ఆగస్టు 1న కొత్త పింఛన్లు లేనట్లే!

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి మరోసారి నిరాశ ఎదురుకానుంది.

Updated : 29 Jul 2023 05:58 IST

లక్షన్నర మంది దరఖాస్తుదారుల నిరీక్షణ

ఈనాడు, అమరావతి: కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి మరోసారి నిరాశ ఎదురుకానుంది. ఆరు నెలలకోసారి(జులై, జనవరి) కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామన్న జగన్‌ ప్రభుత్వ ఆర్భాటపు ప్రకటన మళ్లీ మడతపడనుంది. ఆగస్టు 1వ తేదీన ప్రారంభమయ్యే పంపిణీలోనూ వారికి సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి జులై 1వ తేదీనే కొత్త పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ అందించలేదు. ఆగస్టు 1వ తేదీనైనా ఇస్తారని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. గతేడాది నవంబర్‌ నుంచి జూన్‌ మధ్య దాదాపుగా లక్షన్నర మందికిపైగానే దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించిన తనిఖీ ప్రక్రియనే ఇంకా పూర్తికాలేదు. కొంతమంది పింఛను కోసం దరఖాస్తు చేసుకుని 7 నెలలు దాటిపోవడంతో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి సంక్షేమ కార్యదర్శుల్ని ఆరా తీస్తున్నారు. కొత్త పింఛన్ల పంపిణీపై తమకు కూడా సమాచారం లేదని అక్కడి అధికారులు వారిని తిప్పి పంపిస్తున్నారు. దీంతో వారు ఉసూరుమంటున్నారు.

నెల నుంచి ఆరు నెలలకు...

కొత్త పింఛన్ల పంపిణీపై జగన్‌ ప్రభుత్వం మొదటి నుంచీ చెప్పిన మాటపై నిలబడలేదు. అధికారం చేపట్టిన మొదట్లో నెల నెలా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. కొన్ని నెలలపాటు అమలు చేసిన తర్వాత చేతులేత్తేసింది. ఆ తర్వాత ఆరు నెలలకొకసారి ఇస్తామంటూ ప్రకటించింది. గతేడాది కూడా జులైలో ఇవ్వాల్సిన కొత్త పింఛన్లను ఆగస్టు నెలలో ఇచ్చింది. ఇప్పుడా పరిస్థితీ కనిపించడం లేదు. కొత్త పింఛన్లకు సంబంధించిన గడువు దాటిపోయినా ఎప్పుడిస్తామనే దానిపై ప్రభుత్వం నుంచి కనీస ప్రకటన కూడా లేదు.

నిధుల కొరతా?

రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ లోటు గ్రాంటు కింద కేంద్రం ఇటీవలే రూ.10 వేల కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. ఇది కాక ఎప్పటికప్పుడు అప్పులూ తెస్తోంది. జగన్‌ వరుస పెట్టి పథకాలకు బటన్‌ నొక్కుతున్నా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో వైఎస్సార్‌ ఆసరా మూడో విడత నిధులు మొత్తం జమయ్యేటప్పటికీ 50 రోజులకుపైగా సమయం పట్టింది. గత నెల 28వ తేదీన అమ్మఒడి నిధులు విడుదల చేసినా ఇప్పటికీ చాలా మంది ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యంగా తీసుకునే కొత్త పింఛన్ల పంపిణీలోనూ జాప్యం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు