Palnadu: 19 మంది గ్రామ వాలంటీర్ల సేవల నిలిపివేత

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే విడదల రజిని పాల్గొన్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి గైర్హాజరైన 19 మంది గ్రామ వాలంటీర్ల సేవలను ఉన్నతాధికారులు నిలిపివేశారు.

Updated : 02 May 2023 07:04 IST

మంత్రి విడదల రజిని పర్యటనకు  గైర్హాజరవ్వడమే కారణం
రాజకీయ కారణాలతో తొలగించారని బాధితుల ఆక్రోశం

నాదెండ్ల, న్యూస్‌టుడే: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే విడదల రజిని పాల్గొన్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి గైర్హాజరైన 19 మంది గ్రామ వాలంటీర్ల సేవలను ఉన్నతాధికారులు నిలిపివేశారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చందవరంలో మంత్రి వ్యవహార శైలిపై స్థానిక వైకాపా నేతల్లో అసంతృప్తి ఉంది. దీంతో పలువురు స్థానిక నాయకులతో పాటు వాలంటీర్లు, గృహ సారథులు, కార్యకర్తలు గత నెల 28న నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఆ రోజు స్థానిక నేతలు వంటావార్పుతో విందు ఏర్పాటు చేయించి, మంత్రి పర్యటనలో గ్రామస్థులు ఎక్కువ మంది పాల్గొనకుండా వ్యూహం అమలు చేశారు.

ఈ నేపథ్యంలో సోమవారం గ్రామానికి చెందిన 19 మంది వాలంటీర్ల సేవలను నిలిపివేశారు. వైఎస్సార్‌ పింఛను కానుక పంపిణీ నగదు తీసుకునేందుకు వారు గ్రామ సచివాలయానికి వెళ్లగా, అధికారులు విషయాన్ని తెలిపారు. వాలంటీర్లకు సొమ్ము అప్పగించొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయని ఇన్‌ఛార్జి ఎంపీడీవో జాకీర్‌ హుస్సేన్‌ వారికి తెలిపారు. మంత్రి కార్యక్రమానికి గైర్హాజరైనందున ఇక మీ సేవలు అవసరం లేదంటూ పరోక్షంగా అధికారులు సూచించారు. దీంతో ఆగ్రహించిన వాలంటీర్లు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇన్నాళ్లూ తమను ఉపయోగించుకుని ఇప్పుడు ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు.

రాజకీయ కారణాలతో తమ సేవలను అడ్డుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. గ్రామ సచివాలయం వద్ద ఉన్న గాంధీ, వై.ఎస్‌.ఆర్‌. విగ్రహాల ఎదుట నిరసన తెలిపారు. గ్రామ సచివాలయానికి చెందిన సిబ్బంది, డిజిటల్‌ సహాయకులకు గ్రామంలో పింఛన్ల పంపిణీ బాధ్యతలు అప్పగించారు. సోమవారం సాయంత్రానికి 75 శాతం మందికి పింఛన్లు అందజేశామని, వాలంటీర్ల వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని పంచాయతీ కార్యదర్శి జి.లక్ష్మీకాంతారావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని