బ్యాండేజ్‌ తియ్యకపోతే సెప్టిక్‌ అవుతుంది

సీఎం జగన్‌ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్‌ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్‌ సునీత పేర్కొన్నారు.

Published : 26 Apr 2024 06:50 IST

సీఎం జగన్‌కు డాక్టర్‌ నర్రెడ్డి సునీత సలహా
వివేకా హత్య కేసులో మేం తప్పు చేసినా శిక్షించాలని స్పష్టం

వేంపల్లె, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్‌ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్‌ సునీత పేర్కొన్నారు. గాయానికి బ్యాండేజ్‌ వేసుకుంటే లోపల చీము పెరిగి సెప్టిక్‌ అయ్యే ప్రమాదం ఉందన్నారు. బ్యాండేజ్‌ తీసేస్తేనే గాయం త్వరగా మానుతుందన్నారు.  వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తాను గానీ, తన భర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాష్‌రెడ్డి గానీ తప్పు చేసి ఉంటే సీఎం హోదాలో ఉన్న మీరు ఎవరినైనా శిక్షించొచ్చన్నారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణం చేసిన జగన్‌.. అదే ఏడాది సెప్టెంబరు 2న వైఎస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమం ముగించుకుని పులివెందులలో జరిగిన వివేకా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తమ ఇంటికి వచ్చారని చెప్పారు. వివేకా హత్యలో నీ భర్త రాజశేఖరరెడ్డిపై అనుమానాలున్నాయని ఆ రోజు జగన్‌ తనతో అన్నారన్నారు. మా అమ్మ సౌభాగ్యమ్మ కల్పించుకుని ఈ కేసులో ఎవరున్నా విచారణ జరిపించి, నేరస్థులకు శిక్ష పడాల్సిందేనని బదులిచ్చారని గుర్తుచేశారు.

గురువారం పులివెందుల సభలో జగన్‌ మాట్లాడుతూ వివేకాను హత్య చేసిందెవరో దేవుడికి, కడప ప్రజలందరికీ తెలుసన్నారని.. సీఎంగా ఉండి రాష్ట్రంలో ఏం జరుగుతోందో మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ కేసులోని నిందితుడితో మూడోసారి ఎంపీ పదవికి పోటీ చేయిస్తున్నారని ప్రస్తావించారు. సీబీఐ నిందితులని తేల్చిన వారిని ప్రోత్సహించవద్దన్నారు. వివేకా అంటే మీకు చంపేంత ఈర్ష్య ఎందుకొచ్చిందో అర్థం కాలేదని సునీత జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వివేకా వైఎస్సార్‌ కోసం ఎమ్మెల్యే పదవిని, జగన్‌ కోసం ఎంపీ పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు. సీఎం గారూ.. కోర్టులు, పోలీసులు, సీబీఐ అంటే మీకు గౌరవం లేదా అని సునీత ప్రశ్నించారు. ‘2019లో వివేకా చనిపోయినప్పుడు సీబీఐ విచారణ కావాలని మీరు హైకోర్టుకు వెళ్లారు. తర్వాత ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. మీ వాళ్లు కడప కోర్టులో వివేకా హత్యపై మాట్లాడొద్దని పిటిషన్‌ వేశారు.. ఆర్డర్‌ వచ్చిన తరువాత మళ్లీ దీనిపై మీరే మాట్లాడారు. మీకు కోర్టులంటే గౌరవం లేదా’ అని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు