400 సీట్లు గెలుస్తామంటున్న మోదీకి పొత్తులెందుకు?: సీఎం రేవంత్‌రెడ్డి

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని చెబుతున్న ప్రధాని మోదీ.. పొత్తులెందుకు పెట్టుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated : 10 Mar 2024 08:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని చెబుతున్న ప్రధాని మోదీ.. పొత్తులెందుకు పెట్టుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబునాయుడుతో, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌, కర్ణాటకలో దేవెగౌడ, బిహార్‌లో నీతీశ్‌తో.. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ మోదీ పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టించి.. వారితో కలుస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ నగరంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మేడ్చల్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. బైరామల్‌గూడలో నిర్మించిన పైవంతెన, ఉప్పల్‌ నల్ల చెరువు సమీపంలో నిర్మించిన సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రజా ఆశీర్వాద సభలో, బైరామల్‌గూడ, ఉప్పల్‌ కార్యక్రమాల్లోనూ ప్రసంగించారు. ‘‘గత పదేళ్లలో భారాస అభివృద్ధిని గాలికొదిలేసింది. మేం సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాం. మన ప్రభుత్వాన్ని పడగొట్టేవారు ఉన్నారా? కాంగ్రెస్‌ కార్యకర్తలు తలుచుకుంటే.. పక్కనే ఉన్న కేసీఆర్‌ ఫాంహౌస్‌లోని గోడల్లో ఒక్క ఇటుకైనా ఉంటుందా? ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో ఎవరినైనా కొనాలని చూస్తే.. తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా?

28 వేల ఉద్యోగాల్లో 43 శాతం ఆడబిడ్డలకే...

పదేళ్లు అధికారంలో ఉండి.. ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా కేసీఆర్‌ ఇచ్చారా? విద్యార్థులు కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ.. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కల్పించింది. మేం అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 28 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. ఇచ్చిన ఉద్యోగాల్లో 43 శాతం మంది ఆడబిడ్డలే ఉన్నారు. మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగాయని, మరమ్మతులు చేయడం లేదని కేటీఆర్‌ అంటున్నారు. ఇల్లు కడుతుంటే.. రెండు పిల్లర్లు కుంగితే నిలబడుతుందా? మేడిగడ్డలో దాదాపు పది పిల్లర్లు 2 మీటర్ల మేర కుంగిపోయాయి. అది మరమ్మతుకు పనికివస్తుందో, లేదో నిపుణులు తేల్చుతారు. 40-50 ఏళ్లయినా మేం కట్టిన నాగార్జునసాగర్‌, శ్రీశైలం అలాగే ఉన్నాయి. ఎన్ని తుపాన్లు వచ్చినా తట్ట మట్టి అయినా కొట్టుకుపోయిందా? రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం.. మూణ్నాళ్లకు కూలుతుందా?’ అని విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని