జగన్‌ పాలనలో అకా‘డమ్మీలు’!

రాష్ట్రంలో సంస్కృతి, సాహిత్యం, సంగీతం, నృత్యం, హరికథ, బుర్రకథ... తదితరాలకు పూర్వవైభవం కల్పించడానికి వైకాపా ప్రభుత్వం ప్రత్యేకంగా అకాడమీలకు అంకురార్పణ చేసింది.

Updated : 21 Mar 2024 09:57 IST

రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన వైనం
వైకాపా హయాంలో వన్నెతగ్గిన కళలు,  సాహిత్యం, సంగీతం
చరిత్ర, సంస్కృతి, సైన్స్‌, టెక్నాలజీ రంగాలదీ అదేబాట

కళలు, సాహిత్యం, సంగీతం...
ఇవి ప్రజల్లో చైతన్యం రగిలించే మాధ్యమాలు!
చరిత్ర, సంస్కృతి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ...
గతాన్ని మననం చేసుకుని...
వర్తమానంతో పోల్చుకుంటూ...
భవిష్యత్తుకు పటిష్ఠ అడుగులు వేసేందుకు బాటలుపరిచే రంగాలివీ...
జనజాగృతంలో కీలకపాత్ర పోషిస్తూ సమాజానికి దిశానిర్దేశం చేయడంలో ముఖ్య భూమిక వహించాల్సిన ఈ రంగాలు, మాధ్యమాలను జగన్‌ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. వాటికి జవసత్వాలు కలిగించాల్సిన అకాడమీలను డమ్మీలుగా తయారు చేసింది... ఫక్తు.. రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసింది.

రాష్ట్రంలో సంస్కృతి, సాహిత్యం, సంగీతం, నృత్యం, హరికథ, బుర్రకథ... తదితరాలకు పూర్వవైభవం కల్పించడానికి వైకాపా ప్రభుత్వం ప్రత్యేకంగా అకాడమీలకు అంకురార్పణ చేసింది. వీటిని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో జగన్‌ సర్కారు చూపిన చొరవను చూస్తే ఆయా రంగాలకు ఇక మహర్దశ పట్టినట్లేనన్న భావన కలిగింది. రాష్ట్రంలో సంస్కృతి కొత్త పుంతలు తొక్కనుందని, సాహిత్యానికి కొత్త పుటలు చేరతాయని, సంగీతం సరికొత్త పల్లవిని ఎత్తుకుంటుందని.. కళలు తళుకులీనుతాయని ఆశలు కలిగాయి. కానీ... అదంతా భ్రాంతియే అని తెలుసుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. వైకాపా ప్రభుత్వం అకాడమీలను ఉత్సవ విగ్రహాలుగా చేసి, వాటిని రాజకీయ కేంద్రాలుగా మార్చేయడమే ఇందుకు కారణం.


అద్దె భవనంలో ఏడు సంస్థలు

కళలు, సాహిత్యం, సంస్కృతి తదితరాలకు జవసత్వాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య, సంగీత నృత్య, నాట్య, జానపద-సృజనాత్మకత, దృశ్య కళ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, చరిత్ర అకాడమీలను ఏర్పాటు చేసింది. ఏడు అకాడమీలకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించింది. జీతభత్యాల కింద నెలకు ఒక్కో ఛైర్మన్‌కు రూ.1.20 లక్షలు, ఒక్కో డైరెక్టర్‌కు రూ.12 వేల చొప్పున ఇస్తోంది. కానీ, అసలు లక్ష్యం మరచి... అకాడమీలను అడ్డంపెట్టుకుని తమ పార్టీ నేతలకు పదవులు కట్టబెట్టి జీతభత్యాల ద్వారా లబ్ధిచేకూర్చింది. క్రియేటివ్‌ హెడ్‌ అంటూ మరో పోస్టును సృష్టించి ఆ పార్టీవారికి ఉపాధి కల్పించింది. ఈ అకాడమీలన్నింటినీ విజయవాడలోని ఒక అద్దె భవనంలో కొలువుదీర్చింది. అంతకుమించి కళలకు జీవం పోసింది లేదు. సాహిత్యానికి మేలు చేకూర్చిందీ లేదు. వాటి అభివృద్ధికి నిధులు ఇచ్చింది అంతకన్నా లేదు. తరచి చూస్తే ఆ అకాడమీల ద్వారా జగన్‌ ప్రభుత్వం ఏ ఒక్క రంగాన్ని కూడా ఉద్ధరించింది లేదు.


తెలంగాణలో 200 పుస్తకాల ముద్రణ

తెలంగాణ సాహిత్య అకాడమీ ఆ రాష్ట్రంలో 2017వ సంవత్సరం నుంచి ఇటీవల వరకు 200 పుస్తకాలను ముద్రించింది. ప్రజలు, విద్యార్థులకు గ్రామాల చరిత్రపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో డిగ్రీ విద్యార్థులను కలుపుకొని ‘మన ఊరు- మన చరిత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థులతోనే గ్రామ చరిత్ర రాయించే ప్రయత్నం చేసింది. ఏపీలో మాత్రం ఈ అకాడమీలో ఎలాంటి కార్యక్రమం, కార్యాచరణ చేపట్టింది లేదు.


ఏం చేయాలి? ఏం చేస్తోంది...?

  • తెలుగు భాష మాండలికాలను గుర్తించి ప్రోత్సహించడంతోపాటు వాటిని భావితరాలకు అందించేందుకు సాహిత్య అకాడమీ చర్యలు తీసుకోవాలి. సాహిత్య పరిరక్షణ, పుస్తకాల ముద్రణలోపాటు ప్రజలు, విద్యార్థుల్లో పఠనాన్ని మెరుగుపర్చాలి. అయితే... జగన్‌ పాలనలో సాహిత్యమంటే ప్రతిపక్షాలపై బూతులతో విరుచుకుపడడంగా మారింది. ఎంత ఎక్కువ తిడితే అంత గొప్ప. ఆయన ఇదే సాహిత్యం అనుకున్నారేమో! అందుకే సాహిత్య అకాడమీకి నిధులివ్వకుండా దాన్ని మూలకుపడేశారు.
  • తోలు బొమ్మలాట, హరికథ, బుర్రకథ వంటి జానపద కథలు కనుమరుగవుతున్నాయి. ఆలయ, జాలరి, థింసా, సవర, గదబ, కోయ, లంబాడాల నృత్య రూపాలు ప్రాభవం కోల్పోతున్నాయి. ఆదివాసీలు, ఇతర సంచార సమూహాల సంప్రదాయ సంగీతం, నృత్య రూపకాల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. వీటి పరిరక్షణకు సంగీత, నృత్య అకాడమీ పనిచేయాలి. అసలు దీని ఉనికే ప్రశ్నార్థకమైంది.
  • పద్య నాటకం, యక్షగానం, వీధి భాగవతం లాంటి సంప్రదాయ థియేటర్‌ రూపాలను పరిరక్షించడం, వాటిని ప్రోత్సహించడం నాటక అకాడమీ బాధ్యత. దీనికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఈ అకాడమీ ఉసూరుమంటోంది.
  • ఆధునిక సమాజాన్ని ఆకర్షించేలా డప్పులు, తప్పెటగుళ్లు, గరగల వంటి జానపద కళారూపాలకు జీవం పోయాలన్న ఉద్దేశంతో జానపద, సృజనాత్మకత అకాడమీని సర్కారు ఏర్పాటు చేసింది. వడ్రంగి, కుమ్మరి, బుట్టలు, ఇటుకల తయారీ తదితర చేతివృత్తుల వివరాలను సేకరించి, భద్రపరచడం కూడా దీని విధే. ఈ అకాడమీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలే లేదు.
  • పెయింటింగ్‌, గ్రాఫిక్స్‌ వంటి ఫైన్‌ ఆర్ట్స్‌ రంగాలపై అధ్యయనం చేసే పరిశోధకులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన దృశ్య కళ అకాడమీ నిస్తేజంగా మారిపోయింది. అమరావతి, కళింగ, ఇతర దృశ్య కళలు, చారిత్రక వైభవాన్ని కాపాడుకునేందుకు ఈ అకాడమీ కృషి చేయాలి. రాతి, చెక్కబొమ్మలు, శిల్పాలు, కలంకారీ,  కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, హస్తకళ రూపాలను ప్రోత్సహించాల్సి ఉన్నా నిధుల్లేక అడుగు ముందుకు పడని దుస్థితి నెలకొంది.
  • పిల్లలు, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ ఉనికి కోల్పోతోంది.
  • వివిధ ప్రాంతాల సాంస్కృతిక వారసత్వాన్ని వెలికితీయడానికి ప్రయత్నించాల్సిన చరిత్ర అకాడమీ వైకాపా వారికి ఉపాధి కల్పన కేంద్రంగా మారింది.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని