JN.1 Covid variant: జేఎన్‌.1తో ఆందోళన అక్కర్లేదు

కరోనా వైరస్‌లోని కొత్త ఉత్పరివర్తనం(వేరియంట్‌) జేఎన్‌.1 అంత ప్రమాదకరమేమీ కాదని, ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) హాస్పిటల్స్‌ ఛైర్మన్‌, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.

Updated : 24 Dec 2023 08:27 IST

ప్రపంచంలో ఎక్కడా దీన్ని ఉపద్రవంగా ప్రకటించలేదు
మళ్లీ టీకా అవసరమా? లేదా? అని అధ్యయనం చేస్తున్నాం
ముప్పున్న వారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
‘ఈనాడు’ ముఖాముఖిలో ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వైరస్‌లోని కొత్త ఉత్పరివర్తనం(వేరియంట్‌) జేఎన్‌.1 (JN.1 Covid variant) అంత ప్రమాదకరమేమీ కాదని, ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) హాస్పిటల్స్‌ ఛైర్మన్‌, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. 2020లో ప్రపంచాన్నే స్తంభింపజేసి.. 2021లో డెల్టా రూపంలో పెద్దసంఖ్యలో ప్రాణాలు హరించిన కొవిడ్‌.. 2022 తొలినాళ్లలో ఒమిక్రాన్‌గా విరుచుకుపడింది. దాదాపు 18 నెలలుగా మహమ్మారి జాడ క్రమేణా కనుమరుగైంది. మాస్కులు వదిలేసి ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు. ఈ సమయంలో ‘జేఎన్‌.1’ రూపంలో కరోనా మళ్లీ జడలు విప్పుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజల్లో కొవిడ్‌ భయాలు మెదులుతుండడంతో.. కొత్త ఉత్పరివర్తనంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘జేఎన్‌.1’ స్వభావం.. దాని వ్యాప్తి తీవ్రత.. ప్రమాదమా? తదితర అంశాలపై డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి ‘ఈనాడు’ ముఖాముఖిలో పలు అంశాలు వెల్లడించారు.

మళ్లీ కరోనానా అనే ఆందోళన  ప్రజల్లో ఉంది.. ఇది కొత్త వైరసా

ఇది కొత్త వైరస్‌ కాదు. కానీ కొత్త వేరియంట్‌. కరోనా చైనాలో పుట్టినప్పటి నుంచి అనేక ఉత్పరివర్తనాలు చెందింది. అందులో ఒకటి ‘ఎక్స్‌బీబీ’. దాని ఉత్పరివర్తనమే ‘జేఎన్‌.1’. జన్యుక్రమ విశ్లేషణ చేయగా.. స్పైక్‌ ప్రొటీన్‌లో వృద్ధి చెందినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరప్‌లోని లక్సంబర్గ్‌ అనే చిన్న దేశంలో మొదట బయటపడింది. ఆ తర్వాత యూరప్‌లోని ఇతర దేశాల్లోనూ అక్కడక్కడా కనిపించింది. కానీ అంత ఉద్ధృతంగా వ్యాప్తి చెందలేదు. ఒకవేళ ఎపిడెమిక్‌(అంటువ్యాధి) అయి ఉంటే.. ఈపాటికి అంతటా వ్యాప్తి చెందేది. డెల్టా, ఒమిక్రాన్‌లు నెలరోజుల్లోనే ఎపిడెమిక్‌గా మారాయి. ప్రపంచ దేశాల్లో ఎక్కడా జేఎన్‌.1ను ఉపద్రవంగా ప్రకటించలేదు. ప్రస్తుతం సింగపూర్‌లో 56వేల కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్‌ కేసులు హాంగ్‌కాంగ్‌, చైనా వంటి దేశాల్లో కొంచం ఎక్కువగా ఉన్నాయి. దీని వ్యాప్తి, లక్షణాలు, పర్యవసనాలను వైద్యనిపుణులు సునిశితంగా గమనిస్తున్నారు. కేరళలో నమోదైన కేసుల నమూనాలను విశ్లేషిస్తే స్వల్ప సమస్యలు మాత్రమే ఉత్పన్నమవుతున్నాయని తెలుస్తోంది.

గతంలో తీసుకున్న టీకా సరిపోదా

మన దేశంలో అత్యధికుల్లో కొవిడ్‌ టీకా పొంది ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. ఈ కొత్త వేరియంట్‌కు అప్పటి టీకా పనిచేస్తుందా? లేదా? అని ఏఐజీ ఆధ్వర్యంలో అధ్యయనం ప్రారంభించాం. నమూనాలు సేకరించి వారి శరీరంలో కొత్త ఉత్పరివర్తనానికి సంబంధించిన రోగ నిరోధకశక్తి ఉందా? లేదంటే కొత్తగా టీకా తీసుకోవాలా? అనే కోణంలో పరిశీలన కొనసాగుతోంది. ఇందులో యాంటీబాడీస్‌తోపాటు మెమొరీ సెల్స్‌నూ పరిశోధిస్తున్నాం. యాంటీబాడీస్‌ ఇప్పుడు లేకపోయినా.. ఆ మెమొరీ సెల్స్‌ ఎక్కువగా ఉంటే టీకా అవసరం లేదు. ముప్పు పొంచి ఉన్న వర్గాలకు ఇస్తే చాలు. ఒకవేళ ఉద్ధృతంగా వ్యాప్తి చెందే అవకాశముంటే విస్తృతంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల ప్రకారం.. టీకాకు సంబంధించిన మెమొరీ సెల్స్‌ ఉన్నట్లుగానే తెలుస్తోంది. ఎందుకంటే ఈ కొత్త వేరియంట్‌ వచ్చిన వారిలో లక్షణాలు అతి స్వల్పంగానే కనిపించాయి. సింగపూర్‌, లండన్‌ తదితర చోట్ల నుంచి విమానాల్లో వచ్చిన వారిలోనే ఈ కొత్త ఉత్పరివర్తనం లక్షణాలు కనిపించాయి. మన దగ్గర ఎక్స్‌బీబీ వేరియంట్‌ కనుమరుగై చాలా కాలమైంది. ఇప్పుడు పాజిటివ్‌గా తేలితే.. జేఎన్‌.1 అని అనుమానించి జన్యుక్రమ విశ్లేషణ చేయాలి.

ఉద్ధృతంగా వ్యాపించే అవకాశాలున్నాయా

మన దగ్గర ప్రధానంగా వూహాన్‌, డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్లు విజృంభించాయి. ఇవి మూడూ ఎపిడెమిక్స్‌.. అంటే బాగా ఉద్ధృతంగా వ్యాప్తి చెందాయి. ఇప్పుడు గుర్తించిన జేఎన్‌.1 ప్రస్తుతం కేరళ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమవడాన్ని బట్టి ఎండెమిక్‌(స్థానికంగా వ్యాప్తి చెందే వ్యాధి)గా భావించవచ్చు. ఇది ఉపద్రవంగా మారే అవకాశాలున్నాయా? అనేది మా అధ్యయన ఫలితం వచ్చాక అంటే మరో 7-10 రోజుల్లో తెలిసిపోతుంది. ప్రస్తుతానికి కేరళ, సింగపూర్‌, లండన్‌ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. 

మళ్లీ మాస్కు ధరించడం తప్పనిసరా

ఇంకా జేఎన్‌.1ను ఉపద్రవంగా గుర్తించనందున అందరూ మాస్కులు వాడాల్సిన అవసరం లేదు. 60 ఏళ్లు దాటిన వారు.. మధుమేహం నియంత్రణలో లేనివారు.. గర్భిణులు.. దీర్ఘకాలంగా స్టిరాయిడ్స్‌ వాడుతున్నవారు.. గుండె, మూత్రపిండాలు, కాలేయం తదితర వ్యాధులతో బాధపడుతున్నవారు.. క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నవారు.. బహిరంగ ప్రదేశాలకు, రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రం వేసుకుంటే చాలు. ఒకవేళ ఈ వేరియంట్‌ ఎపిడెమిక్‌గా మారితే మాత్రం అందరూ మాస్కులు వేసుకోవాల్సి వస్తుంది.


లక్షణాలు ఎలా ఉన్నాయి?

జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరంతోపాటు సైనసైటిస్‌ ఎక్కువ మందిలో కనిపిస్తోంది. కండరాల నొప్పి సైతం ఉంటోంది. పాజిటివ్‌గా తేలిన వారిలో ఒకరిద్దరు మినహా ఎవరూ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాలేదు.


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

ఇప్పటి వరకూ ఉన్న అంచనాల ప్రకారం.. ఈ వేరియంట్‌ కొద్దిరోజులు ఉండి కనుమరుగై పోతుంది. శాస్త్రీయ నిరూపణకు అధ్యయనం చేస్తున్నాం. ఫలితాలు ప్రభుత్వానికీ పంపిస్తాం. కేంద్రం తదుపరి కార్యాచరణకు మా అధ్యయనం ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు వంటి లక్షణాలున్నప్పుడు మాస్కు ధరించడం మంచిది. కుటుంబ సభ్యులు, ఇతరులకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు మానుకోవాలి. లక్షణాల ఆధారంగా మందులు వాడితే 3-5 రోజుల్లో తగ్గిపోతాయి. అలా కాకుండా జ్వరం రావడం, ఎక్కువగా దగ్గు వచ్చి పసుపు రంగులో తెమడ పడడం వంటి సమస్యలు వేధిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రజలు ఇన్‌ఫ్లూయెంజా టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. నిజానికి కొవిడ్‌ కంటే ఫ్లూ ప్రమాదకరమైంది. ఇది వస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరి ప్రమాదకర పరిస్థితుల్లోకి ఎదురయ్యే అవకాశాలుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని