రైతన్నకు ‘రంపపు కోత!’

ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు.

Published : 26 Apr 2024 06:50 IST

ఎవరైనా ప్రశ్నిస్తే... రైతే కాదని వేధింపులు
రాయితీ పథకాలకు కత్తెరేసి మద్దతు ధరలకు పాతర
తుపాన్లు, భారీ వర్షాలతో నష్టపోయినా అరకొర సాయమే 
తీవ్ర కరవునూ పట్టించుకోని పాలకుడు
అనుబంధ రంగాలనూ అల్లాడించిన వైకాపా
ఐదేళ్ల పాలన వ్యవసాయానికి ఉరేసిన సీఎం జగన్‌
ఈనాడు, అమరావతి

రైతుభరోసా ఎందుకు రాలేదని అడగలేం...
కౌలు కార్డు ఎందుకివ్వలేదని నిలదీయలేం...
మద్దతుపై ధాన్యం కొనడం లేదనాలన్నా భయం...  
వానకు పంట పోయిందని చెప్పాలన్నా భయమే!
కరవుతో పంటలు ఎండిపోయాయని నోరుతెరచి చెప్పలేం...
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరిహారంపైనా ప్రశ్నించలేం...
పథకాలు అందడం లేదని పత్రికలకు చెప్పినా వేధింపులే....
పంటల బీమా రాకున్నా, రాయితీ సొమ్ము
జమ చేయకున్నా మౌనంగా భరించాల్సిందే...
ఎందుకంటే... ఇది జగన్‌ ప్రభుత్వం!

ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. కౌలుకు పొలం చేస్తున్నామంటే.. అసలు కౌలుకే ఇవ్వలేదని యజమానితోనే చెప్పిస్తారు. ఎవరైనా వాస్తవం చెబుతామంటూ ముందుకొచ్చారా? వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే పథకాల్ని నిలిపేస్తారు. రైతులే అబద్ధమాడుతున్నారంటూ.. సాక్షి పత్రికలో ఫొటోలతో సహా అచ్చేసి వారి పరువు తీస్తారు. తమకు నచ్చకపోతే అన్నంపెట్టే రైతునైనా సరే.. ఎంతలా వెంటాడి వేధిస్తారో ఐదేళ్ల జగన్‌ పాలన కళ్లకు కట్టింది. రైతులను ఇంతలా భయపెట్టిన పాలకులు రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలోనూ మునుపెన్నడూ లేరు. ఈ ఘనత దక్కించుకున్న నాయకుడిగా జగన్‌ ఎప్పటికీ మిగిలిపోతారు!!


రాష్ట్ర వ్యవసాయ రంగం వెన్ను విరిచిన సీఎం జగన్‌.. రైతులకు నోరెత్తి మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారు. ధాన్యానికిచ్చే మద్దతు ధరకు మూటకట్టేసి.. తమ పార్టీ రైస్‌ మిల్లర్ల సంఘం నేతలకు అప్పగించేశారు. పైగా క్వింటాకు 20 కిలోలు, కాదంటే రూ.400 చొప్పున పేటీఎం వసూళ్లు చేశారు. వ్యవసాయ అనుబంధ శాఖల్లో రాయితీ పథకాలను సైతం ఎత్తేశారు. వర్షాలు, వరదలు, తుపాన్లు, కరవు సుడిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నా సాయం చేయాలనే మానవత్వమూ చూపలేదు. కొందరు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడినా పట్టించుకోలేదు. రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అనేది ఐదేళ్లలో ఎక్కడా కనిపించలేదు. వ్యవసాయంలో ఆయన సాధించిందేమిటంటే... సాగు విస్తీర్ణం తగ్గించడం, రైతుల్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే. కూలీలను వలసబాట పట్టించడమే. కౌలు రైతులను కష్టాలపాల్జేయడమే.


నష్టం రూ.50 వేల కోట్లు.. ఇచ్చింది రూ.3,261 కోట్లే

పంట నష్టానికి పెట్టుబడి సాయాన్ని... అదే పంట కాలంలో జమ చేస్తున్నామని చెప్పే జగన్‌... ఐదేళ్లలో ఇచ్చింది రూ.3,261 కోట్లు. కానీ, రైతులు నష్టపోయిన పంటల విలువెంతో తెలుసా? రూ.50 వేల కోట్ల పైమాటే. అంటే 10% కూడా  ఇవ్వలేదు. 2020లో ఒక్క నివర్‌ తుపానుకే 17 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ ఏడాదిలో నివర్‌, భారీవర్షాలకు మొత్తంగా 37 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఎకరానికి రూ.25 వేల లెక్కన చూసినా... రూ.9,250 కోట్ల పెట్టుబడిని రైతులు కోల్పోయారు. 2023 డిసెంబరులో 20 లక్షల ఎకరాల్లోని పంటల్ని మిగ్‌జాం తుపాను ఊడ్చేసింది. వర్షాలు, వరదలకు గోదావరి, కృష్ణా డెల్టా రైతుల పొలాలు ఏడాదికి రెండు, మూడుసార్లు మునిగాయి. ఈ ఏడాది రాయలసీమ, ఉత్తరాంధ్రలో సాగునీరందక పంటలు ఎండిపోయాయి. ఫలితంగా చిన్న, సన్నకారు, కౌలు రైతులు అప్పులపాలై కూలీ పనులకు వెళ్తున్నారు.  డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, ఉమ్మడి పశ్చిమగోదావరి, బాపట్ల,  వైయస్‌ఆర్‌ జిల్లాల్లో పంట విరామం ప్రకటించే దుస్థితి దాపురించింది.  


ముఖ్యమంత్రికి కరవు కనిపించలేదట

తీవ్ర కరవు ఉన్నా జగన్‌ ప్రభుత్వం గుర్తించలేదు. దెబ్బతిన్న పంటల పరిశీలనకైనా వెళ్లలేదు. సీఎం మనసెరిగిన అధికారులు... 2023-24  ఖరీఫ్‌, రబీల్లో 450కిపైగా మండలాల్లో కరవు పరిస్థితులు రాజ్యమేలుతున్నా... వర్షాభావమనే రంగులద్దారు. 47.87 లక్షల ఎకరాల్లో పంటలే వేయలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నా.. జగన్‌ పట్టించుకున్న పాపాన పోలేదు. రబీలోనూ మొద్దునిద్ర పోయారు. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఖరీఫ్‌లో 103, రబీలో 87 కరవు మండలాల్ని ప్రకటించారు. 2022-23లో  రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణమే. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పత్తిలో ఎకరాకు క్వింటా దిగుబడి రాని వారెందరో ఉన్నారు. వేరుసెనగ దిగుబడి కొందరికి ఎకరాకు   20 కిలోలే రావడం గమనార్హం.

2019-20 నుంచి 2023-24 వరకు సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే సాగైన పంటల విస్తీర్ణం 132 లక్షల ఎకరాలు తగ్గింది. వైకాపా వచ్చాక సాగు, ఉత్పత్తి పెరిగిందంటూ సభల్లో జగన్‌ చేసే ప్రసంగాలన్నీ పచ్చి అబద్ధాలే. ఆహార, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగు భారీగా తగ్గినా నిజాన్ని కప్పిపెట్టి వ్యవసాయం అద్భుతమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.


రైతుకు ఇవ్వడానికి చేతులు రాలేదు.. అమూల్‌కైతే అత్యుత్సాహం!!

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే సహకార రంగాన్ని పునరుద్ధరిస్తామని.. పాలు పోసే ప్రతి రైతుకు లీటరుకు రూ.4 చొప్పున బోనస్‌ ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక మొత్తం పాడిరంగాన్ని అమూల్‌ పరం చేసి, రూ.6 వేల కోట్ల డెయిరీ ఆస్తుల్ని అప్పనంగా  కట్టబెట్టారు. మరో రూ.6 వేల కోట్లతో పాలసేకరణ కేంద్రాలు, బల్క్‌మిల్క్‌ యూనిట్లు నిర్మిస్తున్నారు. లీటరుకు రూ.4 బోనస్‌లో పైసా ఇవ్వలేదు.

 పాడిరైతులకు కిలో రూ.2 చొప్పున ఇచ్చే మాగుడుగడ్డి పథకాన్ని   ఎత్తేశారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు లేవు. గోకులాలకు మంగళం పాడారు. పశునష్ట పరిహార పథకం ఎత్తేసి... పశువుల బీమా తెచ్చారు. దాన్నీ మూడు నెలలకే ముగించి చేతులెత్తేశారు. ఆసుపత్రుల్లో పశువైద్యులు ఉండరు. మిషన్‌ పుంగనూరుకు నీళ్లొదిలేశారు. ఒంగోలు జాతికి పూర్వ   వైభవం తెస్తామంటూ గొప్పలు చెప్పి... చేతులెత్తేశారు.


‘అనుబంధాల’ ఊపిరి తీసిన వైకాపా సర్కారు

జగన్‌ పాలనలో... వ్యవసాయ అనుబంధరంగాలైన ఉద్యానం, పశుసంవర్థకం, ఆక్వా, పట్టు పరిశ్రమల రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. రైతులకు ఏటా రూ.80 కోట్లతో ఉచిత సూక్ష్మపోషకాలు ఇవ్వలేకపోయారు. ఒక్క టార్పాలిన్‌ పట్టా పంచలేదు. పిచికారీ యంత్రాలూ అందించలేదు. వైకాపా కార్యకర్తలకు మాత్రం అద్దె యంత్ర కేంద్రాల పేరుతో దోచిపెట్టారు.

రైతులు తమ ఉత్పత్తుల్ని మార్కెట్‌ యార్డు గోదాముల్లో నిలువ చేసుకుని, వడ్డీలేని రుణం తీసుకునే వెసులుబాటు 2018-19 వరకు ఉండేది. జగన్‌ సీఎం అయ్యాక ఏటా రూ.500 కోట్లకు పైగా మార్కెట్‌ రుసుం పిండుకుంటున్నా... రైతులకు అందులో నుంచి పైసా కూడా ఇవ్వలేదు.

జీడికి గిట్టుబాటు ధరలే లేవు. 550 వరకు అనుబంధ పరిశ్రమలు మూతపడ్డా కళ్లప్పగించి చూశారు.

సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆయిల్‌ పామ్‌ను పట్టించుకోలేదు. గిట్టుబాటు ధర టన్నుకు రూ.23 వేల నుంచి రూ.13,800కు తగ్గినా... సరిదిద్దే దిశగా ఆలోచించలేదు.

పట్టు రైతుల ప్రోత్సాహకాలకూ కోత పెట్టారు. ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.100 పెరిగింది. రీలర్లు, ట్విస్టర్లు, రంగులద్దేవారు, చేనేతల సంక్షేమాన్ని వదిలేశారు.
మామిడికి బీమా ఎత్తేశారు. పరికరాలు, ప్యాక్‌హౌస్‌లు, కవర్లు తదితరాలపై రైతులకు ఇచ్చే రాయితీని ఎత్తేశారు.


ఆక్వా రైతులకు ముప్పుతిప్పలు

కొందరు వైకాపా ప్రభుత్వ పెద్దలు ఆక్వారంగాన్ని... ‘‘అది కాకి లెక్కలు వేసే రంగం’’ అంటూ తూలనాడారు. ఈ రంగమంటే వారికి ఎంత చులకనభావమో అర్థమవుతోంది. యూనిట్‌ విద్యుత్తును రూ.1.50కే చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి... 2022 నుంచి మడమ తిప్పేశారు. ఆక్వా జోన్‌ పరిధిలో అదీ పదెకరాల విస్తీర్ణంలోని చెరువులకే అమలు చేస్తామనే నిబంధన పెట్టి అర్హుల్ని 62 వేల నుంచి 42 వేలకు కుదించేశారు. వారికి కూడా ఇచ్చేది యూనిట్‌కు రూ.1.50 అంటున్నా ట్రూఅప్‌ రుసుములన్నీ కలిపితే బాదుడే బాదుడు. ధరల విషయంలో 2020 నుంచి ఆక్వాకు గడ్డుకాలమే. రొయ్య ధర కిలోకు మొత్తంగా రూ.80 నుంచి  రూ.110 వరకు తగ్గింది. ఉత్తరాదికి ఎగుమతులు నిలిచిపోవడంతో చేపల ధరలు కిలోకు రూ.20 వరకు తగ్గాయి. పైగా ఈక్వెడార్‌తో పోటీ    కారణంగా రొయ్య ధరలు భారీగా తగ్గిపోయాయి. మేత ధరలేమో 35% పైగా పెరిగాయి. అయిదెకరాల చెరువుకు మొత్తంగా రూ.7.50 లక్షలు నష్టపోతున్నారు.

ఐదేళ్లలో కోస్తా, రాయలసీమల్లో సాగునీటి వసతి కొత్తగా ఒక్క ఎకరా కూడా పెరగలేదు... సరికదా ఇంకా తగ్గింది. బోర్లు, బావులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఈ ఏడాది సాగర్‌ కాల్వలకు నీరివ్వలేదు. రైతులు మిరప, ఇతర పంటలను కాపాడుకోవడానికి ఒక్కో తడికి రూ.10 వేలకు పైగా ఖర్చు చేశారు.


వరి సాగు తగ్గించి... ధాన్యం సేకరణ కుదించి! 

అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో వరి సాగు ప్రశ్నార్థకమైందంటే, పంట విరామం ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే.. అందుకు వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే కారణం. తెలంగాణలో వరి సాగు అంతకంతకు పెరుగుతుంటే... ఏపీలో భారీగా తగ్గుతోంది. పెరిగిన పెట్టుబడులు, ప్రకృతి విపత్తులకు తోడు.. కాల్వలు బాగు చేయకపోవడంతో నీరు ముంచెత్తి రైతులు భారీగా నష్టపోయారు. మద్దతు ధరల కల్పన లేకపోగా.. క్వింటాకు రూ.400 చొప్పున దోచుకుంటున్నారు.

  •  2023-24 ఖరీఫ్‌, రబీలలో వరి సాధారణ విస్తీర్ణం 58.72 లక్షల ఎకరాలు కాగా.. 46.72 లక్షల ఎకరాల్లోనే సాగైంది. 12 లక్షల ఎకరాలు తగ్గింది. 2022-23 సంవత్సరంలోనూ ఆరు లక్షల ఎకరాలకు పైగా సాగు తగ్గింది.
  •  2019-20 సంవత్సరంలో 82.57 లక్షల టన్నులు, 2020-21లో 84.56 లక్షల టన్నుల ధాన్యం సేకరించిన ప్రభుత్వం... క్రమంగా సేకరణ లక్ష్యాన్ని కుదిస్తోంది. 2022-23 సంవత్సరంలో 49 లక్షల టన్నులే సేకరించారు. ఈ ఏడాది ఖరీఫ్‌ వరకు 29లక్షల టన్నులకే పరిమితం చేశారు.


ఉద్యాన రంగమూ కుదేలు

ఉద్యాన రైతుల్ని జగన్‌ నిలువునా ముంచేశారు. షేడ్‌నెట్లు, పాలీహౌస్‌లు, కూరగాయల విత్తనాలు, యంత్ర పరికరాలకు రాయితీల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. ఉద్యానహబ్‌గా తయారైన రాయలసీమను... ఎడారిగా మార్చే లక్ష్యంతో పనిచేశారు. సూక్ష్మసేద్యం పథకాన్ని మూడేళ్లపాటు నిలిపేసి, చివరి రెండేళ్లు అరకొరగా అమలు చేశారు. రాష్ట్రంలో కూరగాయల సాగు తగ్గిపోయింది. అరటి, బొప్పాయి, కొబ్బరి, జామ, మిరప తదితర పంటల్ని తెగుళ్లు, చీడపీడలు చుట్టుముట్టినా ప్రభుత్వం ప్రేక్షకపాత్రకే పరిమితమైంది.


చెరకు రైతును సర్వనాశనం చేసిన సర్కారు

2018 ఖరీఫ్‌లో రాష్ట్రంలో 2.52 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైన చెరకు పంట... 2023 ఖరీఫ్‌కు వచ్చే సరికి కేవలం 67 వేల ఎకరాలకు కుంచించుకుపోయింది. సహకార రంగంలోని చక్కెర కర్మాగారాల్ని పునరుద్ధరిస్తామని నాడు నమ్మబలికిన జగన్‌... వాటిని అమ్మకానికి పెట్టారు. ఏకంగా రూ.2 వేల కోట్ల ఆస్తులున్న కర్మాగారాల్ని కేవలం రూ.400 కోట్లు ఇస్తే పునరుద్ధరించే అవకాశమున్నా... ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర పన్నుతున్నారు. తన సొంత జిల్లాలోని చెన్నూరు ఫ్యాక్టరీని నెల రోజుల వ్యవధిలోనే తెరిపిస్తానని హామీ ఇచ్చిన సీఎం దారుణంగా విఫలమయ్యారు.   అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలోని నాలుగు చక్కెర పరిశ్రమల్ని మూసేయించారు. బకాయిలు అడిగిన రైతులపై విజయనగరంలో లాఠీఛార్జి చేయించారు.


చేయి పట్టుకుని నడిపించడమంటే ఇలాగేనా?

రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు పెట్టి.. రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్నామంటూ నమ్మబలికారు. వాటిలో సరిపడా సిబ్బంది లేరు. ఉన్నా.. వారికి ఇతర బాధ్యతలు అప్పగిస్తున్నారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను రైతులకు అందుబాటులో ఉంచాలనే విషయాన్ని విస్మరించారు. ఉమ్మడి కర్నూలు, గుంటూరు, అనంతపురం, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో వేల మంది రైతులు నకిలీ విత్తనాల బారిన పడినా.. పట్టించుకున్న పాపానపోలేదు. వైకాపా ఎమ్మెల్యే నకిలీ విత్తనం వచ్చిందని ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయనకు దగ్గరుండి పరిహారం ఇప్పించారు. సామాన్యరైతుల గోడు విన్పించుకునే నాథుడే లేరు. భూసార పరీక్షలను అటకెక్కించారు.


ఏటా మద్దతు ధర పెంచకపోవడమే.. జగన్‌ ప్రత్యేకత

జగన్‌ లెక్కలో మద్దతు ధరలను ఏడాదికోసారి కాకుండా అయిదేళ్లకోసారి పెంచితే సరిపోతుంది. అందుకే 2019-20లో చిరుధాన్యాలు, మిరప, పసుపు, బత్తాయి, ఉల్లి, అరటి తదితర పంటలకు నిర్ణయించిన ధరల్నే 2023-24 వరకు కొనసాగించారు. అరటి మద్దతు ధర కిలో రూ.8 నిర్ణయిస్తే.. కరోనా సమయంలో రూ.4 చొప్పున కొనుగోలు చేశారు. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరలపై పంటల కొనుగోలుకూ సతాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని