34 కేజీబీవీల్లో సున్నా ఫలితాలు

ప్రైవేటు రెసిడెన్షియల్‌ కళాశాలల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు అధికంగా వస్తున్నాయి. కస్తూర్బాగాంధీ బాలకల విద్యాలయాల(కేజీబీవీ) ఫలితాలు అధికంగా ఉంటున్నాయి.

Updated : 29 Apr 2023 10:22 IST

బయటపడిన మంత్రి బొత్స ప్రకటనల్లోని డొల్లతనం
పాఠ్యపుస్తకాలు, వసతి లేకుండానే ఇంటర్మీడియట్‌ కోర్సు ప్రారంభించిన ప్రభుత్వం
విజయనగరంలో మూడు కేజీబీవీల్లో ఒక్కొక్కరే ఉత్తీర్ణత


* ప్రైవేటు రెసిడెన్షియల్‌ కళాశాలల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు అధికంగా వస్తున్నాయి. కస్తూర్బాగాంధీ బాలకల విద్యాలయాల(కేజీబీవీ) ఫలితాలు అధికంగా ఉంటున్నాయి.

ఇంటర్‌ ఫలితాల విడుదల సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ


* మంత్రి చేసిన ప్రకటనకు క్షేత్రస్థాయిలో ఇంటర్‌ ఫలితాలకూ సంబంధమే లేదు. రాష్ట్రంలో 34 కేజీబీవీల్లో సున్నా ఫలితాలు వచ్చినా ప్రైవేటు కంటే ఎక్కువ వస్తున్నాయని బొత్స ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందనే ఫలితాలను యాజమాన్యాల వారీగా విడుదల చేయలేదు.


ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు, కేజీబీవీల డొల్లతనం బయటపడింది. మండలానికో మహిళా జూనియర్‌ కళాశాల ఉండాలంటూ సీఎం జగన్‌ ఆదేశించడం.. ముందూ వెనుక ఆలోచించకుండా అధికారులు ప్రారంభించేయడం.. ఇప్పుడు పేద పిల్లలను ఇబ్బందులకు గురి చేసింది. సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై 292 హైస్కూల్‌ ప్లస్‌తోపాటు 131 కేజీబీవీల్లోనూ ఇంటర్మీడియట్‌ ప్రారంభించారు. ఇక్కడ విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వలేదు. విద్యార్థులే సొంతంగా పుస్తకాలు కొనుక్కోవాల్సి వచ్చింది. హైస్కూల్‌ ప్లస్‌లో పాఠాలు చెప్పేందుకు లెక్చరర్లను నియమించకుండానే అక్కడే ఉన్న ఉపాధ్యాయులకు బోధన బాధ్యతలు అదనంగా అప్పగించారు. దీంతో సుమారు 50%పైగా హైస్కూల్‌ ప్లస్‌లో సున్నా ఫలితాలు వచ్చాయి. 131 కేజీబీవీలకుగాను 30 కేజీబీవీల్లో ఒక్కరూ పాస్‌ కాలేదు. మరో మూడింటిలో రెండో ఏడాదిలో సున్నా ఫలితాలు వచ్చాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఏడు కేజీబీవీల్లో ఒక్కరూ పాస్‌ కాలేదు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో మూడు కేజీబీవీల్లో ఒక్కొక్కరు చొప్పున ఉత్తీర్ణత సాధించారు. ఈ మూడింటిలో 64మంది పరీక్షలకు హాజరు కాగా.. ముగ్గురు పాసయ్యారు. ఉమ్మడి విజయనగరం కేజీబీవీల నుంచి 717మంది పరీక్షలు రాస్తే 48%మంది పాస్‌ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో 704మంది పరీక్షలు రాస్తే 54.26శాతం ఉత్తీర్ణులయ్యారు.


పాఠాలు చెప్పేవారు లేకుండా ఎలా?

హైస్కూల్‌ ప్లస్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌ విద్యార్థినులకు పాఠాలు చెప్పేవారు లేరని, పుస్తకాలు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. బాలికల కోసం ప్రత్యేక కళాశాల పెట్ట్జామని మాత్రమే చూశారు. పదో తరగతి వరకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులనే ఇంటర్మీడియట్‌కూ బోధించాలని ఆదేశించారు. జూన్‌లో తరగతలు ప్రారంభమైతే ఈ ఏడాది జనవరి వరకు పాఠ్య పుస్తకాలే ఇవ్వలేదు. కొన్నిచోట్ల పాత పుస్తకాలను సర్దుబాటు చేశారు. ఈ కళాశాలలను ప్రారంభించడంలోనే జాప్యం చేయడంతో మొత్తంగా  292 కళాశాలల్లో 3,444మంది ప్రవేశాలు పొందారు. వీరిలో దాదాపు సగం మంది ఫెయిల్‌ అయ్యారు.

* ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో బాలికల హవా కొనసాగగా.. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన బాలికల కళాశాలల్లో మాత్రం ఫలితాలు 50శాతం మించలేదు. కళాశాలను ఏర్పాటు చేసేప్పుడు భవనం ఉందా? బోధనకు అధ్యాపకులు ఉన్నారా? పాఠ్యపుస్తకాలు ఉన్నాయా? అనేదాన్ని పరిశీలించాలి. కానీ, హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్‌ ఏర్పాటుకు ఇవేమి పట్టించుకున్న దాఖలాలు లేవు.

* కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను 6-10 తరగతుల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ అదనపు గదులు నిర్మించకుండానే ఇంటర్మీడియట్‌ను ప్రారంభించేశారు. దీంతో ఒకేగదిలో బోధన, రాత్రిపూట నిద్ర చేయాల్సిన దుస్థితి అమ్మాయిలకు ఏర్పడింది. కొత్తగా మరుగుదొడ్లు సైతం నిర్మించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని