Polavaram - CM Jagan: గోదాట్లో కలిసిన జగన్‌ హామీ

పోలవరం ప్రాజెక్టులో తొలి దశలో నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తాం. సెప్టెంబరు నెలాఖరు నాటికి వీరందరినీ కాలనీలకు తరలిస్తాం. ప్రధాని అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను. ఆయనకు ఇక్కడి విషయం అంతా చెబుతాను.

Updated : 24 Jul 2023 08:13 IST

మళ్లీ ముంచేస్తారా అంటూ పోలవరం నిర్వాసితుల గగ్గోలు
తొలి దశ పునరావాసానికీ దిక్కు లేదు
ఆందోళనలో 24 వేల కుటుంబాలు, అనేక ఊళ్లు  
ప్యాకేజీ లేదు.. తరలింపూ లేదు
ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేస్తే రోడ్డున పడేస్తారా?
పోలవరం నిర్వాసిత గ్రామాల నుంచి ఈనాడు ప్రతినిధి, న్యూస్‌టుడే బృందం


పోలవరం ప్రాజెక్టులో తొలి దశలో నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తాం. సెప్టెంబరు నెలాఖరు నాటికి వీరందరినీ కాలనీలకు తరలిస్తాం. ప్రధాని అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను. ఆయనకు ఇక్కడి విషయం అంతా చెబుతాను. వరద వచ్చినప్పుడు నేను పోయి చూసొచ్చాను. ఇంతింత స్థాయిలో నీళ్లు వచ్చాయి. బాధితులంతా మిమ్మల్నే తిట్టుకుంటున్నారని ప్రధానికి, కేంద్రానికి అర్థమయ్యేలా చెబుతాను. ఏ రోజైనా వారికి సాయం చేయక తప్పదు కదా. అదేదో ఈ రోజే ఇచ్చేస్తే వాళ్లంతా సంతోషిస్తారు.. మిమ్మల్ని తలచుకుంటారు అని చెబుతాను. నిర్వాసితుల ఖాతాల్లో మీరే బటన్‌ నొక్కి డబ్బులు జమ చేయాలని చెబుతాను.

2022 జులై 28న విలీన మండలాల్లో వరద బాధితులను సందర్శించినప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాటలు.


మాటలతో కోటలు కట్టెయ్యడంలో ముఖ్యమంత్రి జగన్‌ను మించినవారు లేరు. మాట చెబితే తప్పకూడదంటారు. అసలు తాను చెప్పిన మాట జీవితంలో ఎప్పుడూ తప్పలేదన్నంతగా గొప్పలు పోతారు. మాట తప్పను, మడమ తిప్పనంటూ ప్రచారం చేయించుకుంటారు. నాయకుడికి విశ్వసనీయతే ముఖ్యమంటారు. ఒక ముఖ్యమంత్రి చెప్పిన మాట తప్పితే రాజీనామా చేసి తీరాల్సిందే అంటారు. కానీ ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క మాటనూ ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలోనే కాదు.. ఆఖరికి ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాటలకూ దిక్కు లేకుండా పోయింది. ఏడాది కిందట ఇదే రోజుల్లో సీఎం జగన్‌ పోలవరం నిర్వాసితులకు గట్టి భరోసా ఇచ్చారు. అది ఇప్పట్లో నెరవేరుతుందనే ఆశ లేకుండా పోయింది. గోదావరిలో క్రమేణా వరద పెరుగుతుంటే.. పోలవరం ముంపు గ్రామాల ప్రజల్లో కలవరం పెరుగుతోంది. ఇళ్లలో ఇంతెత్తు వరద వచ్చిందని ప్రధానికి చెబుతానన్నారు, ప్యాకేజీ ఇప్పించేస్తానన్నారు, 2022 సెప్టెంబరులోగా పునరావాస కాలనీల్లోకి తరలించేస్తామన్నారు. మళ్లీ అంతెత్తు వరద వచ్చేలా గోదావరిలో క్రమేణా ప్రవాహం పెరుగుతున్నా మీ మాటలు నిలబెట్టుకోలేకపోయారేం జగన్‌? అని నిర్వాసితులు నిలదీస్తున్నారు.

నమ్మి ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రి తన హామీలను గోదాట్లో కలిపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు  తొలిదశ పునరావాసం నిరుడు సెప్టెంబరు నాటికే పూర్తి చేసేస్తామంటూ ప్రకటించి, ముంపు బాధితులను నమ్మించే ప్రయత్నం చేశారు. ఏడాది తర్వాత పరిస్థితి చూస్తే ఏముంది? ముఖ్యమంత్రి గారూ మీ మాట ఎందుకు నెరవేర్చలేదని నిర్వాసితులంతా ప్రశ్నిస్తున్నారు. వేల కుటుంబాలు ఇన్ని కష్టాలు పడుతుంటే మీరు చూస్తూ వదిలేస్తారా అని నిలదీస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే తొలిదశలో ముంపు ప్రభావిత 24 వేల కుటుంబాలకు ఇంకా పునరావాసం కల్పించలేదు. ముసురు పట్టిందంటే చాలు ఆ కుటుంబాలన్నీ బిక్కుబిక్కుమంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన ఈ కష్టజీవులకు ఏం సమాధానం చెబుతారు జగన్‌? ఉన్న ఊరును, తరతరాలుగా అనుబంధమున్న భూమిని వదిలేసుకుని, బతుకుదెరువు పోగొట్టుకుని ప్రాజెక్టు కోసం ఇన్ని వేల మంది ముందుకు వస్తే వారిని గోదాట్లో ముంచెయ్యడమేనా మానవత్వం? ఈ ఏడాదీ అవే కష్టాలు, అవే కన్నీళ్లా? ఏటా తరలింపు ప్రణాళికలు రచించడం.. మిన్నకుండిపోవడం తప్ప కార్యాచరణ ఉండదా? ఎన్నాళ్లిలా?

సరిగ్గా ఏడాది కిందట ఇవే రోజులు. వరద ఊరూవాడా ఏకం చేసేసింది. అనూహ్యంగా వీధుల్లోకి పోటెత్తి ఇళ్లను ముంచెత్తింది. ఎప్పుడూ రాని గోదారి ఇంట్లో నిలువెత్తు స్థాయిలో నిలబడితే ఏం చేయాలో పాలుపోక ముంపు గ్రామాల ప్రజలు కకావికలమయ్యారు. చుట్టూ జలదిగ్బంధం. కాలకృత్యాలు తీర్చుకోవడానికీ వీల్లేక.. అడుగు కింద పెట్టలేక, బయటికి పోలేక, వండుకోలేక, తినలేక, ప్రభుత్వం నుంచి కనీసం ఆహారమూ, నీళ్లూ సరిగా అందక వందల గ్రామాల పోలవరం నిర్వాసితులు దుర్భరమైన జీవితం గడిపారు. ఎక్కడో ఎత్తయిన ప్రాంతాలు వెతుక్కుని బతుకుజీవుడా అంటూ రోజులు వెళ్లదీశారు. గోదావరికి అడ్డంగా పోలవరంలో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించిన తర్వాత వచ్చిన భారీ వరద వీరి వెన్నులో వణుకు పుట్టించింది. స్పిల్‌వే మీదుగా వచ్చిన వరదను వచ్చినట్లు వదిలేస్తున్నా- గతంలో ఎన్నడూ లేని రీతిలో గోదావరి ప్రవాహం వెనక్కు మళ్లి.. ఊళ్లను ముంచెత్తింది. గోదావరి వరద చరిత్ర లెక్కలన్నీ తిరగరాసిన ఈ వరద రోజుల్లో జగన్‌ సర్కార్‌ నిలువెత్తు నిర్లక్ష్యం కారణంగా పడిన కష్టాలను నిర్వాసితులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. వరదకు అందరూ తలో దిక్కయ్యారు. సామాన్లు లారీల్లో వాహనాల్లో పెట్టుకుని బస్టాండ్లలో, తెలిసిన వాళ్ల ఇళ్లలో రోజులు గడిపారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ నాడు గట్టి హామీ ఇచ్చారు. తొలిదశలో అంటే పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల స్థాయిలో వరద నిలబెడితే ముంపులో చిక్కుకునే గ్రామాల వారందరినీ 2022 సెప్టెంబరులోగా పునరావాస ప్యాకేజీ ఇచ్చి, ఇళ్లు నిర్మించి తరలించేస్తామని హామీ ఇచ్చేశారు.. ఏడాది గడిచిన తర్వాత చూస్తే ఆ హామీ గోదాట్లో కలిసిపోయింది!

తొలిదశలో ఇంకా 8,288 కుటుంబాల తరలింపే లేదు!

పోలవరం ప్రాజెక్టులో తొలి దశ పునరావాసం 2022 సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. గత నెలలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించేనాటికీ నిర్వాసితుల తరలింపు ప్రక్రియ కొలిక్కి రాలేదు. జలవనరులశాఖ ప్రణాళిక ప్రకారం తొలిదశలోనే ఇంకా 8,288 కుటుంబాలకు ప్యాకేజీ ఇచ్చి, పునరావాస కాలనీలకు తరలించాల్సి ఉంది. గోదావరి వరద వల్ల ఈ కుటుంబాలన్నీ ముంపు బారిన పడతాయని తెలిసీ, ఏడాది కాలంగా జగన్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదు. 2022 ఆగస్టు నుంచి ఇంతవరకు 3,731 కుటుంబాలను మాత్రమే తరలించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 3,228 మంది ఇళ్లు తామే నిర్మించుకుంటామని ప్రభుత్వానికి చెప్పారు. వీరికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం సాయం అందించాలి. 5,449 నిర్వాసిత కుటుంబాలకు రూ.861.80 కోట్లు వెచ్చించి ప్యాకేజీ, నిర్మాణ పనులు పూర్తి చేస్తే తక్షణమే తరలించవచ్చని ప్రణాళికలు రచించినా తరలింపు ప్రక్రియ సరిగా సాగడం లేదు. వీరు కాకుండా మరో 2,839 కుటుంబాలను ఆగస్టు నెలాఖరుకు తరలిస్తామంటూ జలవనరులశాఖ మరో ప్రణాళిక రూపొందించినా క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏమీ లేదు. వరద రోజులు వస్తున్నాయని, నిర్వాసిత గ్రామాల ప్రజలు అనేక మంది జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయిలో తమకు నిర్దేశించిన కాలనీల నిర్మాణం ఎంత వరకు వచ్చిందో అని చూసి వస్తున్నారు. అక్కడ ఏడాది కాలంగా ఒక్క ఇటుకనూ కొత్తగా వేసింది లేదు. ఎక్కడా పునరావాస కాలనీల నిర్మాణం సరిగా జరుగుతున్నదీ లేదు. దీంతో ఈ ఏడాదీ వరద కష్టాలు తప్పవన్న ఆందోళన నిర్వాసిత కుటుంబాల్లో కనిపిస్తోంది.

మరో 16,642 కుటుంబాల పరిస్థితి అంతే సంగతులా?

పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలబెడితే ముంపులో చిక్కుకునే గ్రామాలనే తొలిదశలో చేర్చారు. అసలు నీళ్లు నిలబెట్టకముందే 170కు పైగా ఆవాసాలు అల్లకల్లోలమయ్యాయి. జలాశయంలో ఇంకా నీళ్లు నిలబెట్టకముందే గ్రామాల్లో ముంపు ముంచెత్తింది. తొలిదశలో లేవని ప్రభుత్వం చాలాకాలంగా చెబుతున్న గ్రామాలనూ వరద ముంచెత్తుతోంది. కొన్ని ఊళ్ల చుట్టూ నీరు చేరి జలదిగ్బంధమవుతున్నాయి. మరికొన్ని ఊళ్లలోకి నీళ్లొస్తున్నాయి. ఎన్నాళ్లగానో నిర్వాసితులు గోల పెట్టడంతో మళ్లీ సర్వే చేశారు. అలా తొలిదశ వరద ప్రభావిత ఆవాసాలు మరో 48 ఉన్నాయని అధికారులు లెక్క తేల్చారు. ఆ గ్రామాల్లో 16,642 కుటుంబాలు ఉన్నాయని లెక్కించారు. వారిని కూడా తొలిదశ కిందే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వారి ప్యాకేజీ, తరలింపు, పునరావాసం కోసం రూ.5,127 కోట్లు అవసరమవుతాయని లెక్కించారు. ఈ కుటుంబాల తరలింపు ప్రక్రియ ప్రాథమికంగా ప్రారంభం కాలేదు. కిందటేడాది వరదల అనుభవంతో ఈ కుటుంబాల గుండె జారిపోతోంది.


ఆ భయంకరమైన క్షణాల్ని ఎలా మరచిపోతాం?

పోలవరం ప్రాజెక్టు ముంపు బారినపడే కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వరరామచంద్రపురం తదితర మండలాల్లోని అనేక గ్రామాల్లో ‘ఈనాడు- ఈటీవీ’ బృందం ఇటీవల పర్యటించింది. ఎక్కడ ఎవరిని కదిపినా నాటి వరద రోజులనాటి భయానక క్షణాలను తలచుకుంటున్నారు. ఏ ఊళ్లో ఎంత ఎత్తున వరద నీరు చేరిందో చెబుతున్నారు. నాటి దృశ్యాలు, వీడియోలు సెల్‌ఫోన్లలో చూపిస్తున్నారు. ఇప్పటికీ తమకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదని చెబుతున్నారు, కాలనీల్లోకి తమను తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వరద వస్తోందంటేనే భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ప్యాకేజీ ఇచ్చి పంపెయ్యాలి
- చందా కనకారావు, రేపాకగొమ్ము

గోదావరి వరదలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ ఉండలేం, వెళ్లలేం అన్నట్లు తయారైంది మా పరిస్థితి. మేమేమీ రూ.10 లక్షల ప్యాకేజీ కావాలని అడగలేదు. జగనే ఇస్తామన్నారు. ఆ ప్యాకేజీ మాట దేవుడెరుగు ముందు గిరిజనులకు, గిరిజనేతరులకు రూ.6 లక్షలకు పైగా ఇవ్వాల్సిన ప్యాకేజీ ఇచ్చి.. కాలనీలో ఇల్లు ఎక్కడో చూపిస్తే అక్కడికి వెళ్లిపోతాం. ఎప్పటికైనా ఈ ఊరు మాది కాదు. ముంపులో పోయేదే. మేం వెళ్లిపోవాల్సిందే. కొందరికి ప్యాకేజీ ఇచ్చి మరికొందరికి ఇవ్వక ఇబ్బంది పెడుతున్నారు. పునరావాస కాలనీలు నిర్మించడం లేదు. ఆ కాలనీల్లో వసతులూ కల్పించడం లేదు.


వస్త్ర దుకాణం మునిగిపోయి రూ.20 లక్షలు నష్టపోయా
- ఇమ్మంది సత్యనారాయణ, కూనవరం

కిందటేడాది ఇవే రోజుల్లో వరద ముంచెత్తింది. అంత వరద వస్తుందని ఊహించలేదు. మా వస్త్ర దుకాణం పై అంతస్తు వరకు మునిగిపోయింది. పీకల్లోతు వరద వచ్చాక భయం వేసి.. బట్టలన్నీ అలాగే వదిలేసి వెళ్లిపోయాం. రూ.20 లక్షల సరకు నష్టపోయాం. మళ్లీ కొత్త సరకు తెచ్చుకుని అమ్ముకోవాలంటే భయం వేసి భద్రాచలం మారిపోయాం. రోజూ ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాం. అసలు ప్యాకేజీ, పునరావాసం మాట ఏమిటో అధికారులు చెప్పడమే లేదు. ఇప్పుడు మళ్లీ వరద వస్తోందంటే భయం వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని