Dharmareddy: ధర్మారెడ్డి లేకుంటే దర్శనాలు ఎలా?

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్యనిర్వహణాధికారి (ఎఫ్‌ఏసీ)గా, తితిదే పరిధిలోని పలు సంస్థల డైరెక్టర్‌గా ఏకకాలంలో వివిధ పోస్టులు నిర్వహిస్తున్న ఏవీ ధర్మారెడ్డితో ముఖ్యమంత్రి జగన్‌ బంధానికి, ఆయనపై సీఎం చూపించే అవ్యాజమైన ప్రేమకు ఇదో మచ్చుతునక.

Updated : 24 Mar 2024 08:45 IST

వాపోతున్న ప్రభుత్వం.. డిప్యుటేషన్‌ పెంచాలని కేంద్రానికి లేఖ
తితిదే ఈవోగా ఆయన ఉంటేనే అన్నీ సాఫీగా నడుస్తాయట
పదవీ విరమణ వరకు తితిదేలోనే కొనసాగించాలని సిఫార్సు

ఈనాడు, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్యనిర్వహణాధికారి (ఎఫ్‌ఏసీ)గా, తితిదే పరిధిలోని పలు సంస్థల డైరెక్టర్‌గా ఏకకాలంలో వివిధ పోస్టులు నిర్వహిస్తున్న ఏవీ ధర్మారెడ్డితో ముఖ్యమంత్రి జగన్‌ బంధానికి, ఆయనపై సీఎం చూపించే అవ్యాజమైన ప్రేమకు ఇదో మచ్చుతునక. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్‌ (ఐడీఈఎస్‌) నుంచి వచ్చిన ధర్మారెడ్డికి కేంద్రం ఇప్పటికే పొడిగించిన రెండేళ్ల డిప్యుటేషన్‌ గడువూ ఈ ఏడాది మే 14తో ముగుస్తోంది. ఈ ఏడాది జూన్‌ 30కి ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. లెక్క ప్రకారం ఆయన మే 14న కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లాలి. కానీ, ఆత్మబంధువులాంటి ధర్మారెడ్డిని జగన్‌ అంత తేలిగ్గా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. జూన్‌ 30న ఆయన పదవీ విరమణ చేసేంత వరకు డిప్యుటేషన్‌ను పొడిగించాలంటూ దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ నెల 12న జగన్‌ లేఖ రాశారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి నాలుగురోజుల ముందు జగన్‌ ఈ లేఖ రాయడం విశేషం. ధర్మారెడ్డిని జూన్‌ నెలాఖరు వరకు తితిదే ఈవోగా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేఖలో సీఎం చెప్పిన కారణాలు చూస్తే బడి ఎగ్గొట్టేందుకు ఏ ఆరో తరగతి పిల్లవాడో హెడ్మాస్టర్‌కు రాసిన లేఖలో చెప్పే సాకులు గుర్తొస్తాయి. జగన్‌కు ధర్మారెడ్డి నమ్మినబంటని, దిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో కావలసిన పనులు చేసిపెడతారని, కేంద్ర ఎన్నికల సంఘం వంటి సంస్థల్లోనూ పలుకుబడి ఉపయోగిస్తారని, ‘అతి సున్నితమైన’ వ్యవహారాలనూ సీఎం కోసం సునాయాసంగా చక్కబెడతారని పేరుంది. తితిదే చరిత్రలో అనేక దశాబ్దాల తర్వాత నాన్‌ ఐఏఎస్‌ అధికారిని ఈవోగా నియమించడమే కాకుండా, ఎంతకాలం వీలైతే అంతకాలం ఆయన్ను ఆ పోస్టులో కొనసాగించేలా చూసేందుకు సీఎం ప్రయత్నించడం విశేషం.

రద్దీ సమయంలో ధర్మారెడ్డి ఉండకపోతే కష్టమట..

‘వేసవి రద్దీ,  ఇతర సమయాల్లో ఈవో ధర్మారెడ్డి సమర్థంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇంటర్‌ కేడర్‌ డిప్యుటేషన్‌ను ప్రధాని పెద్ద మనసుతో రెండేళ్లు పొడిగించారు. ఆ గడువు మే 14తో ముగుస్తోంది. మే, జూన్‌ నెలల్లో తిరుమలలో రద్దీ దృష్ట్యా ఈవో వంటి కీలకమైన పోస్టుల్లో ఉన్నవారిని మార్చడం సరికాదు. అనుభవంలేనివారిని ఈ పోస్టులో ఉంచితే నిర్వహణపరమైన లోపాలు తలెత్తి సంక్షోభానికి దారితీస్తుంది. శాంతిభద్రతల సమస్యగా మారుతుంది’ అని ఆ లేఖలో సీఎం ఏకరవు పెట్టారు. ఇదివరకెప్పుడూ వేసవి సెలవులే రానట్టూ, అప్పుడు రద్దీ లేనట్టూ, గతంలో ఉన్న అధికారులెవరూ అలాంటి పరిస్థితుల్ని చూడనట్టూ జగన్‌ పేర్కొనడం విడ్డూరం. కీలకమైన ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను, డీజీపీలనే ఉన్నపళంగా మార్చేస్తోంది. తితిదే ఈవోను మారిస్తే వ్యవస్థే స్తంభించిపోతుందన్నట్టు సీఎం లేఖ రాయడం వెనుక వేరే ప్రయోజనం కాక మరేముంటుంది?

జూన్‌ నెలాఖరు వరకు అధికారులే దొరకరట..

సీఎం రాసిన లేఖలో మరిన్ని ఆణిముత్యాలున్నాయి. అన్ని రాష్ట్రాలకు చెందిన చాలా మంది అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులుగా నియమించిందని.. ఎన్నికలు ముగిసేంత వరకు తితిదే ఈవోగా నియమించేందుకు సరైన అధికారి దొరకడం కష్టమవుతుందని సీఎం పేర్కొన్నారు. జూన్‌ నెలాఖరుకు మాత్రమే తితిదే ఈవోగా మరో అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించగలమని స్పష్టం చేశారు. కేంద్ర డిఫెన్స్‌ సర్వీస్‌కు చెందిన ధర్మారెడ్డి సేవలను ఎలా వాడుకోవాలో కూడా జగనే రక్షణ మంత్రికి సలహానిచ్చారు. ‘ధర్మారెడ్డి జూన్‌ 30న పదవీ విరమణ చేస్తున్నారు. మే 14న ఆయన రిపోర్టు చేసినా.. పదవీ విరమణకు గడువు తక్కువే ఉన్నందున ఆయన సేవలను మాతృసంస్థ సమర్థంగా ఉపయోగించుకోలేకపోవచ్చు’ అని పేర్కొన్నారు. ‘లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ ఆరు వారాలు పొడిగించండి. నా విజ్ఞప్తికి మీరు సానుకూలంగా స్పందిస్తే లక్షల మంది భక్తులకు సాఫీగా దర్శనమవుతుంది. మీకు, మీ కుటుంబానికి ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి’ అని లేఖలో సీఎం కాస్త సెంటిమెంట్‌నూ రంగరించారు.


ధర్మారెడ్డి ఒక్కరే దిక్కని సీఎం ఎలా చెబుతారు?
-నవీన్‌కుమార్‌రెడ్డి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌

‘తితిదేకి ధర్మారెడ్డి ఒక్కరే దిక్కన్నట్టు సీఎం చెప్పడమేంటి? ఎంతోమంది అపారమైన అనుభవం, నిజాయతీగల ఐఏఎస్‌ అధికారులు ఈవోలుగా సేవలందించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలి. ధర్మారెడ్డినే పూర్తి అదనపు బాధ్యతతో ఈవోగా ఎందుకు కొనసాగిస్తున్నారు? శ్రీవారికి సంబంధించిన బ్యాంకు డిపాజిట్లు, ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయా అనే అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయి. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని తక్షణం ఆయన్ను బదిలీ చేయాలి.’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని