ఎస్సీ,ఎస్టీ రైతులపై ఇంత కక్షా!

నా ఎస్సీ... నా ఎస్టీ... అంటూ గొంతు చించుకునే సీఎం జగన్‌.. వారి గుండెల్లో గునపాలు దించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఎంతో ఉపయోగపడిన సూక్ష్మ సేద్య పథకాన్ని నీరుగార్చేశారు.

Published : 20 Aug 2023 05:06 IST

సూక్ష్మ సేద్య పథకం  అమల్లో వివక్ష
మొదటి మూడేళ్లు నిలిపేసిన జగన్‌
ఒత్తిడికి తలొగ్గి గతేడాది నుంచి మొక్కుబడిగా అమలు

నా ఎస్సీ... నా ఎస్టీ... అంటూ గొంతు చించుకునే సీఎం జగన్‌.. వారి గుండెల్లో గునపాలు దించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఎంతో ఉపయోగపడిన సూక్ష్మ సేద్య పథకాన్ని నీరుగార్చేశారు. ఆయన అధికారంలోకొచ్చాక తొలి మూడేళ్లపాటు ఆ పథకాన్ని పూర్తిగా నిలిపేసిన జగన్‌.. విమర్శలకు జడిసి నాలుగో ఏడాది నుంచి అమలు చేస్తున్నా.. రాయితీని వంద శాతం నుంచి 90 శాతానికి తగ్గించారు. అంతటితో ఆగలేదు. జీఎస్టీ భారాన్ని పూర్తిగా రైతులపైనే వేసేశారు. చివరకు ఆ పథకం అందరికీ అందకుండా నానా అడ్డంకులూ సృష్టిస్తున్నారు.

వైకాపా అధికారంలోకొచ్చాక..

* జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఈ పథకాన్ని పక్కన పెట్టేశారు. ఈ పథకం తనది కాదన్న ధోరణితో తొలి మూడేళ్లపాటు అమలు చేయలేదు. రైతులకు ఎలాంటి పరికరాలనూ ఇవ్వలేదు.
* సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు కోసమని నాబార్డు నుంచి రూ. 616 కోట్ల రుణం తీసుకుని వాడేసుకుంది.
* గతంలో రైతులకు పరికరాలిచ్చిన సంస్థలకు బకాయిలు చెల్లించకుండా సతాయించింది.
* ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి డిమాండు విపరీతంగా పెరగడం, జగన్‌ తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో ఆయన తలొంచక తప్పలేదు. సంస్థలకు బకాయిలు చెల్లించి.. గతేడాది నుంచి పథకం అమలు చేస్తున్నారు.
* అయితే రాయితీని వందశాతం నుంచి 90 శాతానికి తగ్గించేసి ఎస్సీ, ఎస్టీ రైతులను ఉసూరుమనిపించారు.
* 2022-23లో 2.27 లక్షల ఎకరాల్లో మాత్రమే పరికరాలను అమర్చారు.
* ఈ ఏడాది పూర్తి మందకొడిగా సాగుతోంది. 2.50 లక్షల ఎకరాల్లో అమలు చేయాల్సి ఉండగా.. ఆగస్టు 8 నాటికి 25 వేల ఎకరాలకే వర్తింపజేశారు.  
* రైతులు పేర్లు నమోదు చేయించుకున్నాక నెలలు గడిచినా ఎవరూ పట్టించుకోవటం లేదు.

రాయితీకి కత్తెర

తెదేపా హయాంలో రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పదెకరాల విస్తీర్ణం వరకు 90% రాయితీపై గరిష్ఠంగా రూ. 2.80 లక్షల వరకు వెసులుబాటు ఇచ్చారు. వైకాపా హయాంలో అయిదెకరాలు పైబడిన రైతులకు 70% రాయితీ మాత్రమే అమలు చేస్తున్నారు. అంతేకాదు.. గతంలో ఈ పథకానికి సుమారు రూ. 3,600 కోట్ల వరకు ఖర్చు చేయగా.. జగన్‌ సర్కారు అందులో సగం కూడా చేయలేదు.

పన్నుల భారమూ రైతులపైనే

ఈ పథకం పేరుతో పన్నుల రూపంలో ఎస్సీ, ఎస్టీ రైతులను బాదేస్తోంది జగన్‌ సర్కారు. బిందు, తుంపర సేద్య పరికరాలపై గతంలో ఉన్న వ్యాట్‌ భారాన్ని తప్పించేందుకు తెదేపా ప్రభుత్వం ఎకరాకు రూ. 5 వేల వరకు మినహాయింపు ఇచ్చింది. 2018 నుంచి సూక్ష్మసేద్య పరికరాలపై 12% జీఎస్‌టీ అమల్లోకిరాగా... రైతులపై భారం తగ్గిస్తూ 6% వారు చెల్లించాలని, మిగిలిన 6% ప్రభుత్వం భరిస్తుందని 2018 మే 11న గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైకాపా వచ్చాక మొత్తం పన్నుల్ని రైతులే భరించాల్సి వస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో..

  • రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రైతులకు సూక్ష్మసేద్యం పథకం కింద 100% రాయితీపై తుంపర, బిందు సేద్య పరికరాలిచ్చేవారు.
  • రైతులు కోరిన వెంటనే ఈ పథకాన్ని వర్తింపజేసి, పరికరాలిచ్చేవారు.
  • 2014-19 మధ్యకాలంలో ఈ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది.  
  • అయిదేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ రైతుల కోసం రూ. 3,600 కోట్లను ఖర్చు చేశారు.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు