Telangana Secretariat: సుందర ప్రాసాదం.. పాలనకు నయా సౌధం

28 ఎకరాల సువిశాల ప్రాంగణం.. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా రూపుదిద్దుకున్న ప్రాసాదం.. తెలంగాణ సహా విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే నిర్మాణ శైలుల్లో రూపుదిద్దుకున్న కట్టడం.. ఇదీ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవన నేపథ్యం.

Updated : 21 Apr 2023 08:05 IST

విశేషాల సమాహారం.. నూతన సచివాలయం
విభిన్న నిర్మాణ రీతుల్లో భవంతికి సొబగులు
ఐ.ఆర్‌.శ్రీనివాసరావు
ఈనాడు - హైదరాబాద్‌

28 ఎకరాల సువిశాల ప్రాంగణం.. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా రూపుదిద్దుకున్న ప్రాసాదం.. తెలంగాణ సహా విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే నిర్మాణ శైలుల్లో రూపుదిద్దుకున్న కట్టడం.. ఇదీ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవన నేపథ్యం. హుస్సేన్‌సాగర్‌ సమీపంలో పాత సచివాలయ భవనాలను తొలగించి కొత్త సముదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆరు అంతస్తులుగా నిర్మితమైన ఈ భవనంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రవేశద్వారాలు మొదలు.. ముఖ్యమంత్రి కొలువుదీరే ఆరో అంతస్తు వరకు అడుగడుగునా ఆధునిక సౌకర్యాలు, సౌందర్యాల కలబోతగా దీన్ని నిర్మించారు. 650 మంది సిబ్బందితో సచివాలయానికి భద్రత కల్పించనున్నారు. నీటి సరఫరా, వాననీటి సంరక్షణ.. ఇలా పలు అంశాల్లో నూతన ప్రాంగణం తన ప్రత్యేకతను చాటనుంది.


తెలంగాణ సంస్కృతిని చాటే చిత్రాలు

చివాలయంలోనికి ప్రవేశించగానే తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే కళాకృతులు, పెయింటింగ్స్‌ అమర్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చేర్యాల పెయింటింగ్స్‌ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కొన్ని నమూనాలను ఇప్పటికే పరిశీలిస్తున్నట్లు సమాచారం.


34 గుమ్మటాలు.. రెండు జాతీయ చిహ్నాలు

34 గుమ్మటాలు, జాతీయ చిహ్నమైన సింహాల బొమ్మలు కొత్త సచివాలయానికి మకుటాల్లా నిలిచాయి. కింది నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్మించిన ఆ గుమ్మటాలు (డోమ్స్‌) నిర్మాణ కౌశలానికి నిదర్శనం. 165 అడుగుల ఎత్తున ప్రధాన గుమ్మటాన్ని నిర్మించటం నిర్మాణ రంగంలో పెద్ద సవాలు అని నిపుణులు చెబుతున్నారు. ఇలా సచివాలయానికి ముందు, వెనుక చెరొక ప్రధాన గుమ్మటాన్ని నిర్మించారు. ఈ రెండింటిపైనా జాతీయ చిహ్నమైన సింహాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఒక్కోటి అయిదడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువుండే ఈ సింహాల బొమ్మలను దిల్లీలో సిద్ధం చేయించి తీసుకువచ్చి అమర్చారు. మరో 32 చిన్న గుమ్మటాలూ భవనంపై కనిపిస్తాయి.


తెలంగాణకు తలమానికం

తెలంగాణ కొత్త సచివాలయాన్ని రాష్ట్ర గౌరవం ఇనుమడించేలా నిర్మిస్తాం. తెలంగాణకు తలమానికమయ్యేలా, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా చక్కటి ఆకృతి, ఆధునిక సాంకేతికత మేళవింపుతో పటిష్ఠంగా నిర్మిస్తాం. నాణ్యత, నవ్యతకు పెద్దపీట వేస్తూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అన్ని విభాగాల పనులు సమాంతరంగా నిర్వహిస్తూ అత్యంత వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేయిస్తాం.

 27.6.2019న సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్‌


బాహుబలి మహాద్వారం

సచివాలయ భవనం ఎంత చూడముచ్చటగా కనిపిస్తోందో అంతకు దీటుగా బాహుబలి మహాద్వారం చూపరులను ఆకట్టుకునేలా రూపొందించారు. 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తున నాలుగు తలుపులతో దీన్ని తీర్చిదిద్దారు. ఆదిలాబాద్‌ అడవుల్లోని టేకు కలపను నాగ్‌పుర్‌ పంపి అక్కడ మహాద్వారాన్ని తయారు చేయించారు. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. మొత్తం సచివాలయ ప్రాంగణంలో 875కి పైగా తలుపులున్నాయి. అన్నింటినీ టేకుతోనే తయారు చేశారు.


ముఖ్యమంత్రి ‘జనహిత’ మందిరం

ఆరో అంతస్తులో లక్ష చ.అ. విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్‌ పరిచిన ఆ ప్రాంతం చూపరులను ముగ్ధులను చేస్తోంది. సీఎం కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు ‘జనహిత’ పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్‌ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు సీఎం విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్‌ హాలును ఏర్పాటు చేశారు.


విస్తారంగా పార్కింగ్‌

వాహన పార్కింగ్‌ సదుపాయం కూడా భారీగా సిద్ధమవుతోంది. ప్రాంగణంలో కేవలం సీఎం, మంత్రులు, అధికారులు, సిబ్బందికి మాత్రమే పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది. సుమారు 2.5 ఎకరాల్లో అధికారులు, సిబ్బందికి చెందిన 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, నాలుగు బస్సులు ఏక కాలంలో పార్కింగ్‌ చేసేందుకు అవకాశం ఉంది. కనీసం 300 కార్లు పట్టే 1.5 ఎకరాల ప్రాంతాన్ని సందర్శకులకు కేటాయించారు. సాధారణ రోజుల్లో రోజుకు 700-800 మంది, అసెంబ్లీ సమావేశాల సమయంలో 1000 మంది వరకు సచివాలయానికి వస్తారన్న మునుపటి గణాంకాల మేరకు అంచనా వేశారు.


భద్రత అధునాతనం

సచివాలయ భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్‌ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోనికి ప్రవేశించగలరు. నిత్యం సుమారు 650 మందికిపైగా భద్రతా సిబ్బంది పహారా కాయనున్నారు. రాత్రీపగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్ఠమైన సీసీటీవీల కెమెరా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శకుల ముఖ గుర్తింపు (ఫేస్‌ రికగ్నిషన్‌) ద్వారా వారి సమాచారం ఆధార్‌ డేటాతో అనుసంధానమవుతుంది. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా సందర్శకుని పూర్తి వివరాలు అప్పటికప్పుడే కంప్యూటర్‌ తెరపై కనిపిస్తాయి.


పచ్చదనానికి పెద్దపీట

సచివాలయంలో పచ్చదనానికి సుమారు ఎనిమిది ఎకరాలను కేటాయించారు. అత్యధిక భాగం లాన్స్‌ రూపంలోనే కనిపించనుంది. ముందుభాగంతో పాటు భవన మధ్య ప్రాంతాన్ని సైతం పచ్చదనంతో పరిచారు. ప్రాంగణానికి మరింత శోభను తీసుకువచ్చేందుకు నలుదిశలా పగోడ, దేవదారు వృక్షాలను పెంచుతున్నారు.


గ్రంథాలయం.. బ్యాంకు.. క్యాంటీన్‌

మునుపటి సచివాలయంలో కంటే నూతన ప్రాంగణంలో గ్రంథాలయాన్ని అధిక విస్తీర్ణంలో నెలకొల్పుతున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు వచ్చేలా 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్‌ నిర్మించారు. మరికొంత విస్తీర్ణంలో ఓపెన్‌ కిచెన్‌ను కూడా సిద్ధం చేశారు. బ్యాంకు, ఏటీఎంలకు సైతం కొంత స్థలాన్ని ప్రత్యేకించారు.


 ప్రత్యేక మార్గాలు

తూర్పు వైపు నిర్మించినదే ప్రధాన ప్రవేశ ద్వారం(గేటు). ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కోసం ఈ ద్వారాన్ని కేటాయించారు. ఈశాన్యంలో ఉన్న గేటు.. కింది స్థాయి అధికారులు, సిబ్బందికి, ఆగ్నేయం వైపు ఏర్పాటు చేసిన గేటు సందర్శకులకు కేటాయించారు. వాయవ్యంలో నిర్మించిన ద్వారం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగిస్తారు. ప్రధాన భవనం ముంగిట శాశ్వత హెలిప్యాడ్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.


మరింత అందంగా ప్రార్థన మందిరాలు

సచివాలయంలో మునుపటి మాదిరిగా హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థన మందిరాలను ప్రభుత్వం నిర్మించింది. గతం కంటే విశాలంగా, సుందరంగా వీటిని తీర్చిదిద్దారు. ఆయా మత పెద్దల ఆకాంక్షల మేరకు నిర్మాణాలు చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దేవాలయం, మసీదు, చర్చి కోసం సుమారు తొమ్మిది వేల చదరపు అడుగులను కేటాయించారు.


సవాళ్లను అధిగమించి..

సచివాలయ నిర్మాణంలో అన్నీ సవాళ్లే. పాత  భవనాలను కూల్చటం నుంచి స్థలాన్ని ఒక రూపులోకి తెచ్చేందుకు అధికారులు పెద్ద కసరత్తే చేశారు. ఆ ప్రాంగణంలోని  కొన్ని ప్రాంతాల్లో వదులు నేల, మరికొన్ని చోట్ల బండరాళ్లు, మరికొన్ని చోట్ల భూమి బొగ్గు డంపు మాదిరిగా ఉండటంతో వాటిని చక్కదిద్దుకుంటూ బలమైన పునాదులు వేయటానికి సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. పాత భవనాల కూల్చివేత, పునాదుల సమయంలో అక్కడున్న భూగర్భ విద్యుత్తు లైన్ల తొలగింపు సమయంలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా పనులు చేపట్టటం అతి పెద్ద సవాలుగా మారింది. వీటిని లైవ్‌ వైర్‌ డిటెక్షన్‌ విధానంలో సురక్షితంగా తొలగించగలిగారు.


రికార్డు సమయంలో పూర్తి

ఇండో-పర్షియన్‌-అరేబియన్‌ నిర్మాణాల మిశ్రమ శైలి సచివాలయంలో కనిపిస్తుంది. పాతకాలపు ప్యాలెస్‌లు, ఆలయ గోపురాల తరహాలో నిర్మించారు. ఇలాంటి నిర్మాణాలు కొలిక్కి రావాలంటే నాలుగేళ్లకు పైగా సమయం పడుతుందని నిపుణుల అంచనా. కానీ సచివాలయం పనులు ప్రారంభమైన నాటి నుంచి 26 నెలల్లో పూర్తి చేయటం రికార్డేనని అధికారులు చెబుతున్నారు. సచివాలయ ఆకృతుల రూపకల్పనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక గంటల సమయాన్ని వెచ్చించారు. ఆర్కిటెక్టులు, ఇంజినీర్లతో పలుదఫాలు చర్చించి తుదిరూపునిచ్చారు. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. స్వతహాగా సివిల్‌ ఇంజినీరైన ప్రశాంత్‌రెడ్డి.. సీఎం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రోజువారీ ప్రణాళికలు రచించుకుని.. అవి ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా శ్రద్ధ వహించారు. ప్రతి అంతస్తులో జరిగే పనుల బాధ్యతలను ఎక్కడికక్కడ బృందాలకు అప్పగించి పర్యవేక్షించారు. నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేశారు. వివిధ శాఖల అధికారుల కోసం ఆ ప్రాంగణంలోనే ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం కూడా పనులు చురుగ్గా సాగడానికి దోహదపడింది.


వినూత్న విధానంలో నీటి సరఫరా

భవనంలోని వివిధ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలంటే ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ ఉండాలి. దాని నుంచి బాత్‌రూమ్స్‌, వాష్‌బేసిన్ల వంటి అన్ని అవసరాలకు నీరు సరఫరా అవుతుంది. సచివాలయంలో మాత్రం ఓవర్‌ హెడ్‌ ట్యాంకును అత్యవసర సందర్భాలకు మాత్రమే పరిమితం చేశారు. సాధారణ సందర్భాల్లో దీనికి బదులు జల వాయు వ్యవస్థ (హైడ్రో న్యుమేటిక్‌ సిస్టం) ద్వారా అన్ని అంతస్తులకు నీటిని పంపిణీ చేయనున్నారు. భవనం సమీపంలో భారీ సంపును ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీరు సరఫరా అయ్యేలా వ్యవస్థను నెలకొల్పారు.


వాన చినుకులను ఒడిసిపట్టి..

ఈ సౌధం పరిసరాల్లో కురిసిన ప్రతి వాన చినుకునూ ఒడిసి పట్టేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి నీటి చుక్కా భూగర్భ సంపులో మిళితమయ్యేలా పైప్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటీవల వర్షాలు కురిసిన సమయంలో.. సుమారు అడుగున్నర ఎత్తున వర్షపు నీరు సంపులోకి చేరటాన్ని అధికారులు గుర్తించారు.


పార్లమెంటులో ఉన్నట్టే ఫౌంటెన్లు

ప్రాంగణానికి మరింత వన్నె తెచ్చేందుకు రెండు భారీ ఫౌంటెన్లను నిర్మించారు. పార్లమెంటులో ఉన్న మాదిరిగానే అదే ఎత్తు, అదే వైశాల్యంతో వాటిని ఏర్పాటు చేశారు. పార్లమెంటులో ఉపయోగించిన రెడ్‌ శాండ్‌ స్టోన్‌తోనే నిర్మించటం విశేషం. ఒక్కో ఫౌంటెన్‌ను 28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వైశాల్యంలో రూపొందించారు.


 విభిన్న శైలుల స్ఫూర్తి..

- డాక్టర్‌ ఆస్కార్‌, పొన్ని కాన్సెస్సావో,ఆర్కిటెక్టులు

తెలంగాణలో ఉన్న సాంస్కృతిక సంపద, శాంతియుత జీవనశైలి అనే రెండంచెల స్ఫూర్తి సచివాలయ భవంతి నిర్మాణ శైలిలో అడుగడుగునా నిండి ఉంటుంది. నిజామాబాద్‌లోని కాకతీయుల కాలం నాటి నీలకంఠేశ్వరస్వామి ఆలయం, వనపర్తి సంస్థానపు రాజప్రాసాదాల్లోని శైలుల నుంచి ప్రేరణ పొందాం. అక్కడి గోపురాల ఆధారంగానే ఈ భవనపు గుమ్మటాల నిర్మాణాల్ని చేపట్టాం. వాటిని హిందూ, దక్కనీ, కాకతీయ నిర్మాణ శైలులుగా కూడా చెప్పవచ్చు. గుజరాత్‌లోని సలంగ్‌పూర్‌ (సారంగాపూర్‌)లో ఉన్న హనుమాన్‌ ఆలయ రీతుల్ని సైతం గుమ్మటాలకు స్ఫూర్తి కేంద్రాలుగా తీసుకున్నాం. ఈ శైలులన్నిటి గొప్పదనాలూ, అద్భుత ప్రాభవాలూ, వాటి అందాలతో పాటు నిర్మాణరీతుల్లో తాత్వికత, మార్మికత నిబిడీకృతమై ఉన్నాయి. బయటి వైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ నుంచి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించాం. కాస్తంత వెలిసినట్లుగా బంగారు వర్ణం కనిపిస్తున్నప్పటికీ ప్రకాశిస్తున్నట్లు కనిపించే సువర్ణపు ఇసుక రంగు ఈ భవంతి వినూత్నతను ప్రదర్శిస్తోంది. భవన ఆకృతిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూపిన చొరవ, ఆయనకున్న స్పష్టత, ఆయన వెచ్చించిన సమయం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని