అన్నక్యాంటీన్‌ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్‌ అంటూ అధికారుల అభ్యంతరం

అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్‌కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated : 19 Mar 2024 08:26 IST

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్‌కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో 229 రోజులుగా నిర్వహిస్తున్న ఆ క్యాంటీన్‌ను మూసివేస్తున్నట్లు తెదేపా నాయకులు తెలిపారు. పేదల ఆకలి తీర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అన్న క్యాంటీన్‌లను వైకాపా ప్రభుత్వం వచ్చాక మూసివేశారు. దీంతో విజయనగరం జిల్లా ఎస్‌.కోట తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా మాజీ ఎమ్మెల్యే లలితకుమారి.. రోజుకు కనీసం 500 మంది ఆకలి తీరేలా క్యాంటీన్‌ను ఏర్పాటుచేశారు. దీన్ని అప్పట్లో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. రోజూ తెదేపా శ్రేణులు వచ్చి భోజనం వడ్డిస్తూ సేవలందిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందంటూ ఆదివారం వీఆర్వోలు క్యాంటీన్‌ వద్దకు వచ్చి అక్కడ అతికించిన పార్టీ నేతల పోస్టర్లు తొలగించారు. రిటర్నింగ్‌ అధికారి మురళీకృష్ణ నిర్వాహకులను పిలిచి క్యాంటీన్‌ను మూసివేయాలని, లేదా నిర్వహణకయ్యే ఖర్చును ఎమ్మెల్యే అభ్యర్థి వ్యయ ఖాతాలో వేస్తామని తెలిపారు. దీంతో మంగళవారం నుంచి క్యాంటీన్‌ మూసివేయనున్నట్లు తెదేపా నాయకులు కిరణ్‌, చెల్లయ్య ఆర్వోకు తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టణంలోని పేదలు ఇక భోజనం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని