయంలో సీఎం దిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారు? రాష్ట్ర ప్రయోజనాల కోసమే పర్యటిస్తే వివరాలను సభ్యులకు తెలపాలి’ అని తెదేపా ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీనిపై శాసనమండలిలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని మండలి ఛైర్మన్‌ మోషేను రాజు తిరస్కరించడంతో పోడియంలోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. ఛైర్మన్‌ వారించి.. మాట్లాడే అవకాశం ఇస్తాననడంతో తమ స్థానాల్లో కూర్చున్నారు. శనివారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. సీఎం దిల్లీలో ఏం చర్చించారో తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను తెలుసుకోవాలని తీర్మానం ప్రవేశపెడితే చర్చకు ఎందుకు అనుమతించడం లేదు’ అన్నారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘దీనిపై తెదేపా ఎమ్మెల్సీలు పట్టుపట్టడం భావ్యం కాదు.  ఏదో గొడవ చేసి సస్పెండ్‌ కావాలని చూస్తున్నారు. సీఎం 24న దిల్లీ పర్యటనపై సభలో మాట్లాడతారు’ అని పేర్కొన్నారు. దీంతో తెదేపా ఎమ్మెల్సీలు మరోసారి నిరసనకు దిగి..  ఛైర్మన్‌ పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. సీఎం ఈ రోజే మాట్లాడాలని.. ఆఖరు రోజు ఏదో ఒక కారణంతో తమను బయటకు నెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించాలన్నదే వైకాపా ఆలోచనగా ఉందంటూ తెదేపా ఎమ్మెల్సీలు వాకౌట్‌ చేశారు. నిరసనల నడుమ ఛైర్మన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2.25కు తిరిగి సమావేశమైన సభ్యులు.. బడ్జెట్‌పై సాయంత్రం 4.25 వరకు చర్చించారు. అనంతరం సభను ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌ ప్రకటించారు.

ఉద్యోగుల బకాయిలు సున్నా

ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులపై తెదేపా ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దువ్వారపు రామారావు అడిగిన ప్రశ్నకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సమాధానం ఇస్తూ.. ‘నేను సభలో మాట్లాడే సమయానికి చెబుతున్నా. ఉద్యోగుల టీఏ బిల్లు బకాయిలు, వైద్యబిల్లు బకాయిలు, ఈహెచ్‌ఎస్‌ బకాయిలు, పండగ అడ్వాన్సులు.. సున్నా’ అని చెప్పారు. జీపీఎఫ్‌ రూ.405 కోట్లు, డీఏ రూ.538 కోట్లు, సరెండర్‌ లీవ్‌లు రూ.1,752 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉందన్నారు. చర్చ జరుగుతుండగానే అసెంబ్లీలో ముఖ్యమైన బిజినెస్‌ ఉందంటూ బుగ్గన వెళ్లిపోయారు. ఇది సభను అవమానించడమేనంటూ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆలయాల గురించి ప్రభుత్వానికి పట్టదా?

బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాజపా ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పలు అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేశారు. నెల్లూరు జిల్లాలో వరదల్లో సోమేశ్వరాలయం కొట్టుకుపోయిందని.. దీన్ని పునరుద్ధరించే విషయమై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. ‘ప్రభుత్వం హిందూ ఆలయాలను ఎందుకు పట్టించుకోదు? రథాన్ని దగ్ధం చేసినా ఇప్పటికీ చర్యలు లేవు’ అంటూ చేసిన వ్యాఖ్యలు సభలు పెద్ద దుమారాన్నే రేకెత్తించాయి. ఆయన మాటలపై వైకాపా ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇసాక్‌ బాషా అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని