రెండో రోజూ అట్టుడికిన సభ

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై రెండో రోజు శుక్రవారమూ శాసనసభ అట్టుడికింది. తెదేపా నినాదాలు, వైకాపా సవాళ్లతో సభ దద్దరిల్లింది.

Updated : 23 Sep 2023 07:06 IST

చంద్రబాబు అరెస్టుపై అసెంబ్లీలో ఉద్రిక్తత
తెదేపా నినాదాలు, వైకాపా సవాళ్లతో దద్దరిల్లిన వైనం
స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టిన తెదేపా సభ్యులు
విపక్ష ఎమ్మెల్యేలను దుర్భాషలాడిన మంత్రులు
అయిదుగురు తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

ఈనాడు, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై రెండో రోజు శుక్రవారమూ శాసనసభ అట్టుడికింది. తెదేపా నినాదాలు, వైకాపా సవాళ్లతో సభ దద్దరిల్లింది. ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి..’ అనే నినాదాలతో తెదేపా సభ్యులు సభను హోరెత్తించారు. అధికార పార్టీ తీరును నిరసిస్తూ విజిల్స్‌ వేస్తూ నిరసన తెలిపారు. సభ ప్రారంభంకాగానే తెదేపా సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక దశలో పలువురు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు.. తెదేపా సభ్యులపైకి దూసుకెళ్లారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెదేపా, వైకాపా సభ్యుల మధ్య మార్షల్స్‌ అడ్డుగోడలా నిలిచారు. తెదేపా సభ్యులపై మంత్రులు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిరసనలో పాల్గొన్నారు. గురువారం ముగ్గురిని సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్‌ చేసిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. శుక్రవారం తెదేపా ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లను సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్‌ చేశారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణబాబులను శుక్రవారం ఒక్కరోజు సభ నుంచి బహిష్కరించారు. దీన్ని నిరసిస్తూ మిగతా తెదేపా సభ్యులు సభను బాయ్‌కాట్‌ చేశారు.

ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఉండేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: బుగ్గన

ఉదయం సభ ప్రారంభమైన 12 నిమిషాలకే స్పీకర్‌ వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయం మొదలుకాగానే తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని తెదేపా సభ్యులు పట్టుబట్టారు. ఓ ప్రశ్నకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సమాధానమిస్తుండగా.. తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్‌ వెల్‌లో నిల్చొని, మిగిలినవారు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. సంబోధన, ప్రవర్తనే ముఖ్యం. ఇక్కడి వైకాపా సభ్యులందరికీ నోరు ఉంది. తెదేపా సభ్యులు ఎలాపడితే అలా మాట్లాడితే చూస్తూ ఉండేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు’ అని హెచ్చరించారు. మంత్రి అంబటి మాట్లాడుతూ.. ‘డైలాగులు ఏమైనా ఉంటే తెదేపా కార్యాలయంలో మాట్లాడుకోవాలి. ఇక్కడ తప్పుగా మాట్లాడితే ఊరుకోబోం’ అని వ్యాఖ్యానించారు. పోడియం పైనుంచి తెదేపా సభ్యుల నినాదాలు, కింది నుంచి వైకాపా సభ్యుల హెచ్చరికలతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

సభను తప్పుదారి పట్టిస్తున్నారు
- మంత్రి జోగి రమేశ్‌

సభ తిరిగి మొదలయ్యాక తెదేపా సభ్యులు పోడియంవైపు వెళ్లకుండా పదుల సంఖ్యలో మార్షల్స్‌ మోహరించారు. మార్షల్స్‌ సాయంతో అడ్డుకోవడాన్ని తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌, బుచ్చయ్యచౌదరి వీడియో తీశారు. తెదేపా సభ్యులు అక్కడే నిల్చొని ఉధృతంగా నినాదాలు చేశారు. వీడియో తీసినందుకు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లను సస్పెండ్‌ చేయాలని చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో ఆ మేరకు స్పీకర్‌ ప్రకటించారు.

తెదేపా నిరసనల మధ్యనే బిల్లుల ఆమోదం

టీ విరామం తర్వాత స్పీకర్‌ సీతారాం సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆరుగురు మాజీ ఎమ్మెల్యేల మృతికి సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం తెదేపా సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. వారి నిరసనల మధ్యే స్పీకర్‌ పలు బిల్లులను ప్రవేశపెట్టారు. ఏపీ ప్రత్యేక భద్రతా దళం-2023 బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్‌-2023 బిల్లు, ఏపీ ఆధార్‌-2023 బిల్లులను సభ ఆమోదించింది. తెదేపా నిరసనలు కొనసాగుతుండగానే ఆ పార్టీ సభ్యులు నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి, వెలగపూడి రామకృష్ణబాబులను సస్పెండ్‌ చేయాలని మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారిని శుక్రవారం ఒక రోజు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని