కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!

ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి.

Updated : 06 May 2024 06:45 IST

తిరుపతి ‘ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌’పై వైకాపా నేతల దాష్టీకం  
అన్నీ తెలిసినా నోరు మెదపని జగన్‌
అరాచకాలకు బెదిరి ముందుకురాని కొత్త కంపెనీలు
ఉపాధి దొరక్క రోడ్డున పడ్డ నిరుద్యోగులు
ఈనాడు, బిజినెస్‌ బ్యూరో

కామధేనువు దొరికితే రాక్షసులైనా రాజసంగా చూసుకుంటారు. అలాంటిది... ఉపాధి కల్పనలో కల్పతరువులాంటి ఫ్యాక్టరీలు వస్తే వాటినీ వెళ్లగొట్టేవారినేమనాలి? వైకాపా నేతలనాలేమో! రేణిగుంట ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌లో సాగుతున్న వ్యవహారం చూస్తే... అదే నిజమనక మానరు మరి!


‘‘మీ కంపెనీలో క్యాంటీన్‌ కాంట్రాక్టు ఎవరికి ఇస్తున్నారు..? ఇదిగో నా తరఫున ఓ మనిషిని పంపిస్తున్నా.. ఆయనకే ఇవ్వండి’’


‘‘మాకు తెలిసిన పిల్లలు ఉన్నారు. మీ కంపెనీల్లో వారికే ఉద్యోగాలు ఇవ్వండి, పెద్దగా చదువుకోలేదని, అనుభవం లేదని వంకలు పెట్టి పక్కకు నెట్టకండి’’


‘‘కొత్తగా భవనాలు కడుతున్నారు కదా.. ఇసుక, మట్టి పనుల కాంట్రాక్టు మా మనుషులు చేస్తారు, జేసీబీలు కూడా పంపిస్తున్నా.. వారు అడిగిన రేటు ఇచ్చేయండి’’

 రేణిగుంట ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లోని కంపెనీలకు వైకాపా నేతల బెదిరింపులు ఇవీ..


న్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. నిరుద్యోగులకు ఉపాధి చూపడంతోపాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కంపెనీలను ఏ ప్రభుత్వమైనా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది. నిర్వాహకులు అడిగిన    సదుపాయాలనూ కల్పిస్తుంది. కానీ జగన్‌ సర్కారు అంటేనే ‘రివర్స్‌’ కదా..! ఆయన నిరంకుశ పాలనతో ఈఎంసీలో తమ కంపెనీలు నెలకొల్పాలంటేనే నిర్వాహకులు వణికిపోయారు. జగన్‌ విధానాలను పుణికిపుచ్చుకున్న వైకాపా నేతలు వారిని రాచిరంపాన పెట్టారు. ‘మేం చెప్పింది చేయాల్సిందే.. లేకుంటే మీ ఇష్టం..’’ అన్నట్లుగా వ్యవహరించారు. వారి బెదిరింపులు, వేధింపులను వేగలేక కొన్ని కంపెనీలు ఇక్కడ తమ ప్లాంట్లను నెలకొల్పడానికి వెనకడుగు వేశాయి. పర్యవసానంగా.. రాష్ట్రంలోని వేలమంది    నిరుద్యోగులకు ఉపాధి దూరమైంది.  

రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకే అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఈఎంసీని ప్రతిపాదించారు. వాటికి ప్రభుత్వం భూములు   కేటాయించగా.. అందుకు అవసరమయ్యే వనరులు కల్పించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. 2015లో తెదేపా ప్రభుత్వ హయాంలో రేణిగుంట  విమానాశ్రయానికి ఎదురుగా ఈఎంసీ-1 (శ్రీవేంకటేశ్వర మొబైల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌)ను 122 ఎకరాల్లో ప్రారంభించింది. 2019లో ఈఎంసీ-2 క్లస్టర్‌కు 502 ఎకరాలు కేటాయించింది. అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో ఒప్పందం చేసుకున్నవి మినహా.. జగన్‌ జమానాలో ఇక్కడికి ఒక్క కొత్త కంపెనీ కూడా రాలేదు. కారణం.. ఇప్పటి వైకాపా సర్కారుకు ఈఎంసీ విస్తరణ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఆసక్తి లేకపోవడమే. గుత్తేదారులకు పనులను కట్టబెట్టడం, తన అనుచరగణానికి లబ్ధిచేకూర్చడంపై జగన్‌కు ఉన్న శ్రద్ధ.. ఈఎంసీ కార్యకలాపాలపై ఉంటే 50 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించేది. కంపెనీల   నిర్వాహకులను ఇబ్బంది పెడుతున్న తమ నేతలను కట్టడి చేసినా ఈ క్లస్టర్‌ విస్తరించేది. వైకాపా నేతలు పెడుతున్న ఇబ్బందుల గురించి   నిర్వాహకులు తాడేపల్లి ప్యాలెస్‌ దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన లేదు.


2019 వరకు అన్నీ అనుకున్న ప్రకారమే..

2019కు ముందు గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు తమ ప్లాంట్లను నెలకొల్పాయి. కార్బన్‌, సెల్‌కాన్‌ తదితర దేశీయ మొబైల్‌ ఫోన్‌ సంస్థలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. ఓపో, రియల్‌మీ ఫోన్ల తయారీ సంస్థ విన్‌టెక్‌, కార్బన్‌ అనుబంధ సంస్థ నియోలింక్స్‌, ప్రముఖ బ్రాండ్ల సెల్‌ఫోన్లకు కెమెరా లెన్స్‌ తయారు చేసే సన్నీ ఓపోటెక్‌, యాపిల్‌ ఉత్పత్తులకు కేబుళ్లు-ఛార్జర్లు తయారు చేసే ఫాక్స్‌లింక్‌ యూనిట్లు    ఏర్పాటయ్యాయి. ఆయా యూనిట్లలో 80% వరకు ఉద్యోగాలను పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికే కేటాయించారు. వారిలోనూ 60% మంది మహిళలే.

ఈఎంసీ-2 క్లస్టర్‌లో అగ్రశ్రేణి సంస్థలకు స్థలాలు కేటాయించి 2019 ఫిబ్రవరిలో భూమిపూజ చేశారు. అందులో అమెరికా దిగ్గజ టెలికాం సంస్థ అయిన    టి మొబైల్‌కు ఫోన్లు, మరో కంపెనీకి సెట్‌ టాప్‌ బాక్సులు తయారు చేసే విన్‌టెక్‌ సంస్థలు ప్లాంట్లను నెలకొల్పాయి.


వైకాపా వచ్చాక తారుమారు

2019లో జగన్‌ సీఎం అయ్యాక రేణిగుంటలోని ఈఎంసీ పరిస్థితి తారుమారైంది. తన సొంత జిల్లా అయిన కడపకు రేణిగుంట కొంత    దగ్గరగా ఉన్నందున.. సీఎం జగన్‌ మరింత శ్రద్ధ వహించి ఈ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తారని అందరూ ఆశించారు. కానీ, దానికి అంకురార్పణ చేసింది చంద్రబాబునాయుడు కదా..? ఆ కారణంగా జగన్‌ ఈ పారిశ్రామికవాడను విస్తరించడానికి కాదుకదా.. అసలు గుర్తించడానికే ఇష్టపడలేదు.

  • క్లస్టర్లలో కొత్త యూనిట్లను స్థాపించడానికి జగన్‌కు మనసు రాకపోగా.. అందులోని ప్లాంట్లపై తన పార్టీ నాయకులు వీరంగం సృష్టిస్తున్నా అడ్డుకోలేకపోయారు. దీన్ని ఆసరాగా తీసుకున్న వైకాపా నేతలు కంపెనీ నిర్వాహకులపై రెచ్చిపోయారు. తాము చెప్పినట్లు చేయాలని హుకుం జారీ చేశారు. అడిగినంత ఇచ్చుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. అలా చేయకపోతే లేనిపోని కేసులు పెట్టి  వేధించారు.
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో పాటు టాటా గ్రూపునకు చెందిన వోల్టాస్‌.. తిరుపతిలో భారీ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఇంకేం.. వైకాపా పరివారం ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. వారి ఇబ్బందులు, అరాచకాలు తెలుసుకున్న సంస్థలు.. వెనక్కి వెళ్లాయి. విడిభాగాలు తయారు చేసేందుకు యూనిట్లు నెలకొల్పుదామనుకున్న 15 సంస్థలు పారిపోయాయి. ఫాక్స్‌లింక్‌ కూడా కొన్ని కార్యకలాపాలను బెంగళూరుకు తరలించేసింది.
  • ఈఎంసీ రెండు క్లస్టర్లలో ఏర్పాటయ్యే యూనిట్లతో కనీసం 50,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తొలుత అంచనా వేశారు.  కానీ ఇప్పుడు 15,000 మందికి మించి పనిచేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన సంస్థలే ఈ కష్టాలు తట్టుకుని మనుగడ సాగిస్తున్నాయి. జగన్‌ సర్కారు పుణ్యమా అని ఒక్క కొత్త యూనిట్‌ కూడా ఏర్పాటు కాలేదు.
  • శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో పైపుల తయారీ సంస్థ నిర్వాహకులు కూడా వైకాపా నాయకులు అడిగినప్పుడల్లా ముడుపులు సమర్పించుకున్నారు. అయినా వేధింపులు మానుకోలేకపోయారు. చివరికి వారి ఆగడాలను   తాళలేక నిర్వాహకులు ప్లాంటునే మూసి వెళ్లిపోయారు.
  • ఇక్కడికి సమీపంలోని శ్రీసిటీ సెజ్‌లో ఫాక్స్‌కాన్‌ సంస్థ గత తెదేపా ప్రభుత్వ హయాంలో 16,000 మందికి ఉద్యోగాలు కల్పించింది. జగన్‌ సీఎం అయ్యాక ఇక్కడి తన కార్యకలాపాల్లో కొంతభాగాన్ని తమిళనాడుకు తరలించినట్లు సమాచారం. దీంతో స్థానికంగా ఉద్యోగాల సంఖ్య బాగా తగ్గిందని చెబుతున్నారు.

రూ.వేల కోట్ల ఆదాయానికి గండి

త ఆర్థిక సంవత్సరంలో.. ఈఎంసీలోని డిక్సన్‌ టెక్నాలజీస్‌ వార్షిక టర్నోవర్‌ సుమారు రూ.4,152 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ఫాక్స్‌లింక్‌ ఇండియా   రూ.756 కోట్లు, సన్నీ ఓపోటెక్‌ రూ.1,476 కోట్ల టర్నోవర్‌ నమోదైనట్లు తెలిసింది. కేవలం ఈ మూడు సంస్థల వార్షిక టర్నోవర్‌ కలిపితేనే సుమారు రూ.6400 కోట్లు ఉంది. అదే అప్పటి ముఖ్యమంత్రి    చంద్రబాబునాయుడు హయాంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలతోపాటు ప్రస్తుత జగన్‌ సర్కారు ఇక్కడ మరిన్ని సంస్థలను ఏర్పాటు చేయిస్తే వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ లభించేది. ప్రభుత్వానికీ పన్నుల రూపేణ రూ. కోట్ల ఆదాయం సమకూరేది! కానీ జగన్‌ నిరంకుశ ధోరణితో ఆ మొత్తం  ఆదాయానికి గండిపడింది. ఎలక్ట్రానిక్‌ సంస్థలకు కీలకమైన సెమీ కండక్టర్‌, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ (పీసీబీ) కంపెనీలు కూడా ఏర్పాటైతే.. రాష్ట్రానికి చెందిన వేల మందికి ఉద్యోగాలు లభించేవి. సెమీకండక్టర్‌   రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోంది. ఆ రంగాన్ని అందిపుచ్చుకోవడంలో జగన్‌ ఘోరంగా విఫలమయ్యారు.

 రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంటే జగన్‌ ఓర్చుకోలేరేమో అని ఇవన్నీ గమనిస్తున్న తిరుపతి ప్రాంత ప్రజలు భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని