నగరాల అభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు కీలకం

నగరాల అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ పేర్కొన్నారు.

Published : 23 Mar 2023 05:50 IST

ఐడబ్ల్యూజీ వర్క్‌షాప్‌లో వక్తలు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: నగరాల అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ పేర్కొన్నారు. జీ20 సన్నాహక సదస్సుల్లో భాగంగా ఆర్థిక వ్యవహారాలు, గృహ, పట్టణ వ్యవహారాల శాఖలు, అôతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎఫ్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో బుధవారం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆరోఖ్యరాజ్‌ ప్రారంభించి మాట్లాడారు. ఐఎఫ్‌సీ భారత మేనేజర్‌ వెండీ జో వెర్నర్‌, ఐరోపా ప్రతినిధి బృందంలోని సీనియర్‌ ప్రోగ్రాం మేనేజర్‌ డెల్ఫైన్‌ బ్రిస్సోన్యూ మాట్లాడుతూ అభివృద్ధిలో నగరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

పలు అంశాల ప్రదర్శన: స్వచ్ఛత యాప్‌తో సాంకేతికత వినియోగం, మహిళల భాగస్వామ్యం, రేటింగ్‌ సిస్టమ్‌లను స్వచ్ఛభారత్‌ మిషన్‌ (అర్బన్‌) డైరెక్టర్‌ బినయ్‌కుమార్‌ జా ప్రదర్శించారు. అమృత్‌ మిషన్‌ డైరెక్టర్‌ లావణË్య కుమార్‌ మాట్లాడుతూ పది లక్షల జనాభా దాటిన నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల గురించి వివరించారు. నగరాల్లో రవాణా క్లబ్‌, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ, పైకప్పులపై సౌరశక్తి పలకల అమరిక తదితర పది కేస్‌ స్టడీలను స్మార్ట్‌ సిటీ మిషన్‌ డైరెక్టర్‌ లాల్‌ చాందమ వివరించారు.

వాణిజ్య నిధులకు పరిమితులు

రిజర్వు బ్యాంకు సహాయ సలహాదారు సోమనాథ్‌ శర్మ, సెబీ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ దివ్య హమీర్‌బాసియా, ఐఎఫ్‌సీ ప్రధాన పెట్టుబడుల అధికారి నీరజ్‌ గుప్తాలు వాణిజ్య నిధుల పరిమితులను వివరించారు. సోమనాథ్‌ మాట్లాడుతూ 2019-2035 మధ్యలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 20 నగరాల్లో 17 మన దేశం నుంచి ఉంటాయని పేర్కొన్నారు. ఐఎఫ్‌సీ నిపుణులు జార్జి బట్లర్‌ కూడా మాట్లాడారు.

70 మంది ప్రతినిధుల హాజరు

హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఈఈ శ్రీనివాసరెడ్డి చెత్త నుంచి విద్యుత్తు తయారీని వివరించారు. వర్క్‌షాప్‌లో ఏపీతో పాటు తెలంగాణ సహ పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్‌, పుదుచ్చేరి నుంచి 70 మందికి పైగా పుర కమిషనర్లు, మేయర్లు హాజరయ్యారు. రెండో రోజైన గురువారం జరగనున్న వర్క్‌షాప్‌లో నగరాల ఆర్థిక సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు, వాణిజ్య పెట్టుబడుల సమీకరణకు ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్‌, నిధుల సమీకరణకు ఉన్న మార్గాలను వివరించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని