ఒప్పంద లెక్చరర్ల సర్వీసు పునరుద్ధరణ

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న 3,618 మంది ఒప్పంద లెక్చరర్ల సర్వీసులను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 26 May 2023 04:02 IST

అతిథి అధ్యాపకులకూ 10 నెలలు పొడిగింపు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న 3,618 మంది ఒప్పంద లెక్చరర్ల సర్వీసులను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్‌ ఒకటి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు పునరుద్ధరించింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న 783 మంది అతిథి లెక్చరర్ల సర్వీసును 10 నెలలు పొడిగించింది. మరో 291 మంది అతిథి లెక్చరర్లను నియమించుకునేందుకు అనుమతించింది. వీరికి గంటకు రూ.150 చొప్పున గరిష్ఠంగా నెలకు రూ.10 వేల వరకు మాత్రమే ఇస్తారు.

గతేడాది రెండు నెలలు ఎగనామం

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒప్పంద లెక్చరర్లకు రెండు నెలల జీతాన్ని ప్రభుత్వం ఎగవేసింది. 12 నెలలు పని చేయించుకొని, 10 నెలలకు మాత్రమే జీతం ఇచ్చింది. 2023 మార్చి 30తో ఒప్పంద సర్వీసు ముగిసినా ఇంటర్మీడియట్‌ విద్యా సంవత్సరం మాత్రం ఏప్రిల్‌ 21 వరకు కొనసాగింది. దీంతో పాటు ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఒప్పంద గడువు ముగిసినప్పటికీ ఒప్పంద లెక్చరర్లు ఏప్రిల్‌, మేల్లో పని చేశారు. పని చేసిన రెండు నెలల కాలానికి జీతాలు ఇవ్వాలని కోరగా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. దీని వల్ల ఒక్కో ఒప్పంద లెక్చరర్‌ సుమారు రూ.1.14 లక్షలు నష్టపోయారు. ఆ మేరకు జీతాలు ఇవ్వకుండా రూ.42 కోట్లు మిగుల్చుకుంది. ఇప్పుడు రాబోయే 2023-24 సంవత్సరానికి మాత్రం 11 నెలలకు సర్వీస్‌ ఇచ్చింది. దీన్ని ఒక రోజు అంతరాయంతో 12 నెలలకు పొడిగించాలని ఒప్పంద లెక్చరర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్‌, శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని