Polavaram Project: మెగా వైఫల్యమే

పోలవరం ప్రాజెక్టులో భాగంగా రూ.81 కోట్లు వెచ్చించి నిర్మించిన గైడ్‌బండ్‌ నిర్మించి ఏడాదైనా కాకుండానే కుంగిపోయింది. ప్రాజెక్టులో భాగంగా ఎప్పటికీ మనుగడలో ఉంటూ వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు, జలాశయంలో నీటి నిల్వకు వీలుగా నిర్మించిన స్పిల్‌ వే రక్షణ కోసం కట్టిందే గైడ్‌బండ్‌.

Updated : 09 Jun 2023 08:25 IST

గైడ్‌బండ్‌ కుంగితే.. సీఎం జగన్‌ చిన్నా చితకా సమస్య అనడం దారుణం
పోలవరంలో కీలక స్పిల్‌ వే రక్షణకు ఉద్దేశించిన కట్టడమిది
ప్రవాహ వేగం ఒకవైపే లేకుండా నియంత్రించే నిర్మాణం
గైడ్‌బండ్‌ డిజైన్‌ రూపొందించిందీ, నిర్మించిందీ మేఘా కంపెనీయే
రూ.81 కోట్ల విలువైన నిర్మాణ వైఫల్యంపై స్పందించని అధికారులు
క్షేత్రస్థాయి పరిశీలనకు బయటివారికి అనుమతి ఏది?
మళ్లీ అంత మొత్తం వెచ్చించి కట్టాల్సిందేనా?
ఈనాడు - అమరావతి

పోలవరం ప్రాజెక్టులో భాగంగా రూ.81 కోట్లు వెచ్చించి నిర్మించిన గైడ్‌బండ్‌ నిర్మించి ఏడాదైనా కాకుండానే కుంగిపోయింది. ప్రాజెక్టులో భాగంగా ఎప్పటికీ మనుగడలో ఉంటూ వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు, జలాశయంలో నీటి నిల్వకు వీలుగా నిర్మించిన స్పిల్‌ వే రక్షణ కోసం కట్టిందే గైడ్‌బండ్‌. గోదావరికి భారీ వరదొచ్చినప్పుడు ప్రవాహ వేగం వల్ల స్పిల్‌ వేలో ఒకవైపే ఒత్తిడి పెరగకుండా.. నిర్మించిందే రిటైనింగ్‌ వాల్‌ కం గైడ్‌బండ్‌. ఇలాంటి కీలక నిర్మాణం పూర్తిగా కుంగిపోయి ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడటం ఇంజినీరింగ్‌ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. దీన్ని ఎవరు పరిశీలించినా రెండు కారణాల్లోనే లోపం బయటపడుతుంది. ఒకటి, గైడ్‌బండ్‌ నిర్మాణానికి డిజైన్‌లోనే లోపం ఉండాలి. లేదా ఆ డిజైన్‌కు తగ్గట్టుగా నిర్మించకపోవడమైనా అయి ఉండాలి. ఈ డిజైన్‌ రూపొందించింది ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీయే. ఆ ఆకృతుల మేరకు ఆమోదం పొంది గైడ్‌బండ్‌ కట్టిందీ మేఘా కంపెనీయే! ఈ లెక్కన లోపమేదైనా మేఘా సంస్థదే.

గైడ్‌బండ్‌ అవసరం ఏంటి?

ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యానించినట్లు గైడ్‌బండ్‌ చిన్న పని కాదు. చిన్న కట్ట కూడా కాదు. ప్రాజెక్టు కీలక నిర్మాణాల్లో ఇదొకటి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే భిన్నమైనది. గోదావరి సహజ ప్రవాహ మార్గంలో స్పిల్‌ వే నిర్మించి, గేట్లు అమర్చి నీటిని నియంత్రించి జలాశయంగా మలిచిన ప్రాజెక్టు కాదిది. ఇక్కడి మట్టి, భూభౌతిక పరిస్థితుల కారణంగా స్పిల్‌ వే నిర్మాణ ప్రాంతాన్ని నది చెంతనున్న కొండ ప్రాంతానికి మార్చారు. ఆ మేరకు గోదావరి ప్రవాహ మార్గాన్ని మార్చేలా డిజైన్‌ నిర్ణయించారు. నదిని సహజ మార్గం నుంచి వేరే వైపు మళ్లించారు. ఇందుకు కొంతమేర అప్రోచ్‌ ఛానల్‌ తవ్వారు, ఇంకొంత తవ్వాల్సి ఉంది. నది సహజ మార్గానికి సమీపంలోని కొండ ప్రాంతంలో స్పిల్‌ వే నిర్మించారు. తర్వాత స్పిల్‌ ఛానల్‌ తవ్వి తిరిగి నదిని తన సహజ మార్గంలో కలిపేశారు.

* ఇప్పటికే స్పిల్‌ వేతో పాటు, గోదావరి సహజ మార్గంలో 44 మీటర్ల ఎత్తున ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించారు. దీంతో నది సహజ మార్గం నుంచి అప్రోచ్‌ ఛానల్‌, స్పిల్‌ వే వైపుగా వరద మళ్లుతోంది. ప్రవాహ తీరును పరిశీలించిన పరిశోధన సంస్థలు.. స్పిల్‌ వేలో ఎడమ ఫ్లాంకు వైపునకు నీటివేగం ఎక్కువగా ఉందని తేల్చాయి. ఇక్కడ సుడిగుండాలు ఏర్పడి ప్రతికూల ప్రభావం చూపవచ్చని గుర్తించారు. దీన్ని నిరోధించేందుకు పుణెలోని కేంద్ర జల, విద్యుత్తు పరిశోధన సంస్థ నిపుణులు ప్రాజెక్టు 3డి నమూనాను రూపొందించి అధ్యయనం చేశారు.

* స్పిల్‌ వే ఎడమ వైపున వరద సమయంలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయని, ఎడమ ఫ్లాంకు వైపున సెకనుకు 13.6 మీటర్ల వేగంతో ప్రవాహం ఉందని గుర్తించారు. స్పిల్‌ వే మధ్యలో వేగం సెకనుకు 9.2 మీటర్లుగా ఉందని, ఇది ప్రమాదకరమని తేల్చారు. ఇక్కడ ప్రతికూలత లేకుండా వరద సాఫీగా సాగిపోయేందుకు పలు సిఫార్సులు చేశారు. ‘గోదావరిని మళ్లించే అప్రోచ్‌ ఛానల్‌ మౌత్‌ వద్ద 450 మీటర్ల వెడల్పు తవ్విన మార్గాన్ని 550 నుంచి 660 మీటర్ల వరకు పెంచాలి. స్పిల్‌ వే ఎడమ వైపున దాన్ని ఆనుకుని ఎగువన, అప్రోచ్‌ ఛానల్‌ ఎడమ వైపున 500 మీటర్ల పొడవునా గైడ్‌బండ్‌ నిర్మించాలి’ అని సూచించారు.

*  గైడ్‌బండ్‌ నిర్మిస్తే స్పిల్‌ వే ఎడమ ఫ్లాంక్‌ వైపు భారీ సుడిగుండాలను నివారించవచ్చని, ప్రవాహ వేగం తగ్గుతుందని తమ పరిశోధనల్లో తేలినట్లు కేంద్ర జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం నివేదికలో పేర్కొంది. గైడ్‌బండ్‌ నిర్మించి అప్రోచ్‌ ఛానల్‌లో మార్పులు చేస్తే వరద వేగం ఎడమ ఫ్లాంకు వైపున సెకనుకు 4 మీటర్లు, మధ్యలో 5.5 మీటర్లకు తగ్గుతుందని తేల్చారు.

* అంటే.. పోలవరంలో స్పిల్‌ వే రక్షణకు గైడ్‌బండే కీలక నిర్మాణం. పైగా దీని నిర్మాణానికి వెచ్చించింది తక్కువేం కాదు. ఏకంగా రూ.81 కోట్లు.

చిన్నాచితకా అంటూ వ్యాఖ్యలా?

పోలవరం ప్రాజెక్టు పురోగతిని సమీక్షించడంలో, అధికారులను అప్రమత్తం చేయడంలో ముఖ్యమంత్రి జగన్‌ పాత్ర అంతంతే. ప్రాజెక్టుపై అరుదుగా సమీక్షలు జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణా ప్రశ్నార్థకమవుతోంది. గైడ్‌బండ్‌ కుంగిన ప్రాంతానికి బయటివారిని వెళ్లనివ్వడం లేదు. పోనీ, గైడ్‌బండ్‌ ఎందుకు దెబ్బతిందో అధికారులూ చెప్పడం లేదు. ‘డిజైన్‌లోనో, నిర్మాణంలోనో లోపం ఉండొచ్చు’ అనడం ద్వారా జరిగిన నష్టాన్ని అంగీకరిస్తున్నారు. ‘అంతా సరిగ్గానే చేశాం. ఒక్కోసారి ఇలా జరుగుతుంది. పోలవరం అథారిటీకి, కేంద్ర జలసంఘానికి తెలియజేశాం. రెండు మూడు రోజుల్లో కేంద్రం నుంచి నిపుణులు వచ్చి తేలుస్తారు’ అని దాటవేస్తున్నారు.

గైడ్‌బండ్‌ ఎలా నిర్మించారు?

గైడ్‌బండ్‌ అవసరమని కేంద్ర జల విద్యుత్తు పరిశోధన కేంద్రం సిఫార్సు చేశాక మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీయే ఆకృతులు సిద్ధం చేయించింది. సీడబ్ల్యూసీ ఆమోదం మేరకే నిర్మాణం చేపట్టింది.

* గైడ్‌బండ్‌ ఫౌండేషన్‌ స్ట్రాటా (దిగువన) స్టోన్‌ కాలమ్స్‌తో అభివృద్ధి చేయాలని, వరద నీరు ఉన్న వైపున డయాఫ్రం వాల్‌తో కట్‌ ఆఫ్‌ తరహా నిర్మించాలని నిర్ణయించారు.

* వరద ప్రవాహం వైపున నిర్మించిన ఆర్‌సీసీ డయాఫ్రం వాల్‌ 1.5 మీటర్ల మందంతో నిర్మించారు. మైనస్‌ 5 మీటర్ల నుంచి +25 మీటర్ల ఎత్తు వరకు ఆర్‌సీసీ కట్టడం ఉంటుంది. అంటే 500 మీటర్ల పొడవునా నది ప్రవాహం ఉండే వైపున భూగర్భంలో నుంచి ఎగువన 25 మీటర్ల ఎత్తువరకు (మొత్తం 30మీ) నిర్మించారు.

* ఆపైన రాళ్లతో గైడ్‌బండ్‌ నిర్మించారు. దాదాపు +23.68 మీటర్ల స్థాయి నుంచి +51.32 మీటర్ల వరకు రాళ్లతో కట్టారు. ఇది దిగువన 117.28 మీటర్లు, ఎగువకు వచ్చేసరికి 6 మీటర్ల వెడల్పు ఉంటుంది. డిజైన్లకు ముందు భూభౌతిక పరిస్థితులపై చేసిన, నిర్మాణ సమయంలో చేసిన పరీక్షలన్నింటిలోనూ ఫలితాలు అంచనాల మేరకే వచ్చాయనీ చెబుతున్నారు. అయినా ఎందుకు కుంగిందో అధికారులు నోరు మెదపడం లేదు.

గైడ్‌బండ్‌ కుంగిన తీరుపై పోలవరంపై అనుభవమున్న ఇంజినీర్లతో, నిపుణులతో ‘ఈనాడు’ చర్చించింది. వారి అభిప్రాయాలివీ..


ఇలాంటివి జరుగుతుంటాయట!

కుంగిపోయిన గైడ్‌బండ్‌ స్థానంలో మళ్లీ మొదటి నుంచి నిర్మించాల్సి వస్తుందేమోనని ఇంజినీర్లు చెబుతుంటే.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌ దీన్నొక చిన్న అంశంగా తేల్చి పారేయడం విస్మయం కలిగించింది. పోలవరం ప్రాజెక్టును బుధవారం సందర్శించిన ముఖ్యమంత్రి.. గైడ్‌బండ్‌ ధ్వంసంపై స్పందిస్తూ.. ‘గైడ్‌వాల్‌లో చిన్న సమస్యను విపత్తుగా చూపిస్తున్నారు. కేంద్ర జలసంఘం డిజైన్లు సీడబ్ల్యూసీనే ఆమోదించిందని, ఆ మేరకే పనులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్నచిన్న సమస్యలు వస్తాయి. వాటిని గమనించుకుంటూ, మరమ్మతులు చేసుకుంటూ అధికారులు ముందుకు సాగుతారు. చిన్న సమస్యను ఒక విపత్తులా చూపించే దౌర్భగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. కీలక స్పిల్‌ వే రక్షణకు ఉద్దేశించిన కట్టడం కుంగిపోతే.. జగన్‌ ఇదొక చిన్న సమస్యగా పరిగణించడం గమనార్హం. పైగా తదుపరి చర్యలేంటో చెప్పడం లేదు.


రూ.కోట్లు నష్టమేనా?

ఈ గైడ్‌బండ్‌, రిటైనింగ్‌ వాల్‌ తరహా నిర్మాణానికి చేసిన ఖర్చు రూ.81 కోట్లు. రెండూ కుంగినందున గైడ్‌బండ్‌ను సరిదిద్దితే సరిపోతుందా అన్నది ఇంజినీరింగ్‌ అధికారులు తేల్చడం లేదు. రిటైనింగ్‌ వాల్‌ ఎంత మేర దెబ్బతింది, రాతిబండ పరిస్థితేంటన్నది అధ్యయనం చేయాలని చెబుతున్నారు. మరమ్మతులతో సరిదిద్దవచ్చన్న నమ్మకమైతే అధికారుల్లో లేదు. మళ్లీ మొత్తం బండ్‌ కట్టాలంటే వ్యయప్రయాసలు పెరుగుతాయని చెబుతున్నారు.


నిర్మాణం, నాణ్యతలో లోపాలుండొచ్చు
- విశ్రాంత సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌

గైడ్‌బండ్‌ కుంగిపోవడానికి డిజైన్‌ పరంగా, నిర్మాణ నాణ్యత పరంగానూ తలెత్తిన లోపాలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నా. నిర్మించిన చోట మట్టి సాంద్రతను పెంచేందుకు చేసిన పనుల్లో లోపం ఉండొచ్చు. స్టోన్‌ కాలమ్స్‌తో చేసిన పనుల్లోనూ లోపాలు ఉండొచ్చు. డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి తీసుకున్న లోతు సరిపోయి ఉండకపోవచ్చు. భూమిలో -5 మీటర్ల లోతు నుంచి నిర్మించారు. అది చాలకపోవచ్చు. రాక్‌ ఫిల్‌ డ్యాంలో ఉపయోగించిన రాళ్ల నాణ్యతపై అనుమానాలున్నాయి. రాళ్లు ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చాలి. మట్టి పరిశోధన ఫలితానికి అనుగుణంగానే నిర్మాణం సాగిందా అన్నది చూడాలి.


డిజైన్‌పై అనుమానాలున్నాయ్‌
- కీలక ఇంజినీరింగ్‌ అధికారి

ప్రధానంగా డిజైన్‌ విషయంలోనే అనుమానాలున్నాయి. ఇక్కడివి నల్లరేగడి నేలలు. ఈ తరహా నిర్మాణం అనువైంది కాదు. డీపీఎం (డిజైన్‌ విభాగం) అధికారులు తొలుత ఈ విషయాన్ని గుర్తించామని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ ఆమోదం పొందడంతో ఆ విషయం విస్మరించారని అంటున్నారు. డిజైన్‌ సమర్పించిన తర్వాత సీడబ్ల్యూసీ వద్ద చాలా త్వరగా అనుమతులు వచ్చాయన్న చర్చ జరుగుతోంది.


నిర్మాణం తీరు మార్చాల్సింది
- విశ్రాంత చీఫ్‌ ఇంజినీరు

అంతా సవ్యంగానే చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ, రాక్‌ ఫిల్‌ డ్యాం నిర్మాణ శైలి మార్చి ఉండాల్సింది. సాధారణంగా ప్రీ స్టోన్‌ స్లోప్‌ 2:1 నిష్పత్తిలో సాగింది. అలా కాకుండా 3:1 తరహాలో చేపట్టి ఉంటే వాలుపై కొంత భారం తగ్గి ఉండేది. (గేబియన్ల తరహా నిర్మాణం సరిపోయి ఉండేది కదా అని ప్రశ్నించగా) స్పిల్‌ ఛానల్‌కు కుడి వైపున ఇలా గేబియన్‌ తరహా కట్టల నిర్మాణానికే డ్యాం డిజైన్‌ కమిటీ ఆమోదించింది. అలా నిర్మించే అవకాశమూ ఉంది. ఇక్కడ అనేక పరీక్షలు, పరిశీలన తర్వాతే డిజైన్‌ ఆమోదం పొందిందని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని